DailyDose

తెలుగు రాష్ట్రాల్లో కుక్కలకు గొంతువాపు వ్యాధి-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Dogs In Telugu States Having Throat Infections

* తెల్లరేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి విపత్తు వేళ రూ.5వేల చొప్పున సాయం అందించాలని విపక్షనేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిసి కరోనా సహాయక చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం ఆదుకోవాలని సీఎస్‌కు సూచించారు.

* కరోనా విపత్తు వేళ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విపత్తుల సమయాల్లో తెదేపా వెన్నంటి నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలన్నారు. పేదలను, కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రైతులకు సాయమందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

* కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేత కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాఠాలు చెప్పించుకోవాలని భాజపా హితవు పలికింది. రుణాలు రద్దు చేయడానికి (వైవె-ఒఫ్ఫ్), పుస్తకాల్లోంచి సాంకేతికంగా పద్దులు తొలగించడానికి (వ్రితె-ఒఫ్ఫ్) తేడా అర్థం చేసుకోవడానికి ఆయన సాయం తీసుకోవాలని ఎద్దేవా చేసింది.

* ఇతర దేశాలతో పోలిస్తే కొవిడ్‌-19పై పోరులో అన్ని పరామితుల్లోనూ భారత్‌ ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. మరికొన్ని వారాల్లో ఈ నిర్ణయాత్మక పోరులో దేశం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

* ఏ దేశ ఆర్థిక పురోగతికైనా శ్రామికుల కష్టించేతత్వమే ప్రధాన ఇంధనమని.. కార్మిక లోకం శ్రమను గుర్తించి గౌరవించడం అందరి బాధ్యతని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా ఆ బాధ్యతను మరోసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. యావత్ కార్మిక లోకానికి జనసేన పార్టీ తరఫున పవన్‌ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మూలంగా తలెత్తుతున్న పరిస్థితుల ప్రభావం కార్మికులపై పడే ప్రమాదం ఉందని.. ఈ కష్ట కాలంలో వారి సమస్యలపై అందరూ సానుభూతితో స్పందించాలన్నారు. వారి ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ కలిగించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించి ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ సమయంలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని పవన్ కోరారు. అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం గురించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

* ఎక్కడో చైనాలో ఉనికిలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిపై ఇప్పటికే ఎంతో మంది సినీ గాయకులు, రచయితలు పాటల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ పాటించాలని ఎంతో మంది వారికి తోచిన విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలో మేము సైతం అంటూ విశాఖ యువత పాట ద్వారా ముందుకొచ్చారు. ‘ఇది ఒక యుద్ధం.. కరోనాతో యుద్ధం’ అని రూపొందించిన పాట పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని కళ్లకుకడుతోంది. విశాఖకు చెందిన సంతోష్‌ ఎడ్లప ఈ పాటను నిర్మించారు. విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కేటీవీ రమేశ్‌ ఈ పాటకు సాహిత్యం, సంగీతం, గాత్రాన్ని అందించారు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ ఈ పాటను ఆవిష్కరించారు.

* భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 33,050కి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాలలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య మిలియన్లలో, మృతుల సంఖ్య వేలల్లోనూ ఉంది. వాటితో పోలిస్తే భారత గణాంకాలు ఊరట కలిగిస్తున్నప్పటికీ… దేశంలో ఈ మహమ్మారి గురించి పలు అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని పాటించటం ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ విధమైన అపోహల్లో ఐస్‌క్రీమ్‌, ఇతర చల్లని పదార్థాలు తినటం వల్ల కరోనా వైరస్‌ సోకుతుందనే భావన ఒకటి. చల్లని పదార్థాలను తినటం లేదా తాగటం వల్ల కొవిడ్‌ సోకుతుంది అనేందుకు ఏ ఆధారము లేదని ప్రభుత్వ సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాధి గురించి ప్రచారంలో ఉన్న అనేక అసత్యాలలో ఇది కూడా ఒకటి అని సంస్థ తెలిపింది. ప్రమాదకరమైన కరోనా వ్యాధికి సంబంధించిన పుకార్లలోని నిజానిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చని పీఐబీ వెల్లడించింది.

* రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో రేషన్‌ పంపిణీకి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. కరోనా వ్యాప్తిచెందుతున్న ఈ సమయంలో వేలిముద్రలు వేయాలనడం సరైన నిర్ణయం కాదన్నారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వేలిముద్రల విధానం నిలిపి వేయాలని డిమాండ్‌ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కావాలంటే బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వానికి కన్నా సూచించారు.

* వీధి శునకాలకు కరోనా సోకిందని స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో పరీక్షలు నిర్వహించిన వెటర్నరీ అధికారులు ఆ వైరస్‌ సోకలేదని తేల్చారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో శునకాలకు గొంతు వద్ద వాపు వచ్చి దగ్గుతుండటంతో వాటికి కరోనా సోకిందని ప్రచారం సాగింది. జిల్లా వెటర్నరీ అధికారులకు కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. శునకాలకు వెటర్నరీ సిబ్బంది పరీక్షలు చేయగా.. వాటికి కరోనా సోకలేదని నిర్ధారణ అయిందని జోగులాంబ గద్వాల జిల్లా వెటర్నరీ అధికారి ఆదిత్య కేశవసాయి తెలిపారు. గ్రామ సమీపంలోని ఓ పౌల్ట్రీ ఫాం వద్ద కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల శునకాలు ఇలా ప్రవరిస్తున్నాయని తేల్చారు. మంగళ, బుధవారాల్లో వెటర్నరీ అధికారులు వాటికి యాంటీ బయాటిక్స్‌, మాత్రలను వేసినట్లు పేర్కొన్నారు.

* కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మిగతా రాష్ట్రాలకూ ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర హోంశాఖ యోచిస్తోంది. కరోనా కేసుల పెరుగుదలతో నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇప్పటికే పశ్చిమ్‌బెంగాల్‌, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు కేంద్ర బృందాలు వెళ్లాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న మిగిలిన రాష్ట్రాలకూ బృందాలను కేంద్రం పంపనున్నట్లు తెలుస్తోంది.

* తెలంగాణలో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 15 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.