Business

3నెలలు EMIలు కట్టనక్కరలేదు

All Indian Banks Allow To Skip 3Month EMIs Due To COVID19

దేశంలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈఎంఐలను మూడు నెలల పాటు చెల్లించనక్కరలేదని, రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశమే అయినా ఇంకా వారిలో అయోమయం నెలకొంది. కొంతమందికి ఇంకా గందరగోళం నెలకొంది. మీ ఖాతాలనుంచి ఈఎంఐలు డెబిట్ అవుతాయని, బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉంచాలని మెసేజ్‌లు రావడమే అందుకు కారణం. అయితే తాజాగా పలు బ్యాంకులు ఖాతాదారులకు ట్వీట్ల ద్వారా గుడ్ న్యూస్ అందించాయి. ఆర్బీఐ అన్ని లోన్ల EMIలపై మూడు నెలల పాటు మారిటోరియం విధిస్తు తీసుకున్న నిర్ణయాన్ని తమ కస్టమర్లకు బదలాయిస్తూ ఇప్పటివరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఓబీసీ, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, బ్యాంక్ అఫ్ ఇండియా, ఐఓబీ, ఐడీబీఐ, యుసీఓ, ఇండియన్, సిండికేట్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో మార్చి 1 నుంచి మే 31 వరకూ అన్ని లోన్ల EMI చెల్లింపులపై కస్టమర్లకు వెసులుబాటు దక్కనుండగా.. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని బ్యాంకును సంప్రదించాల్సి ఉంది.

భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాల గురించి తమ శాఖలకు తెలియజేశాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఆర్థికంగా కాస్త వెలుసుబాటు కల్పించేందుకు కాలపరిమితితో కూడిన రుణ వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్‌బీఐ సూచించింది. మారటోరియం గురించి తమ శాఖలకు తెలియజేసిన బ్యాంకులు ఈఎంఐ చెల్లింపుల గురించి వినియోగదారులకు సందేశాలు పంపిస్తున్నాయి. ‘వాయిదాలు చెల్లించేందుకు వెసులుబాటు కోరుకుంటున్న వినియోగదారులు బ్యాంకు శాఖలకు మెయిల్‌ లేదా డిజిటల్‌ మాధ్యమాల ద్వారా తెలియజేస్తే చాలు’ అని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ తెలిపారు. చట్ట పరమైన ఇబ్బందుల కారణంగా వాయిదాలు వాయిదా వేయాలని బ్యాంకులే నేరుగా చెప్పలేవని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌-19 ప్రభావం లేనివారు వాయిదాలు కట్టేందుకే మొగ్గుచూపాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు. మారటోరియం అమలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ, యూకో, ఇండియన్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఓబీసీ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించాయి.