DailyDose

ఆర్థిక మాంద్యంపై మోడీ దృష్టి-తాజావార్తలు–08/15

Modi focussing on recession-Telugu Breaking News today-Aug152019

*వినియోగదారులకు ఊరట కలిగించే ఓ సూచనను ఆర్బీఐ బ్యాంకులకు చేసింది. నగదు డ్రా చేసకునేటప్పుడు విఫలమైన ఏటీఎం లావాదేవీలు, బ్యాలెన్స్ ఎంక్వైరీలకు చేసిన కార్డు స్వైప్లను నిర్దేశిత 5 ఉచిత లావాదేవీల జాబితాలో చేర్చకూడదని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. వినియోగదారుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకులకు జారీ చేసిన నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది.
*హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మెట్రో రైలులో ఒక్కరోజులో ప్రయాణించే వారి సంఖ్య 3లక్షలకు దాటింది. బుధవారం ఒక్కరోజే 3లక్షల 6వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం స్టేషన్ వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
*ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ఆర్థికమాంద్యం చాప కింద నీరులా చేరుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ దానిపై దృష్టిసారించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు ఉన్న పరిష్కార మార్గాల గురించి వారితో చర్చించారు.
*ఆసియా పోషకాహార సంఘాల సమాఖ్య (ఎఫ్ఏఎన్ఎస్) కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సంచాలకురాలు డా.ఆర్.హేమలత నియమితులయ్యారు.
*కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో సుదీర్ఘ వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
*మహారాష్ట్రలోని షోలాపూర్-వాడి సెక్షన్లో జరుగుతున్న రెండో లైను పనుల కారణంగా ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లకు ఆగస్టు నెలాఖరు వరకు తీవ్ర అంతరాయం కలగనుంది. కొన్ని రోజులపాటు 42 రైళ్లను పూర్తిగా, 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, 10 రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వేశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
*తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల చివరి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది.
*ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు ఆనందోత్సవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భౌతికంగా, మానసికంగా సత్ఫలితాలిచ్చే సుదర్శన క్రియను నేర్పనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇది ఒక శక్తిమంతమైన, లయబద్ధమైన శ్వాసప్రక్రియ. దీంతో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం తదితర అంశాలను వెబ్ టెలికాస్టింగ్ ద్వారా నేర్పుతారన్నారు. ఇందులో పాల్గొనాలనుకుంటున్న వారు https://www.artofliving.org/in-en/anand-utsav వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ కావొచ్చని సూచించారు.
*డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) ప్రత్యేక కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 16,911 మందికి బుధవారం సీట్లు కేటాయించారు. వారిలో గతంలో సీట్లు పొంది మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారు 1,414 మంది ఉన్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 16 లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కళాశాలల్లో చేరాలని దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు.
*సింగరేణి భూముల క్రమబద్ధీకరణ (జీవో నం.76)కు అర్హులైన లబ్ధిదారులు సెప్టెంబరు 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సూచించారు. ఈ మేరకు సీసీఎల్ఏ వెబ్సైట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.