Health

నిలబడా…కూర్చునా?

How should you piss-Standing or sitting-Telugu health news

కొన్ని టాయిలెట్ల మీద నిలుచుని మూత్రం పోయడం నిషిద్ధం అని హెచ్చరించే గుర్తులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కూర్చుని మూత్ర విసర్జన చేసే పురుషులను అవహేళన చేస్తుంటారు. అసలు ఎలా పోస్తే మంచిది?

పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?

ప్రపంచవ్యాప్తంగా చాలా సంప్రదాయాల్లో బాలికలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే, పురుషులు మాత్రం నిలబడి చేయాలని చెబుతారు.
కానీ, ప్రస్తుతం దీనిని పలు దేశాల్లో వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని పురుషులు తమ అలవాటును మార్చుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. కొందరు దీనిని సమాన హక్కుల అంశంగానూ చూస్తున్నారు.
మరి, పురుషులు ఎలా మూత్రం పోస్తే మంచిది?

సాధారణంగా చూస్తే, నిలుచుని మూత్రం పోసే తొట్లను తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో అమర్చే వీలుంటుంది. అదే, కూర్చుని పోసే టాయిలెట్లకు ఎక్కువ స్థలం అవసరం అవుతుంది.
అయితే, మూత్రం పోసే సమయంలో శరీరం భంగిమ ప్రభావం మూత్ర నాళంలో మూత్రం ప్రవాహం మీద ఉంటుందని పలు వైద్య సంస్థలు చెబుతున్నాయి.

మూత్ర విసర్జన ప్రక్రియ
మూత్ర విసర్జన ఎలా జరుగుతుందో చూద్దాం.
మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ మూత్రం మూత్రాశయం (బ్లాడర్‌)లో నిల్వ ఉంటుంది.
మూత్రాశయం సామర్థ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేసేస్తుంటాం.
బ్లా‌డర్‌ను పూర్తిగా ఖాళీ చేయాలంటే మనలో నాడుల నియంత్రణ వ్యవస్థ సరిగా పనిచేయాలి. అప్పుడే, టాయిలెట్‌కు ఎప్పుడు వెళ్లాలో మనకు తెలుస్తుంది, టాయిలెట్‌ దగ్గరలో లేనప్పుడు మూత్రాన్ని అలాగే ఆపుకునేందుకు వీలుంటుంది.
మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది.
మనం మూత్ర విసర్జించేందుకు టాయిలెట్‌కు వెళ్లగానే మూత్రాశయం కండరాలు ముడుచుకుంటాయి. అప్పుడు అందులోని మూత్రం విసర్జననాళం ద్వారా బయటకు వచ్చేస్తుంది.

నిలుచోవాలా? కూర్చోవాలా?
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన సులువుగానే జరుగుతుంది.
కానీ, కొన్నిసార్లు పురుషులకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూత్ర విసర్జనలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా ప్రొస్టేట్‌ గ్రంథి వాపుతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూర్చుని మూత్రం పోస్తే ఉపశమనం లభిస్తుందని, కూర్చోవడం ద్వారా విసర్జననాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ప్లోస్ వన్ అనే సైన్స్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనంలో అరోగ్యంగా ఉన్న పురుషులతో పాటు, ప్రోస్టేట్ సిండ్రోమ్‌ (లోవర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్)తో బాధపడుతున్నవారిని పరిశీలించారు.

ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్న పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారని, కూర్చున్నప్పుడు మూత్రనాళాల్లో ఒత్తిడి తగ్గి చాలా సౌకర్యవంతంగా, త్వరగా మూత్ర విసర్జన చేయగలుగుతున్నారని ఆ పరిశీలనలో వెల్లడైంది.
అయితే, ఆరోగ్య వంతులైన పురుషులు నిలబడినా, కూర్చున్నా పెద్దగా తేడా కనిపించలేదు.
మూత్ర విసర్జన సమస్యలున్న పురుషులు కూర్చుని మూత్రం పోసేందుకు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండే టాయిలెట్లను ఎంచుకోవాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తోంది.

కూర్చుని మూత్ర విసర్జన చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చని, పురుషుల్లో శృంగార సమస్యలు కూడా తగ్గుతాయనే కథనాలను మనలో చాలామంది చదివే ఉంటారు. కానీ, అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేవు.
ముఖ్యంగా 2012లో స్వీడన్‌లోని పబ్లిక్ టాయిలెట్ల దుస్థితిని చూసి విసిగెత్తిపోయిన ఒక స్థానిక రాజకీయ నాయకుడు పురుషుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ తరహా కథనాలు పుట్టుకొచ్చాయి. పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను అలా అన్నానని ఆయన చెప్పారు.
ఆ తర్వాత పలు యూరోపియన్ దేశాల్లో- ప్రత్యేకించి పబ్లిక్ టాయిలెట్లలో నిలబడి మూత్ర విసర్జన చేయడంపై నిషేధం ఉన్న జర్మనీలో పెద్దఎత్తున చర్చ నడిచింది.

కొన్ని టాయిలెట్ల మీద నిలుచుని మూత్రం పోయడం నిషిద్ధం అని హెచ్చరించే గుర్తులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కూర్చుని మూత్ర విసర్జన చేసే పురుషులను కొందరు అవహేళన చేస్తుంటారు.
కొన్ని హోటళ్లలోని టాయిలెట్లలోనూ పురుషులు కూర్చుని మూత్రం పోయాలని కోరుతూ గుర్తులు ఏర్పాటు చేస్తున్నారు.
2015లో జర్మనీలో ఓ కేసు సంచలనం సృష్టించింది. తమ ఇంట్లో అద్దెకున్న వ్యక్తి నిలుచుని మూత్రం పోయడం వల్ల బాత్రూంలోని పాలరాతి బండలు చెడిపోయాయని కేసు పెట్టిన యజమాని, అందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అయితే, ఆ కేసులో కిరాయిదారుడికి ఊరటనిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పురుషులు నిలుచుని మూత్ర విసర్జన చేయడం ‘ఇప్పటికీ సాధారణ విషయమే’, ఆయన్ను తప్పుబట్టాల్సిన అవసరం లేదని జడ్జ్ వ్యాఖ్యానించారు.