Business

₹378కోట్ల మద్యం జుఱ్ఱేశారు

New year liquor sales crossed 300Cr in telugu states

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. పెద్దసంఖ్యలో మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ.378 కోట్ల విక్రయాలు జరిగాయి. సంవత్సరం చివరి రోజు మందు అందుబాటులో ఉండదేమో అనే ఆందోళనతో చాలా మంది ముందు రోజే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. బీరు, మద్యం కలిపి రాష్ట్రంలో రెండు రోజుల్లోనే 83.43 లక్షల లీటర్లు ఖాళీ చేశారు. సగటు రోజువారీ అమ్మకాల కంటే డిసెంబరు 31వ తేదీ ఒక్కరోజే 150 శాతం ఎక్కువగా జరిగాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకూ రాష్ట్రంలో రూ.2,050 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ లెక్కన సగటున రోజుకు రూ.66 కోట్ల మందు అమ్మారన్నమాట. అయితే, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబరు 30, 31 తేదీల్లో రెండు రోజుల్లోనే రూ.378 కోట్ల సరకు అమ్మారు. విడివిడిగా చూసుకుంటే డిసెంబరు 30న 2.93 లక్షల కేసుల మద్యం, 2.97 లక్షల కేసుల బీర్ల చొప్పున రూ.220 కోట్లు, 31వ తేదీన 1.92 లక్షల కేసుల మద్యం, 2.15 లక్షల కేసుల బీర్ల చొప్పున రూ.158 కోట్ల అమ్మకాలు జరిగాయి. వీటిని లీటర్లలో చూస్తే.. రెండు రోజుల్లో రాష్ట్రంలో సుమారు 39.78 లక్షల లీటర్ల బీర్లు, 43.65 లక్షల లీటర్ల మద్యం తాగేశారన్నమాట.