DailyDose

హైదరాబాద్‌లో విపరీతమైన ట్రాఫిక్-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Huge Traffic In Hyderabad

* మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున న్యాయవాది రాతపూర్వక వాదనలను సోమవారం లోపు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

* భాగ్యనగరంలో దాదాపు 45 రోజుల తర్వాత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆయా రంగాలకు చెందిన వారు బయటకి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖలతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగులు సైతం 33 శాతం మంది కార్యాలయాలకు వెళ్తున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు సైతం తెరచుకుంటున్నాయి.

* విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్​ (ఎన్జీటీ) కేంద్ర ప్రభుత్వం, ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డుకు (సీపీసీబీ) నోటీసులు జారీ చేసింది. ప్రాణ నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా ఆధారంగా రూ.50 కోట్లు మధ్యంతర జమ చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించింది. జస్టిస్ బి.శేషశయనా రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ఎన్జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

* కోవిడ్‌-19 కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రోజువారి కూలీల‌పై లాక్‌డౌన్ ఎంత మేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌న్న విష‌యంపై ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మ‌దాబాద్ ప‌ట్ట‌ణంలో స‌ర్వే నిర్వ‌హించింది. 85శాతం మంది రోజువారి కూలీలపై లాక్‌డౌన్ ప్ర‌భావం చూపించిందని స‌ర్వేలో తేలింది. ఇండియాలో క‌రోనా వైర‌స్ ప్రారంభ‌మైన మార్చి నెల నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కార‌ణంగా నైపుణ్యం లేని కార్మికులను, రోజువారీ కూలీల‌ను నిరుద్యోగులుగా మార్చింది.

* విశాఖ గ్యాస్‌ లీకేజీ‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మెహన్‌రెడ్డి స్పందించిన తీరు దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటీ వరకు వైఎస్‌ జగన్‌లా స్పందించలేదన్నారు. ఆయన స్పందించిన తీరు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వెంటిలేటర్‌పై పడేలా చేసిందని విమర్శించారు. ఇక ఇప్పట్లో చంద్రబాబు కోలుకోవడం కష్టమే అని ఆయన ఎద్దేవా చేశారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ వెంటనే స్పందించి ఆగమెఘలా మీద చర్యలు తీసుకున్నారన్నారు. దీంతో ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలపై విమర్శలు చేసే అవకాశం పోయిందని చంద్రబాబులో బాధ నెలకొందని ఆయన విమర్శించారు.

* ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనమంతా స్థంభించడంతో పాటు ఆర్థిక కార్యాకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాలు బయటపెడితే కరోనా ఏ పక్క నుంచి కాటేస్తుందోనని ప్రతి ఒక్కరూ బయపడుతున్నారు. ఓ వైపు కరోనా మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు తమ రోజూవారి కార్యాకలపాలను కొనసాగించేందుకు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. కేవలం భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే వైరస్‌ నుంచి కొంత కుదుటపడ్డ దేశాలు ఇప్పుడే లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు జంకుతున్నాయి. మరి కొన్నాళ్ల పాటు ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

* సెప్టెంబర్‌ 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ చేయాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. లబ్ధిదారుల ఇంటివద్దకే బియ్యం చేర్చాలని సూచించారు. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్నిఅమలులోకి తేవాలని ఆదేశించారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే ధ్యేయంగా పనిచేయాలన్నారు. అవినీతికి పూర్తి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేయాలని సూచించారు. మొబైల్‌ వాహనాల ద్వారా గడప వద్దకే బియ్యం చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

* విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబాలతో పాటు అస్వస్థతకు గురైన వారికీ పరిహారం చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిహారం మొత్తంగా రూ.30 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు; వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు; 2, 3 రోజుల పాటు ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు; ప్రాథమిక స్థాయి చికిత్స పొందిన వారికి ₹25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ప్రభావిత గ్రామాల్లో ఇంటికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.30 కోట్లు పరిహార మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది. తక్షణమే దీన్ని బాధితులకు అందించాల్సిందిగా సూచించింది.

* స్మార్ట్‌ఫోన్లు వినియోగం పెరిగిన తర్వాత ప్రొఫెషనల్‌ కెమెరాలను కొనేవారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. ఎవరైనా కొత్తగా ఫోన్‌ కొంటే, ఎన్ని కెమెరాలు ఉన్నాయి? ఎంత మెగాపిక్సెల్‌? బ్యాటరీ ఎంత? సాధారణంగా ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న ఇదే. తాజాగా టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ 10 5జీని షావోమి శుక్రవారం విడుదల చేసింది. 108 మెగాపిక్సెల్‌ కెమెరాను కలిగి ఉండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఎప్పుడో రావాల్సిన ఈ ఫోన్‌ కరోనా కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది.