ScienceAndTech

మనుషుల నడకపై పరిశోధనలు

research on human walking

మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకోడానికి ఉద్దేశించిన సాంకేతికతను అభివృద్ధిపరచడానికిగాను బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకు రూ.16.44 కోట్లు నిధులు అందాయి. మనుషులు ఎలా నడుస్తారో తెలుసుకోవడానికి ఇన్ని కోట్ల నిధులా? అని నోరెళ్లబెట్టకండి. మనం ఎలా నడుస్తున్నామో తెలుసుకుంటే మనం ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నాం, మనకు ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందో కూడా తెలుసుకోవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనిషి ఎలా నడుస్తున్నాడో అనే దాన్ని శాస్త్రీయ పరిభాషలో ‘‘గతిశీలత’’గా వ్యవహరిస్తారు. ఇది ఆరోగ్యాన్ని అంచనావేసే కీలకాంశాలలో ఆరోది. మెల్లగా నడిచేవారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందట. ఇలాంటివారికి రోగాలు ఎక్కువగా వస్తాయి. అంత తెలివితేటల గలవారు కూడా కాదట. అలాగే డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లు తిరిగి పడిపోయేదీ ఎక్కువగా వీరేనట. ఐరోపా సమాఖ్యలోని జనాభాలో 65 ఏళ్లు పైబడినవారు 19శాతానికి మించి ఉన్నారు. జీవితకాలం పెరుగుతుందంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి సంఖ్య కూడా పెరగడం సహజం. డిజిటల్‌ టెక్నాలజీతో గతిశీలత తక్కువగా ఉండేవారికి రోగనిర్ధారణ, సరైన వైద్యం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా 34 అంతర్జాతీయ ప్రభుత్వ-ప్రైవేటు కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ‘‘మొబిలైజ్‌-డి’’ పేరిట ఓ ప్రాజెక్టు ప్రారంభించాయి. గతిశీలతకు, రోగాలకు మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవడం ఈ ప్రాజెక్టు ధ్యేయం. ఇందుకోసం షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయంతోపాటు షెఫీల్డ్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్టుకు నిధులు అందించారు.