NRI-NRT

అమెరికా F1 గురి ఇండియా కాదు…చైనా

అమెరికా F1 గురి ఇండియా కాదు…చైనా

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల వెనుక మర్మమేమిటి? ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులను వెనక్కి పంపుతామన్న ట్రంప్‌ సర్కారు ఆదేశాల లక్ష్యం చైనాయేనా? ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ వీసాల జారీని నిషేధించడంతో విదేశీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) విభాగం నిర్ణయంతో వారంతా భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్నారు. అందునా చైనా విద్యార్థులే ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2018-19 గణాంకాల మేరకు వివిధ దేశాలకు చెందిన 11 లక్షల మంది ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం చేరారు.ఉన్నత విద్య కోసం ఎన్‌రోల్‌ అయిన మొత్తం విద్యార్థుల్లో వారి శాతం 5.5గా ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల్లో 4,78,732 మంది చైనీయులే. రెండో స్థానం మనదే. మొత్తం 1,94,556 మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. 2018లో విదేశీ విద్యార్థుల ద్వారా అమెరికా ఖజానాకు చేరిన మొత్తం 3.35 లక్షల కోట్లు. కొవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ క్లాసుల వైపు యూనివర్సిటీలు మొగ్గు చూపుతున్నాయి. ఆన్‌లైన్‌లో చదివే వారిని దేశం నుంచి వెళ్లగొట్టడం ఏం ఔచిత్యమనే ప్రశ్న ఉదయిస్తోంది. దీని వల్ల చైనీయులే ఎక్కువగా నష్టపోనున్నారు. ఒకవేళ తాజా ఆదేశాల నేపథ్యంలో స్వదేశంలో ఉండి ఆన్‌లైన్‌ ద్వారా చదువుకుందామని చైనా విద్యార్థులు భావించినా.. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అది ఎంతో క్లిష్టం. రాత్రిళ్లు మేల్కొని ఉండి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడం ఎలా సాధ్యమని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో డాక్టొరల్‌ విద్యార్థి వూడీ ప్రశ్నించారు. ఐసీఈ నిర్ణయాన్ని ప్రతీకార వైఖరిగా చెప్పొచ్చన్నారు. చైనా విద్యార్థులను ప్రధాన లక్ష్యం చేసుకుని కొందరు రిపబ్లికన్‌ ప్రజాప్రతినిధులు ఓ బిల్లును ప్రతిపాదిస్తున్నారు. స్టెమ్‌(సైన్స్‌-టెక్నాలజీ-ఇంజనీరింగ్‌-మ్యాథ్స్‌) కోర్సులు చదవకుండా చైనీయులను అడ్డుకోవడమే ప్రతిపాదిత బిల్లు ఉద్దేశం. గత ఏడాది 28400 మంది చైనీయులు హెచ్‌1-బీ ఎగరేసుకుపోయారు. మొత్తం హెచ్‌1-బీ వీసాల్లో 15 శాతం చైనా విద్యార్థులకే దక్కుతున్నాయి. అమెరికన్లకే ప్రాధాన్యం అంటూ ఎలుగెత్తుతున్న ట్రంప్‌.. వర్క్‌ వీసాలతో పాటు విదేశీ విద్యార్థులకు కత్తెర వేసే వ్యూహం పన్నారు. కాగా, ఐసీఈ తాజా మార్గదర్శకాల వల్ల భారత విద్యార్థుల్లో అనిశ్చితికి దారి తీసే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.