Devotional

దేవగజం ఐరావతం

A special story on Indras Airavath

ఇంద్రుని వాహనం ఏమిటి అంటే తడుముకోకుండా ఐరావతం అని చెప్పేస్తాము. భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఐరావతాన్ని చూస్తే నిజంగానే అది దేవతా ఏనుగు అనిపించక మానదు. అలాంటి ఐరావతం గురించి కొన్ని విశేషాలు. ఐరావతం ఎలా జన్మించింది అనేందుకు రకరకాల కథలు చెబుతుంటారు. మాతంగలీల అనే ప్రాచీన గ్రంధం ప్రకారం… బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయట. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా, ఆడ ఏనుగులకి ‘అభరాము’ అనే ఏనుగు నాయకత్వం వహించింది. మరో గాధ ప్రకారం ఈమె కద్రు, కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి జన్మించింది. కానీ విస్తృత ప్రచారంలో ఉన్న కథ ప్రకారంగా ఐరావతం క్షీరసాగరమథనం నుంచి జన్మించింది. క్షీరసాగరమథనం జరిగే సందర్భంలో మూడు అతీత లక్షణాలు ఉన్న జీవులు ఉద్భవించాయి. అవే కోరిన వరాలను తీర్చే కామధేనువు, ఏడు తలలతో ఉండే ఉచ్చైశ్రవము అనే గుర్రం, తెల్లటి తెలుపుతో మెరిసిపోయే ఐరావతం. అసలు ఐరావతం అంటేనే సముద్రం నుంచి ఉద్భవించినది అనే ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది. ఐరావతం ఆవిర్భావం ఒక ఎత్తయితే, ఇంద్రుని వాహనంగా దాని భోగం మరో ఎత్తు. వర్షాన్ని కురిపించడం, తూర్పు దిక్కుకి అధిపతిగా ఉండటం, రాక్షసుల మీద పై చేయి సాధించడం అనేవి ఇంద్రుని ముఖ్యమైన మూడు బాధ్యతలు. ఈ మూడు బాధ్యతలలోనూ ఐరావతానిది ముఖ్య పాత్ర. అదెలాగంటే…భూమి అంతర్భాగంలో ఉన్న నీటిని ఐరావతం తన తొండంతో ఆకాశానికి ఎగచిమ్ముతుందట. ఆ నీటినే ఇంద్రుడు తిరిగి వర్షంగా కురిపిస్తాడని ఓ కథ. ఆకాశంలోని ఎనిమిది దిక్కులకీ అష్టదిక్పాలకులు నాయకత్వం వహించే విషయం తెలిసిందే కదా! ఈ ఎనిమిది దిక్కులనీ పాలించే దేవతలు ఎనిమిది ఏనుగులు మీద నిలబడి ఉంటారట. వీటిలో ఇంద్రుని మోసేది ఐరావతమే కదా! అంతేకాకుండా మిగతా ఏనుగులకి కూడా అది దిశానిర్దేశం చేస్తుందట. ఇంద్రుడు చేసే యుద్ధాలలోనూ ఐరావతానికి ప్రముఖ పాత్రే. వృత్తాసుర వధ వంటి పోరులో ఐరావతమే చాకచక్యంగా ఇంద్రుని రణరంగంలో నడిపించింది. ఐరావత ప్రస్తావన కేవలం హిందూమతంలోనే కాకుండా జైన, బౌద్ధ మతాలలో కూడా కనిపిస్తుంది. ఇక థాయ్‌లాండ్‌, లావోస్‌ వంటి దేశాలలోనూ ఐరావతాన్ని ఆరాధించడం కనిపిస్తుంది. అక్కడి ప్రాచీన రాజ్యాలకి సంబంధించిన పతాకాల మీద మూడు తొండాలతో ఉండే ఐరావతం కనిపిస్తుంది. అలాంటి మూడు తొండాల ఐరావతపు విగ్రహం జీవితాలలో అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. విదేశాల సంగతి అటుంచితే మన ప్రాచీన దేవాలయాలలో కూడా ఐరావతపు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. తమిళనాడులో అయితే ఐరావతం పూజించిన శివునికి ‘ఐరావతేశ్వరుడు’ అన్న పేరుతో ఒక ఆలయం కూడా ఉంది.