DailyDose

యువరాజుకి కొరోనా అంటుకుంది-తాజావార్తలు

Rajyasabha Elections Postponed-Prince Charles Tested Positive For COVID19

* కరోనా మహమ్మారి సెగ బ్రిటన్‌ రాజకుటుంబాన్ని తాకింది. ప్రిన్స్‌ చార్లెస్‌(71)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్కాట్‌ల్యాండ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్‌ హౌస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, చార్లెస్‌ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్‌ వచ్చిందన్నారు. మరోవైపు బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కేసులు నమోదు కాగా.. 422 మంది మృత్యువాతపడ్డారు.

* దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

* ప్రముఖ గాయని కనికా కపూర్‌కు మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలింది. లండన్‌ నుంచి వచ్చిన కనికా కపూర్‌ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువరు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగింది.

* రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లాం, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాల కోసం ప్రజలు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమిగూడటంపై చర్చించారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు.

* కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సర్వీసులను నిలిపివేసింది. ‘వినియోగదారుల అవసరాలను తీర్చడమే ప్రథమ ప్రాధాన్యత, సాధ్యమైనంత త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం’ అని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నాం. అందరూ సురక్షితంగా ఉందాం. తద్వారా జాతికి సాయ పడదాం. ఇంట్లోనే ఉంటూ మనల్ని మనల్ని కాపాడుకుందాం’ అంటూ ఒక ప్రకటన జారీ చేసింది. కాగా కరోనా వైరస్ ప్రకంపనలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాటికి 4,22,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,887 మరణాలు చోటు చేసుకున్నాయి.

* లాక్‌డౌన్‌ సమయంలో సౌకర్యవంతమైన వాతావరణం ఉండదని.. ప్రజలంతా దీనికి సహకరించాలని హైదరాబాద్‌ నగర సీపీ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు 21 రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పారు. బుధవారం నగరంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించడంతో పాటు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు అంజనీకుమార్‌ వెల్లడించారు. పాస్‌లు కావాల్సిన వారు పోలీస్‌స్టేషన్ల వద్దకు రావాల్సిన అవసరం లేదని.. హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. వివరాలను 94906 16780 నంబర్‌కు వాట్సాప్‌ చేయడంతో పాటు covid19.hyd@gmail.com ద్వారా కూడా సంప్రదించవచ్చని.. పాస్‌లు కావాల్సిన వారితో తమ సిబ్బంది మాట్లాడి అందజేస్తారన్నారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఆరు సూత్రాలు చెప్పారు. ఆయన బుధవారం సోషల్‌మీడియా వేదికగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ.. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కరోనాతో పోరాడటం గురించి మీ అందరికీ ఈ ఆరు విలువైన నియమాలను పాటించమని కోరుతున్నా’ అంటూ కొన్ని సూచనలు చేశారు. సరైన మాధ్యమాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు.

1. ఇది అతి ముఖ్యమైనది, ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.

2. ఏదైనా తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు, నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

3. మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి.

4. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు, టిష్యూ వాడండి.

5. సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల, బయట ఇతర వ్యక్తులకు కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.

6. మీకు కరోనా లక్షణాలు, అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్కును వాడండి. మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే దయచేసి వైదుడ్ని సంప్రదించండి.

* కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే రైళ్ల రాకపోకలను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 14 వరకు రిజర్వేషన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రహోంశాఖ ఆదేశాలతో ఆన్‌లైన్‌ సహా కౌంటర్లలో రిజర్వేషన్లు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 12 తర్వాత తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని రైల్వేశాఖ పేర్కొంది.

* కరోనా వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం సూచించినట్లు చెప్పారు. రైతు బజార్లు ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయాలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారని.. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయనున్నట్లు నాని వివరించారు.

* కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 26న నిర్వహించాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ముగిసే నాటికి పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారణంగా మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. మళ్లీ కొత్తగా పోలింగ్‌ తేదీ, లెక్కింపు తేదీలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

* ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఐదు దశలను పాటించి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. కరోనా వైరస్‌ సోకినవారు బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తిస్తుందని హెచ్చరించారు. ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే.. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారిని ముందే క్వారంటైన్‌ చేయాల్సిందని.. వారిని క్వారంటైన్‌ చేయడంలో ఆలస్యం జరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పట్టణాలు, పురపాలికలు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇండియాలో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగితే మన ఖ్యాతి పెరుగుతుందని అన్నారు.

* ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తోంది. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సహా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కరోనా నిరోధక టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సమీక్షించారు. రాష్ట్రంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్‌ నిరోధక ద్రావణం చల్లించడంతో పాటు ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. ఇంటింటి రీసర్వేను గురువారం నాటికి గ్రామ/ వార్డు వాలంటీర్లు ఆశావర్కర్ల సాయంతో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు నగరంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో నగరంలోని వసతిగృహాలను నిర్వాహకులు ఖాళీ చేయిస్తున్నారు. అమీర్‌పేట, పంజాగుట్ట, బాలానగర్‌లో పెద్దసంఖ్యలో ఉన్న వసతి గృహాల నుంచి విద్యార్థులను నిర్వాహకులు పంపించేస్తున్నారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ విద్యార్థులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎస్సార్‌ నగర్‌, పంజాగుట్ట, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ల వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.

* దేశంలో కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ తప్పసరి చర్య అని చెప్పారు. ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని.. క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జావడేకర్‌ మాట్లాడారు. ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటిస్తారనే నమ్మకముందన్నారు. పాలు, నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయం వరకు తెరిచే ఉంటాయని జావడేకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని చెప్పారు.

* కరోనా వైరస్‌ విజృంభిస్తు్న్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈక్రమంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎంపీ నిధుల నుంచి రూ.4కోట్లు కేటాయిస్తున్నట్టు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఈమేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. వాలంటీర్‌ వ్యవస్థతో కరోనా కట్టడికి కృషి చేస్తున్న సీఎంకు అభినందనలు తెలిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ల బేర్‌ పట్టు వీడింది. కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందన్న ఆశలకు తోడు, అమెరికాలో ప్యాకేజీ అంశం ఓ కొలిక్కి రావడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 1861.75 పాయింట్లు లాభపడి 28,535.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 516.80 పాయింట్లు ఎగబాకి 8,317 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.88గా ఉంది.

* ఒకవేళ మీకు కరోనా వైరస్‌ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కరోనా వైరస్‌పై నిర్లక్ష్యం వహించకుండా వారికే వైరస్‌ సోకిందనే భావనతోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ న్యూజిలాండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో దేశప్రజలనుద్ధేశిస్తూ ప్రధాని జసిండా ఈ వ్యాఖ్యలు చేశారు.

* దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కట్టడికి 21 రోజులపాటు దేశాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్‌ విజృంభణను అరికట్టడానికి ఇంతకుమించి మార్గం లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ‘‘మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నా అభ్యర్థన కూడా అదే. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి’’ అని విరాట్‌ ట్వీటాడు.

* ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ చేయడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు కొన్నిరోజులపాటు ఇళ్లకే పరిమితమైతే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న 21రోజుల లాక్‌డౌన్‌పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇంతకుముందే ఈ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇదే సరైన సమయమని, ప్రజలు దీనికి సహకరించాలని కోరుతున్నారు.

* ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన స్నేహితుడు, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. దానయ్య నిర్మాత. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. ఈ సినిమా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌ను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటే ‘రౌద్రం, రణం, రుధిరం’ అని తెలిపారు. దీంతోపాటు చరణ్‌, తారక్‌ లుక్‌లను కాస్త రివీల్‌ చేశారు. కరోనాతో ప్రజలు పోరాడుతున్న ఈ తరుణంలో వారిలో కాస్త ఉత్సాహం నింపే ప్రయత్నంగా దీన్ని విడుదల చేసినట్లు రాజమౌళి వెల్లడించారు. ఈ ప్రచార చిత్రాన్ని చూసిన వర్మ, చిరంజీవి, వి.వి. వినాయక్‌, అఖిల్‌ తదితరులు ట్విటర్‌ వేదికగా స్పందించారు.