DailyDose

అట్టుడుకుతోన్న అమెరికా. పేలిన రాకెట్ -తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - USA Under Fire Over George Floyds Death

* భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపడమే లక్ష్యంగా స్పేస్‌ ఎక్స్‌ సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇందుకోసం రూపొందిస్తున్న భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌(నమూనా) ప్రయోగం మరోసారి విఫలమైంది. ఇలా జరగడం ఇది నాలుగోసారి. శుక్రవారం భారీ ఏర్పాట్ల మధ్య టెక్సాస్‌లోని సంస్థ ప్రయోగ కేంద్రంలో రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇంజిన్‌ను మండించగా.. అది నేలపై ఉండగానే పేలిపోయింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,504 మంది నమూనాలు పరీక్షించగా 131 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 61 ఉండగా.. రాష్ట్రంలో 70 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,461కి కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 2092 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు.

* రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెరిగాయి. పెంచిన ధరలను రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లేవారిపై టోల్‌గేట్‌ భారం పడనుంది.

* గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే అవి వైరస్‌కు కేంద్రస్థానాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతూ కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌గౌబా పలు విషయాలు వెల్లడించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి సొంతరాష్ట్రాలకు వెళ్తుండటంతో తూర్పు భారతం ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా తీవ్రత తక్కువగా ఉందని, కానీ గత మూడు వారాల నుంచి మే 25 వరకు నమోదవుతున్న కేసుల్లో వేగం పెరిగిందన్నారు. గతంలో పది కంటే తక్కువ కేసులున్న త్రిపుర, మణిపూర్‌లో కూడా ఇదే తీరు కనిపిస్తోందని వెల్లడించారు.

* అమెరికాలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా పలు నగరాల్లో శుక్రవారం ఆందోళనలు చెలరేగాయి. తొలుత శాంతియుతంగానే ప్రారంభమైన ఆందోళనలు అనతికాలంలోనే హింసాత్మకంగా మారాయి. ‘జస్టిస్‌ ఫర్‌ ఫ్లాయిడ్‌’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అనేక చోట్ల పోలీసుల వాహనాలు, అధికారిక భవనాలపై రాళ్లు రువ్వారు. మరికొన్ని చోట్ల వాహనాలు, రెస్టారెంట్లకు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసలు నిరసనల్ని అదుపు చేయడానికి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎట్టకేలకు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ‘పెంటగాన్’ పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైతే మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఓ సంబంధిత అధికారి తెలిపారు.

* ఎడారి మిడతలు ఇప్పుడే అనంతకు వచ్చే అవకాశాలు లేవనీ… దీనిపై అవగాహన పెంచుకుంటే రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. జిల్లాలో అక్కడక్కడా కనిపిస్తున్నవి దేశీయ మిడతలే అని స్పష్టం చేశారు. అవి పంటలకు ఎలాంటి నష్టం చేయవనీ… ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

* పైలట్‌కు కరోనా నిర్ధారణ కావడంతో దిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలు దేరిన ఎయిరిండియా విమానం మధ్యలోనే వెనుదిరిగింది. విమానంలో ఓ పైలట్‌కు వైరస్ సోకిందని గుర్తించడంతో విమానయాన సంస్థ వందే భారత్ మిషన్‌లో భాగంగా కేటాయించిన విమానాన్ని వెనక్కి రప్పించింది. ‘వందే భారత్ మిషన్‌లో భాగంగా రష్యాలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి మాస్కోకు బయలుదేరిన ఏ320 విమానం మధ్యలోనే వెనుతిరిగింది’ అని ఎయిరిండియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

* కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది. హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం సమాచారం అందించారు

* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించిందని గుర్తు చేశారు. దేశంలో అనేక పేద రాష్ట్రాలున్నాయని.. అలాంటి చోట కూడా జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులు లేవన్నారు.