Politics

నాడు నాగలి పట్టిన రైతన్న. నేడు ఆంధ్రుల భవితకు చంద్రన్న.

its andhra chief minister chandrababu naidus birthday and here is what his life story is

నాగలి పట్టిన చేతులే…తెలుగు రాష్ట్రాల్లో సాంకేతికత తీసుకొచ్చాయి. విద్య కోసం 12 కి.మి. దూరం నడిచి వెళ్లిన అడుగులే…పరిపాలనలో సంస్కరణలకు ముందడుగు వేశాయి. డిగ్రీ చదివే రోజుల్లోనే సామాజిక సేవా ధృక్పథం ఉన్న ఆయన.. అంచెలంచులుగా ఎదిగి ఆధునిక అభివృద్ధికి ఆధ్యుడుగా మారారు. ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకున్న నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు చూస్తే ఔరా అనాల్సిందే. విజన్, సాంకేతికత, హైటెక్ సంస్కరణల పేరు చెబితే చాలు మొదట గుర్తొచే వ్యక్తి చంద్రబాబునాయుడు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన…..అంచెలంచెలుగా ఎదిగి జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు బాల్య జీవితంలో పలు ఆసక్తికర విషయాలపై ఈ కథనం. చంద్రబాబు…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలంపాటు ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఇది బయటి ప్రపంచానికి తెలిసిన విషయమే. తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామంలో ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించిన చంద్రబాబు…ప్రాథమిక విద్య కోసం 12 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. నారావారిపల్లి నుంచి సన్నని కాలిబాట, ముళ్లపొదలు, చిట్టడివి గుండా వెళ్లి విద్యాభ్యాసం చేశారు. దాదాపు ఐదేళ్లకుపైగానే ఇలా శ్రమించారు. ఆ నడకే ఆయన నడత మార్చింది. చదువుకునే రోజుల్లో సెలవులొస్తే చాలు పొలంబాట పట్టేవారు. నాగలి పట్టి దున్నేవారు. చెరకు, వరి పండించే పొలంలో కోతల సమయంలో రాత్రుళ్లు అక్కడే పడుకునేవారు. అప్పుడప్పుడూ పశువులు మేపటానికి వెళ్లేవారు. విద్యార్థి దశ నుంచే సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు చురుకుగా పాల్గొనేవారు. ఆయన బిఏ చదువుతున్న రోజుల్లోనే వినాయక సంఘం పేరుతో సామాజికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్రలో కాలేజీ విద్య ముగించారు. అనంతరం రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ఈ దశలోనే రాజకీయాలవైపు అడుగులేశారు. 1977లో కృష్ణాజిల్లాలో సంభవించిన దివిసీమ ఉప్పెన సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సేవాభిలాషకు, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. తర్వాత రాజకీయ అరగేంట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు తొలి విజయాన్ని అందుకున్నారు. 1980లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలకు మంత్రిగా సమర్ధవంతగా పనిచేశారు. చంద్రబాబునాయుడు తెలివితేటలు, వినయ విధేయతలు, శక్తి సామర్ధ్యాలు ఎన్టీఆర్‌ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కోరికపై చంద్రబాబు…1983 చివరలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరికే ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయానికి ముందడుగుపడింది. 1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఎత్తులు చిత్తు చేస్తూ చంద్రబాబు నిర్వహించిన పాత్ర అమోఘం. 1989లో పార్టీ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించి వెళ్లినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు కీలక భూమిక పోషించారు. 1995 సెప్టెంబర్ 1 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర పాలన గతినే మార్చేశారు. నేడు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్నింటిని ఆనాడే చంద్రబాబు రాష్ట్రానికి పరిచయం చేశారు. నీరు-మీరు, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. రాష్ట్రంలో అత్యంత కరవు అలముకున్నా దీటుగా ఎదుర్కొని రైతులకు భరోసా కల్పించారు. 1995-2004 మే వరకు రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన చంద్రబాబు 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలైనా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పార్టీని నడిపించారు. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజాసమస్యలు తెలుసుకొని వాటినే 2014లో ఎన్నికల ప్రణాళికగా మలుచుకున్నారు. విభజన సమయంలోనూ ఇరు ప్రాంతాల నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజాసమస్యలపై పోరాడారు. గల్లీ నుంచి దిల్లీ వరకు పోరుగళం వినిపించారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాలతో ఏర్పడిన నవ్యాంధ్ర…అనుభజ్ఞుడైన చంద్రబాబుకే జై కొట్టింది. 2014 జూన్ 8న మూడోసారి ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర తొలి సీఎంగా ప్రమాణం చేశారు. వస్తున్నా మీ కోసం యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలపై తొలి సంతకం చేశారు. ఓ వైపు నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణం…మరోవైపు ప్రజా సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పాలనలో ముందుకు సాగారు.