WorldWonders

ఈ బుడ్డోడిదే ఆ ఘనత

toshika premature baby holds world record as light weight infant

ఆ పసిగుడ్డు అత్యంత తక్కువ బరువుతో ఈ ప్రపంచంలోకి వచ్చింది. జపాన్‌లో పుట్టిన ఆ బిడ్డ బరువు ఆపిల్‌ పండంత. గట్టిగా పావుకిలో. 2018 అక్టోబర్‌ 1న జన్మించిన ఆ మగబిడ్డను తక్కువ బరువుతో ఉండటంతో నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి సంరక్షించారు. ఇప్పుడు బయటి ప్రపంచంలోకి వచ్చేందుకు సంసిద్ధమైనట్లు శుక్రవారం వైద్యులు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుతో జన్మించిన మగబిడ్డ రికార్డు ఈ పసిగుడ్డుదే. టొషిక అనే గర్భిణి అధిక రక్తపోటుతో బాధపడుతుండటంతో 24 వారాల 5 రోజులకే అత్యవసర సిజేరియన్‌ శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు. 258 గ్రాముల బరువుతో ర్యుసుకె సెకియా జన్మించాడు. జపాన్‌లో అంతకుముందు 268 గ్రాముల బరువుతో జన్మించిన బిడ్డదే రికార్డు కాగా ఇప్పుడు అంతకన్నా తక్కువ బరువుతో, 22 సెంటీమీటర్ల పొడవుతో సెకియా పుట్టాడు. ఆస్పత్రి సంరక్షణలో ఉంచి గొట్టాలు, పత్తి ఉండల ద్వారా తల్లిపాలు అందించారు. 7 నెలల తర్వాత బిడ్డ 13 రెట్లు పెరిగి ప్రస్తుతం 3 కిలోల బరువుతో ఉన్నారు. ఈ వారాంతంలో మధ్య జపాన్‌లోని నగానో పిల్లల ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేసేందుకు అంతా సిద్ధం చేశారు.