Politics

రేపు ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ కానున్న జగన్

Jagan To Meet Amit Shah To Discuss Nimmagadda Issue

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల తర్వాత తొలిసారి ఢిల్లీకి సీఎం వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ కానున్నారని తెలియవచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు, మండలి రద్దు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వ్యవహారంతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారని సమాచారం. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన వైనాన్ని ఆయన వివరించనున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి అక్కడే బస చేసి బుధవారం నాడు ఏపీకి జగన్ తిరుగు పయనం కానున్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను పునర్‌ నియమించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే రమేశ్‌ కుమార్‌ తొలగింపునకు సంబంధించి ఇచ్చిన ఆర్డినెన్స్‌లు, జీవోలను కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నియామకంపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది.