DailyDose

₹43వేల వైపుగా పసిడి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Gold Price Towards 43000

* పసిడి మరింత ప్రియమైంది. బుధవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర రూ.462 పెరిగి రూ.42,339కి చేరుకుంది. వెండిదీ పుత్తడి బాటే. కిలో వెండి ఒక్కరోజులో రూ.1,047 మేర ఎగబాకి రూ.48,652కి పెరిగింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి పై ‘కరోనా’ మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరిగింది. తదనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి రేట్లు పుంజుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆభరణాల కొనుగోళ్లు పెరగడం మరో కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.5 గ్రాములు) బంగారం ఒక దశలో 1,606.60 డాలర్లు, వెండి 18.32 డాలర్లకు చేరుకున్నాయి.
* వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.41,120, విజయవాడలో రూ.41,900, విశాఖపట్నంలో రూ.42,920, ప్రొద్దుటూరులో రూ.41,550, చెన్నైలో రూ.41,630గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,180, విజయవాడలో రూ.38,800, విశాఖపట్నంలో రూ.39,480, ప్రొద్దుటూరులో రూ.38,480, చెన్నైలో రూ.39,650గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,500, విజయవాడలో రూ.49,500, విశాఖపట్నంలో రూ.49,100, ప్రొద్దుటూరులో రూ.48,600, చెన్నైలో రూ.51,800 వద్ద ముగిసింది…
*కరోనా వైరస్ (కొవిడ్-19) కు ఒక వ్యాక్సిన్ క్యాండిడేట్ను అభివృద్ధి చేస్తున్నట్లు వ్యాక్సిన్ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్తో కలిసి అభివృద్ధి చేస్తున్నామని.. 6 నెలల్లోగా దీనిని మానవులపై పరీక్షించే దశకు చేరుతామని అంటోంది. ‘ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ క్లినికల్ పరీక్షలకు ముందస్తు దశలో ఉంది. అంటే జంతువులపై ప్రయోగిస్తున్నామ’ని సీరమ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘
*చైనా స్మార్ట్ఫోన్ సంస్థ రియల్మీ భారత్లో మొట్టమొదటి 5జీ స్మార్ట్ఫోన్ను ఈ నెల 24న విడుదల చేయనుంది. దీని ధర దాదాపు రూ.50,000గా నిర్ణయించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్లో 5జీ నెట్వర్క్ ఇంకా అందుబాటులో లేనప్పటికీ స్మార్ట్ఫోన్ తీసుకువస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రియల్మీ 5జీ హ్యాండ్సెట్లో 865 స్నాప్డ్రాగన్ చిప్సెట్ను అమర్చారు.
*అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ కాంపాక్ట్ మోడళ్లైన ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్లను బీఎస్-6 ప్రమాణాలతో బుధవారం మన విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరల శ్రేణిని రూ.5.39-8.34 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, దిల్లీ) ప్రకటించింది. అన్ని మోడళ్లను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో 1.2 లీటర్, 1.5 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించింది. హ్యాచ్బ్యాక్ ఫిగో ధరల శ్రేణి రూ.5.39-7.85 లక్షలు, కాంపాక్ట్ సెడాన్ ఆస్పైర్ ధరల శ్రేణి రూ.5.99-8.34 లక్షలు, కొత్త కాంపాక్ట్ వినియోగ వాహనం ఫ్రీస్టైల్ రూ.5.89-8.19 లక్షల మధ్య లభ్యమవుతున్నాయి.
*సెబీ కొత్త ఛైర్మన్గా మాధాబి పురి బుచ్ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ.. మాధాబి పురినే ఆ పదవి వరించొచ్చనే మాట బలంగా వినిపిస్తోందని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుత సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి పదవీ కాలం ఈనెల 29తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం మాధాబి పురితో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అతాను పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్తో, శ్రీనివాస్ పదవీకాలం ఈ ఏడాది మేతో ముగియనుంది. వచ్చే వారంలో సెబీకి కొత్త ఛైర్మన్ ఎవరో ప్రభుత్వం ప్రకటించనుందని ఆ అధికారి పేర్కొన్నారు.
*హైదరాబాద్ సమీపంలోని అరబిందో ఫార్మా యూనిట్-4 కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) తాజాగా ఈఐఆర్ (ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్) జారీ చేసింది. దీంతో అరబిందో ఫార్మా షేర్లకు స్టాక్మార్కెట్లో మదుపరుల నుంచి ఆదరణ లభించింది.
*సోరియాసిస్ వ్యాధిని అదుపు చేసే ఔషధాన్ని ఆవిష్కరించే దిశగా కీలక ప్రగతి సాధించినట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు అనుబంధ సంస్థ అయిన అరిజీన్ డిస్కవరీ టెక్నాలజీస్ బుధవారం వెల్లడించింది. ‘ఆర్101’ అనే ఔషధ మూలకణంపై రెండో దశ (ఫేజ్-2) క్లినిక్ పరీక్షలు మొదలుపెట్టినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన రోగులకు 12 వారాల పాటు రోజుకు రెండు సార్లు 400 ఎంజీ, 600 ఎంజీ ఔషధాన్ని ఇచ్చి పరీక్షిస్తారు. ఈ సంవత్సరాంతానికి పరీక్షల ఫలితాలు వెల్లడి కావచ్చని అరిజీన్ సీఈఓ మురళి రామచంద్ర వివరించారు.
*ఆరోగ్య, వైద్య పరీక్షల ఐరోపా సంస్థ మెడికవర్ గ్లోబల్ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఆసుపత్రులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్లో ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్న సంస్థ తాజాగా నెల్లూరులో 250 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది. ఇక్కడే 100 పడకలతో అంతర్జాతీయ స్థాయి కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. దేశీయంగా ఈ సంస్థ ఇప్పటికే ఈక్విటీ, డెట్ రూపాల్లో రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది.
*టెలికాం సంస్థలు చెల్లించాల్సిన ఏజీఆర్ (సర్దుబాటు స్థూల ఆదాయం) బకాయిల విలువను ఇంకా లెక్కించే పనిలోనే టెలికాం విభాగం (డాట్) ఉంది. వివిధ సర్కిల్ కార్యాలయాలు అనుసరించిన అకౌంటింగ్ విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించడంతోనే, చివరిసారిగా డాట్ మళ్లీ లెక్కిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏజీఆర్ బకాయిలెంతో మళ్లీ లెక్కించాలంటూ, మార్గదర్శకాలతో కూడిన ఓ లేఖను అన్ని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (సీసీఏ) కార్యాలయాలకు ఫిబ్రవరి 3న డాట్లోని లైసెన్సు ఫైనాన్స్ విభాగం పంపింది.