Devotional

తిరుమల బ్రహ్మోత్సవాలకు తితిదే భారీ ప్రచారం

TTD Making Grand Arrangements For 2019 Brahmotsavams

వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించేందుకు టిటిడి విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఇందుకోసం 12 వేల గోడపత్రికలు, ఒక లక్ష పాంప్లెట్లు, 4,500 బుక్‌లెట్లల‌ను అన్ని ప్రాంతాల భక్తులకు అర్థమయ్యేలా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ముద్రించింది. 

వాహనసేవల వివరాలు, ఇతర సమాచారంతో కూడిన పత్రికలను తిరుమల, తిరుపతిలోని సమాచార కేంద్రాలు (మే ఐ హెల్ప్‌ యు కౌంటర్లు) సర్వదర్శనం కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా గల టిటిడి కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో గోడపత్రికలను అంటించి భక్తులకు సమాచారం తెలియజేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.

తిరుమల-తిరుపతి  బస్సులతోపాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న బస్సులకు గోడపత్రికలు అంటించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ఆర్‌టిసి, పర్యాటక శాఖ అధికారులకు ప్రచార సామగ్రిని అందించారు.

ఆయా రాష్ట్రాల ఆర్‌టిసి బస్సులకు అంటించడంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గోడపత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల విభాగం సిబ్బంది ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకుని శ్రీవారి సేవకుల సహకారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు గోడపత్రికలను అంటిస్తున్నారు.

టిటిడి ఇంజినీరింగ్ విభాగం-

టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దుతున్నారు.

గ్యాల‌రీల‌లో వేచివుండి భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీటి కొలాయిలు, మ‌రుగుదొడ్ల మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేశారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల‌ల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

స్వామి పుష్క‌రిణి చుట్టు నూత‌నంగా రాతి స్తంభాల మ‌ధ్య ఏర్పాటు చేస్తున్న  ఇత్త‌డి గ్రీల్స్ భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.  

తిరుమ‌ల‌లోని ర‌హ‌దారులు, రెండు ఘాట్ రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు, రోడ్ల‌కు ఇరువైపులా ట్రాఫిక్ నిబంధ‌న‌లు తెలిపే పెయింటింగ్ ప‌నులు పూర్తి చేశారు.

తిరుమ‌ల, తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద అద‌నంగా వాహ‌నాల పార్కింగ్ స్థ‌లం అభివృద్ధి, తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
 
ఎల‌క్ట్రిక‌ల్ విభాగం ఆధ్వ‌ర్యంలో రంగురంగుల ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎల్ఇడి లైట్ల‌తో చేసిన తోర‌ణాల‌ను తిరుమ‌ల, తిరుప‌తి ర‌హ‌దారుల వెంబ‌డి, డివైడ‌ర్ల మ‌ధ్య చెట్ల‌కు అందంగా అలంక‌రించారు. అదేవిధంగా ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో, ర‌ద్దీ ప్రాంతాల‌లో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ క‌టౌట్లు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

అదేవిధంగా భ‌క్తులు వాహనసేవలు తిలకించేందుకు 37 డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు ప్రకటనలు తేలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. తిరుమ‌ల పాపానాశ‌నం రోడ్డులోని క‌ల్యాణ వేదిక వ‌ద్ద భక్తులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, మ్యూజియం, ఫొటో, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తున్నారు.

టిటిడి గార్డెన్‌, అట‌వీ విభాగాల ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారి ఆల‌యం వెలుప‌ల‌, తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద భ‌క్తుల‌కు మ‌రింత అహ్లాదం క‌లిగించేలా రంగురంగుల పూల మొక్క‌లు ఏర్పాటు చేస్తున్నారు.

టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్, ఇత‌ర ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ర్షించేలా దేశంలోని వివిద రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ క‌ళా బృందాలు  క‌ళా  ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.            
         
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండాటిటిడి విజిలెన్స్ విభాగం పోలీసు శాఖ‌తో సమన్వయం చేసుకుని  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం దాదాపు 4,700 మంది భ‌ద్ర‌తా సిబ్బంది, 1500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.