DailyDose

త్వరలో మోడీ ఏసీలు-తాజావార్తలు–05/29

May 29 2019 - Daily Breaking News - Modi ACs to be released soon

*దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీనిని గుర్తించిన మోదీ సర్కార్ ఇంటింటికీ అత్యంత చవకైన ఏసీలు అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న ఏసీల ధరలతో పోలిస్తే… ప్రభుత్వం అందించే ఈ ఏసీలు 15 నుంచి 20 శాతం తక్కువ ధరకు లభ్యంకానున్నాయి. ఈ ఏసీలను ఈసీఐఎల్ ఆవిష్కరించనుంది. ఈ ఏసీలు అందుబాటు ధరల్లో లభ్యమవడమే కాకుండా విద్యుత్ తక్కువగా ఖర్చుకానుంది. పైగా ఈ ఏసీలను ఇంట్లో కూర్చొనే కొనుగోలు చేయవచ్చు. పైగా ఎక్స్ఛేజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. అయితే ఈ ఏసీలు రాబోయే నెల-రెండునెలల్లో అందుబాటులోకి రానున్నాయి. కాగా గతంలో ఈసీఐఎల్ కంపెనీ అత్యంత తక్కవ ధరలకు ఎల్ఈడీ బల్బులను ట్యూబ్ లైట్లను అందించింది
* కడపజిల్లాపులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రికి మత పెద్దలు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇడుపులపాయ వెళ్లి… తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
* అక్రమ నగదు చలామణి కేసులో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. గురువారం ఉదయం 10.30గంటలకు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలతో పాటు దిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రంలో బికానేర్‌లోని ఆస్తుల విషయంలో అవకతవకలు జరిగాయని వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. తాజాగా మరోసారి హాజరుకావాలని ఈడీ కోరింది.
*వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద కాబోయే సీఎం జగన్‌ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పక్కకు లాగారు. ఆ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఇది గమనించిన జగన్‌ వాహనం ఆపి మహిళతో మాట్లాడారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.
* సుప్రీంకోర్టులో తాను డిపాజిట్‌ చేసిన రూ. 10కోట్లు రీఫండ్‌ చేయాలని కోరిన కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరానికి న్యాయస్థానం గట్టిగానే మొట్టికాయలు వేసింది. డబ్బులు, విదేశాలు కాదు.. ముందు మీరు గెలిచిన నియోజకవర్గంపై దృష్టిపెట్టండని కోర్టు చురకలంటించింది.
*శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి ఏకంగా 11.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ,తెలుగుదేశం వర్గీయుల మద్య ఘర్షణలో ఐదుగురికి గాయాలుఎన్నికలలో వెడి ఇంకా పల్నాడు ప్రాంతంలో తగ్గలేదు , ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించిండంతో పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి, అదే క్రమంలో తంగెడ గ్రామం లో ఇరువర్గాలు ఘర్షణ దిగి కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు ,ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కి చెందిన తంగెడ మాజీ సర్పంచ్ దైద అబ్రహం కు అదే గ్రామానికి చెందిన యోసోబు,కిరణ్ ,మరో మహిళా కూడా గాయపడ్డారు, గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు
*చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్‌ప్ల‌స్ 7, వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ ఫోన్ల‌ను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ల‌ను భార‌త్‌లో జూన్ 4వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. అమెజాన్ వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ల‌ను విక్ర‌యిస్తారు.
*రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలైన ఓట్లను జూన్‌ 4న లెక్కించనున్నారు. ఫలితాలనూ అదే రోజున ప్రకటిస్తారు. మండల, జిల్లా పరిషత్‌ పదవులకు పరోక్ష ఎన్నికల తేదీని మాత్రం ఎన్నికల సంఘం వెల్లడించాల్సి ఉంది.
*రాష్ట్రంలోని యువతుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సారి బతుకమ్మ చీరలు పది రకాల బంగారు వర్ణపు అంచులతో రానున్నాయి. గతేడాదికి భిన్నంగా ఆకర్షణీయమైన రంగులు.. అందమైన జరీ(బంగారు) అంచుల డిజైన్లను నిర్ణయించారు.
*ఎండల దెబ్బకు రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నెల ఒకటిన 7,221 మెగావాట్ల డిమాండు ఉంటే 28న (మంగళవారం) 8,391కు పెరిగినట్లు ట్రాన్స్‌కో తాజా నివేదికలో వెల్లడించింది.
*తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు జూన్‌ 3 లేదా 4వ తేదీన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పిన విద్యార్థుల పునఃపరిశీలన ఫలితాలను ఇంటర్‌ బోర్డు ఈ నెల 27వ తేదీ రాత్రి వెల్లడించిన విషయం తెలిసిందే.
*తిరుగులేని ఆధిక్యంతో కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు… పల్లెలకు, అన్నదాతలకు అండగా నిలవాలని భావిస్తోంది. ప్రతి గ్రామానికి సొంత గిడ్డంగిని నిర్మించాలనీ… రెండు హెక్టార్లకు మించి పొలమున్న రైతులకూ ‘రూ.6 వేల వార్షిక సాయం’ అందించాలని నిర్ణయించింది.
*సికింద్రాబాద్‌ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా తనను అభినందించేందుకు వచ్చే శ్రేయోభిలాషులు, మిత్రులు, పార్టీ కార్యకర్తలు పూల బొకేలు, పూలదండలు, శాలువాల బదులు నోటు పుస్తకాలు తీసుకురావాలని కిషన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి చక్కటి స్పందన వస్తోంది.
*జులై నాలుగు నుంచి ఆరో తేదీ వరకు వాషింగ్టన్‌లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు హాజరు కావాలంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. సంఘం అధ్యక్షుడు సతీశ్‌ వేమన, ఇతర ప్రతినిధులు మంగళవారం ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయనతో పాటు మంత్రి ఎర్రబెల్లిని ఉత్సవాలకు ఆహ్వానించారు. ఆహ్వాన సందర్భంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ప్రేమ్‌చందర్‌ రావు ఉన్నారు.
*విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన వారు బారులు తీరుతున్నారు. దాంతో శారదాపీఠానికి రాజకీయ కళ సంతరించుకుంది.
*సినీ నిర్మాత సి.కల్యాణ్‌, శింగనమల రమేశ్‌, భానుకిరణ్‌కు నాంపల్లి సీఐడీ కోర్టులో ఊరట లభించింది. సరైన సాక్ష్యాలు లేనందున సీఐడీ కోర్టు ముగ్గురిపై కేసు కొట్టివేసింది.
*ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూన్‌ 2న ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉంటుంది. సీఎం ఆదేశాల మేరకు స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
* విజేత ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో తన పేరుతో అందించే జాతీయ పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ను ఎంపిక చేశామని అవార్డు ప్రదాత, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
*వచ్చే జూన్‌ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం సజావుగా జరగాల్సి ఉందన్నారు.
*ఈ నెల 31న వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు, ముందు రోజు, ఓట్ల లెక్కింపు జరిగే జూన్‌ మూడో తేదీన..స్థానిక సెలవును ప్రకటించే అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ మంగళవారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
*రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) కార్యనిర్వాహక ఛైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ మీడియా, కమ్యూనికేషన్స్‌ సమన్వయకర్త పదవులకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.