Business

బ్యాంకింగ్ రంగ రూపురేఖలు మార్చిన ఇందిర నిర్ణయానికి 50ఏళ్లు

When Indira Gandhi Nationalized All Banks In India

భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర విశేషమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభాలకు ఎన్నో దేశాలు కొట్టుమిట్టాడుతుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడుతుందంటే దానికి కారణం బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండడం వల్లేనని ఆర్థిక నిపుణులు తరుచూ చెబుతూ ఉంటారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే దీనికి కారణం మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీయే. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ప్రైవేటు రంగంలో ఉన్న 14 బ్యాంకుల్ని ఆమె జాతీయం చేశారు.ఇందిరాగాంధీ, బ్యాంకుల్ని జాతీయం చేయడానికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంది. 1955లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. అప్పటికి ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకులు భయంకరమైన నష్టాలతో దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐని జాతీయం చేశారు.ఏడాదికి సగటున 40 బ్యాంకుల చొప్పున 1947-1955 మధ్య 360కి పైగా బ్యాంకులు విఫలమయ్యాయి. ఈ ధోరణి 1950 నుంచి 1960 వరకు కొనసాగింది. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ను భారీగా బ్యాంకు కన్సాలిడేషన్ డ్రైవ్‌ ఏర్పాటుకు దోహదం చేసింది. దీంతో 1960 నుంచి 1965కు భారీగా బ్యాంకుల్ని రద్దు చేశారు. దీంతో 328 బ్యాంకులకు గాను కేవలం 68 బ్యాంకులు మాత్రమే మిగిలాయి.1967లో ఇందిరా గాంధీ మళ్లీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ మొరార్జీ దేశాయ్‌నే ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు. అయితే అప్పటికి ఇందిరా ప్రభుత్వానికి మరో సవాల్ ఎదురైంది. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఆర్థిక సహకారాన్ని బ్యాంకులు నిలిపివేశాయి. దీంతో దేశ ప్రజల ఆర్థిక శక్తి పూర్తిగా క్షీణించింది. దీంతో బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలని ఇందిరా ప్రభుత్వం భావించింది. జూలై 12న బ్యాంకుల్ని జాతీయం చేస్తున్నట్లు ప్రకటించిన ఇందిరా గాంధీ కేవలం వారంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. జూలై 18న ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టగా ఆ మరుసరి రోజు అంటే జూలై 19న సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్‌ ఆమోదం పొందింది. రాత్రి 8:30 గంటలకు ఇందిరా ఈ విషయాన్ని ఇందిరా ప్రకటించారు. ఇందిరా ప్రకటనతో వ్యాపార వర్గాలు ఖంగుతినగా.. దేశ ప్రజలు ఆనందంలో మునిగి తేలారని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.