జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక 2024 నవలా పోటీ విజేతలకు సన్మానం

Featured Image

సిరికోన సాహితీ అకాడమీ- జొన్నలగడ్డ రాంభొట్లు సరోజమ్మ స్మారక 2024 నవలా రచనల పోటీ విజేతల సన్మాన కార్యక్రమాన్ని గత ఆదివారం నాడు అంతర్జాలంలో నిర్వహించారు. పోటీ సమర్పకులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం-శారదలు సభను సమన్వయించారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణను చక్రవర్తి, పాలడుగు శ్రీచరణ్, జె.ఎస్.ఆర్.మూర్తి, అత్తలూరి విజయలక్ష్మి, నిర్మల ఘంటసాల, అరవింద పారనందిలు స్మరించారు. వారి జీవిత విశేషాలను, సాహితీ సేవలను కొనియాడారు.

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం స్వాగతోపన్యాసం చేశారు. 2021 నుండి ఈ నవలా రచన పోటీలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలు తనకు సంతృప్తిని ఇచ్చాయన్నారు. 2024 పోటీలకు కథావస్తువును సూచించకుండా, రచయితలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం అద్భుత స్పందనకు దారితీసిందని తెలిపారు. ప్రేమను, ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు పోటీకి సమర్పించారని పేర్కొన్నారు. కథావస్తువు, ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత, శైలి, సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా ప్రాథమిక వడబోత అనంతరం 26నవలలను తుదిపోటీకి ఎంపిక చేశామని వివరించారు.

అసాధారణ నిర్మాణ చతురతతో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తూ డా.బి.నాగశేషు రచించిన కిలారి ఉత్తమ నవలగా, మూడు తరాల నారీ చేతనకు అద్దం పడుతూ రెంటాల కల్పన రచించిన కావేరికి అటూ ఇటూ, నల్లమల చెంచుల జీవితాన్ని పరిచయం చేస్తూ రంజిత్ గన్నోజు లింగాల కంఠంలో నవలలు ప్రత్యేక బహుమతులకు ఎంపిక చేశామని తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్య రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ముఖ్య అతిథి కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ గంగిశెట్టి లక్ష్మీనారాయణ తనకు శిష్యులని, వారి ఆశయసాధనకు కొనసాగింపుగా సుబ్రహ్మణ్యం-శారదలు సిరికొన సాహిత్య అకాడమీ నవలా రచనా పోటీలు నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు లెనిన్ వేముల కిలారి నవలను ప్రస్తావిస్తూ ఆయా కుల వృత్తుల వారు వారి గ్రామీణ భాషలో మాట్లాడడాన్ని డాక్టర్ నాగశేషు తాను మాట్లాడే యాసలో మాటలు వ్రాయడం తనకు నచ్చిన అంశమని వివరించారు. పేదరికాన్ని, కులవివక్షను కేవలం ఎత్తిచూపడమే గాక బలహీనవర్గ ప్రజలు ఆధునిక సమాజపు ఆర్థిక పురోగతిని తమ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చుననేది విశ్లేషించారని అన్నారు. దర్భముళ్ల చంద్రశేఖర్ గంగిశెట్టిని గుర్తుచేసుకున్నారు.

పురస్కార గ్రహీతలైన డాక్టర్ నాగశేషు స్పందిస్తూ కులవృత్తులు చేసుకుంటూ జీవించే వారి పేర్లకు ముందు కిలారి అనే పదాన్ని జోడించి పిలిచే పద్దతి తాము పుట్టి పెరిగిన గ్రామీణ జనజీవనస్రవంతిలో భాగమైనందున తన నవలకు ఆ పేరు పెట్టినట్లు వెల్లడించారు. కల్పన రెంటాల ఆచార్య గంగిశెట్టితో తనకు గల సాన్నిహిత్యం గురించి గుర్తు చేసుకున్నారు. సమాజములో జరిగే సంఘటనలు స్త్రీలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనే అంశాలను తన నవలలో ప్రస్తావించాను అన్నారు. రంజిత్ గన్నోజు మాట్లాడుతూ చెంచుల జీవన విధానమును దగ్గరగా చూచినవాడిని కావడంచేత లింగ దాసు, మల్లి దాసు అనే రెండు పాత్రలను, చిన్నవయసులోనే పెళ్లయిన ఒక చెంచు బాలిక పాత్రను ఎంచుకొని, అడవికి దగ్గరిగా వున్నవారు మాట్లాడే తీరు..వారి జీవన వంటి విశేషాలతో ఆటవిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక అంశాలు మేళవించి ఈ నవలను రూపొందించినట్లు తెలిపారు. పురస్కార గ్రహీతలు సిరికోన సాహితీ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.

పాలకోడేటి సత్యనారాయణరావు, నరసరాజు, సరోజ కొమరవోలు, డాక్టర్ యు. నరసింహారెడ్డి, గోవర్ధనరావు నిడిగంటి, ఇక్బాల్, సోమశేఖర్, చంద్ర కన్నెగంటి, డాక్టర్ సూరం శ్రీనివాసులు, విట్టు బాబు, జయన్న, పాలపర్తి హవీలా, వీర్నపు చినసత్యం, విజయలక్ష్మి కందిబండ్ల, భాగ్యలక్ష్మి నల్లా, ఇస్మాయిల్ పెనుకొండ, సడ్లపల్లె, దార్ల సుప్రజ, శ్రీనివాసులు బసాబత్తుని తదితరులు పాల్గొన్నారు.

Tags-Sirikona Sahiti Academy 2024 Novel Competition Winners Felicitated

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles