DailyDose

21 ఏళ్లకు న్యాయమూర్తిగా రాజస్థాన్ యువకుడి సంచలనం-తాజావార్తలు-11/21

Rajasthan's 21Year Old Becomes Judge-Telugu Breaking News Today-11/21-21 ఏళ్లకు న్యాయమూర్తిగా రాజస్థాన్ యువకుడి సంచలనం-తాజావార్తలు-11/21

* ఎన్నో సంప్రదింపులు జరిపి.. నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని తెదేపా అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు రావడంతో పాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధి జరిగేదని చెప్పారు. సీఎం జగన్‌ తెలివితక్కువ నిర్ణయాలతో తమ శ్రమంతా వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు లూలూ గ్రూప్‌ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ట్విటర్‌లో స్పందించారు.

* ఎలాంటి షరతులు లేకుంటే విధుల్లో చేరేందుకు సిద్ధమని పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల డిపోమేనేజర్‌ శ్రీనివాసరావును 280 మందికార్మికులు కలిసి వెంటనే విధుల్లో చేర్చుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, ఆదేశాలు వచ్చినవెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుంటామని డీఎం చెప్పడంతో కార్మికులు వెనుదిరిగారు. విధుల్లో చేరేందుకు సిద్ధమని హన్మకొండ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు.

* అయోధ్య కేసు, కశ్మీర్‌ సమస్య పరిష్కారం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భాజపా జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా లతేహార్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కశ్మీర్‌ సమస్యను పరిష్కరించకుండా 70ఏళ్లు తాత్సారం చేసిందని దుయ్యబట్టారు. రాజ్యాంగ చట్రానికి లోబడి అయోధ్య వివాదాన్ని పరిష్కరించాలని చూస్తున్న సమయంలోనే ఆ శ్రీ రాముడి ఆశీస్సులతో మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంలో తీర్పు వచ్చిందని చెప్పారు.

* తెలుగు మాధ్యమం కొనసాగిస్తూనే ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేసిందని గుర్తు చేశారు. మాతృ భాష తెలుగును కాపాడాలన్నదే తెదేపా విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు కావాలి. వృత్తిలో రాణించేందుకు ఆంగ్లం అవసరం. ఆంగ్ల మాధ్యమ బోధనకు తెదేపా వ్యతిరేకమనే దుష్ర్పచారం తగదు. అబ్దుల్‌ కలాం ప్రతిభా అవార్డులను వైఎస్‌ఆర్‌ పేరుగా మార్చాలని చూశారు’’ విమర్శించారు.

* నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాల్లో 9శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 మధ్య 3,375 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. గతేడాది ఇదే సమయంలో 3,729 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. నూతన మోటారు వాహనచట్టానికి సంబంధించి పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు గడ్కరీ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తుది అంకానికి చేరింది. మరాఠా పీఠంపై శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్‌ నేతృత్వంలో సరికొత్త కూటమి కొలువుదీరేందుకు దాదాపు కసరత్తు పూర్తయింది. అయితే, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎన్సీపీ, కాంగ్రెస్‌ కోరుతున్నట్టు సమాచారం. మంత్రి పదవుల పంపకంపై మూడు పార్టీల్లోనూ ఇంకా ఎలాంటి స్పష్టతా రానట్టు సమాచారం. అయితే, మూడు పార్టీలకూ సరి సమానంగా మంత్రి పదవులు పంచాలని కాంగ్రెస్‌ కోరుతున్నట్టు తెలుస్తోంది.

* రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతం చేయబోతున్నారని చెప్పారు. కమల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2021లో తమిళనాడు ప్రజలు రాజకీయంగా నూరు శాతం అతిపెద్ద అద్భుతం చేయబోతున్నారు’’ అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కీలక పాత్ర పోషించబోతున్నట్లు తన వైఖరిని తెలియజేశారు.

* కోతులు ఫ్రూటీ, సమోసా, కచోరీలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భాజపా ఎంపీ, సినీనటి హేమమాలిని అన్నారు. పార్లమెంటులో గురువారం హేమమాలిని మాట్లాడుతూ.. తన నియోజకవర్గం మథురలో పర్యటించే పర్యాటకులు కోతులకు ఫ్రూటీ, సమోసా, కచోరీలు అలవాటు చేశారని చెప్పారు. ఫలితంగా వాటి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే కోతులకు ప్రత్యేకంగా సఫారీ ఏర్పాటు చేయాలని కోరారు.

* అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ చేసిన తనయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే…బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం కాలనీలో నివసించే అరుణ్‌ గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, రూ.50వేల నగదు చోరీ చేశాడు. ఇంట్లోని నగదు, బంగారం తన కుమారుడే అపహరించాడని గుర్తించిన తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

* నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్‌’. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో టీజర్‌ విడుదల కాస్త ఆలస్యమైంది. ఇప్పటివరకూ ‘రూలర్‌’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్‌, మాస్‌లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

* గంగపుత్రుల జీవితాలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని తెలిపారు. మత్స్యకారులంతా సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో ఆదాయాన్ని కోల్పోతున్నారని, అందువల్ల వేట నిషేధ కాలంలో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

* తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ చూపుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై కేసీఆర్‌తో మాట్లాడతానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, అధికారులను దిల్లీ పిలుస్తామని చెప్పారన్నారు.

* విశాఖలోని లూలూ గ్రూపునకు కేటాయించిన భూమిపై న్యాయ వివాదం ఉందని, అందుకే ఆ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేశామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు కారణాలతో లూలూ గ్రూపుతో ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. లూలూ గ్రూపుతో ప్రభుత్వానికి ఏటా రూ. 500 కోట్ల నష్టం వాటిల్లుతుందని, స్థలం విషయంలోనూ వివాదాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాంటి భూములను గత ప్రభుత్వం లూలూ సంస్థకు కేటాయించిందన్నారు.

* దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై పోరాటం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పెద్ద పోరాటమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణ రాష్ట్రంలోని హిసార్‌ జిల్లా కూడా ప్లాస్టిక్‌ మహమ్మారిని నియంత్రించేందుకు వినూత్నమైన కార్యక్రమాన్ని తలపెట్టింది. 20 ప్లాస్టిక్‌ బాటిళ్లు తీసుకొస్తే తినుబండారాలను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హిసార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ స్థానికంగా ఉన్న రెండు దాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది.

* ఎలక్టోరల్‌ బాండ్లు‌, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నిరసన వ్యక్తంచేసింది. శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ అంశాలను కాంగ్రెస్‌ సభ్యులు ఉభయ సభల్లో లేవనెత్తారు. ఎలక్టోరల్‌ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం వ్యవహారాలు ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. నినాదాలు చేసుకుంటూ పొడియంలోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు నిరసన వ్యక్తంచేశారు. సభా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని సభాపతి ఓం బిర్లా ఎంత చెప్పినా వెనక్కి తగ్గలేదు.

* దేశంలోనే అత్యంత చిన్న వయసులో న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా రాజస్థాన్‌ యువకుడు రికార్డు సృష్టించాడు. మయాంక్‌ ప్రతాప్‌ అనే 21ఏళ్ల యువకుడు 2019 రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌(ఆర్‌జేఎస్‌) పరీక్షలో టాపర్‌గా నిలిచి సాధించి న్యాయమూర్తి పదవికి అర్హత సాధించాడు. జైపూర్‌లోని మాన్‌సరోవర్‌కు చెందిన మయాంక్‌ రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సును గత ఏప్రిల్‌లో పూర్తి చేసి పట్టా పొందాడు. అనంతరం నిర్వహించిన రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. న్యాయమూర్తి కాబోతున్న పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

* రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్‌18లో వాటాలను కొనుగోలు చేసే అంశంపై సోనీ చర్చలు జరుపుతోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలు రకాల డీల్స్‌పై సోనీ పలురకాల డీల్స్‌ను దీనికోసం పరిశీలిస్తోంది. సోనీ తన భారతీయ విభాగం వ్యాపారాన్ని కూడా దీంతో కలిపే అవకాశం ఉంది. ఈ వార్తలు బయటకు రావడంతో గురువారం నెట్‌వర్క్‌18 షేర్లు దాదాపు 15శాతం ఎగశాయి. మరోపక్క టీవీ18 బ్రాడ్‌కాస్టింగ్‌ లిమిటెడ్‌ షేర్లు కూడా 9.7శాతం పెరిగాయి. ఈ డీల్‌ ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.

* సన్నాహక మ్యాచ్‌ ఉంటేనే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో గులాబి టెస్టు ఆడతామని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. హఠాత్తుగా పింక్‌ టెస్ట్‌ ప్రతిపాదన తీసుకురావడంతోనే 2017-18 పర్యటనలో ఆడకపోవడానికి కారణమని వెల్లడించాడు. ఈడెన్‌ వేదికగా టీమిండియా తొలిసారి బంగ్లాదేశ్‌తో డే/నైట్‌ టెస్టు ఆడుతున్న సందర్భంగా విరాట్‌ మీడియాతో మాట్లాడాడు. ‘ఆస్ట్రేలియాతో గులాబి టెస్టు ఎప్పుడు పెట్టినా ముందు సన్నాహక మ్యాచ్‌ కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే గులాబి బంతి క్రికెట్‌కు మేం ముందుగానే అలవాటు పడాలి’ అని చెప్పాడు.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 76 పాయింట్లు నష్టపోవడంతో 40,575 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 30 పాయింట్లు క్షీణించి 11,968 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.74గా ఉంది. నిఫ్టీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి.