Business

ఇస్రోపై అమెరికా కోర్టు భారీ జరిమానా-వాణిజ్యం

ఇస్రోపై అమెరికా కోర్టు భారీ జరిమానా-వాణిజ్యం

* వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంట, ట్రాక్టర్‌ రుణాలు వ్యవసాయ రుణాల కిందకే వస్తాయి గనుక వాటికి వడ్డీ మాఫీ ఉండదని తెలిపింది. వడ్డీమాఫీపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా తరచూ అడిగే ప్రశ్నల జాబితా(ఎఫ్‌ఏక్యూ)ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న క్రెడిట్‌ కార్డు బకాయిలకు ఈ ఉపశమనం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డ్ బకాయిల విషయంలో, మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు వినియోగదారుల నుంచి ఈఎంఐ ప్రాతిపదికన ఫైనాన్స్ చేసిన లావాదేవీల కోసం కార్డ్ జారీచేసేవారు వసూలు చేసే సగటు రుణ రేటునే(వాళృ) వడ్డీ రేటుగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

* వాణిజ్య, ఆర్థికంగా అమెరికా వేరు పడుతోందన్న ప్రచారంపై చైనా స్పందించింది. అలా జరిగితే ఇరు దేశాలకు నష్టమేనని వివరించింది. ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ సెంట్రల్‌ కమిషన్‌ ఆఫీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హాన్‌ వెన్‌ష్యూ మాట్లాడుతూ ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు స్వేచ్ఛా వాణిజ్యంతో ఏర్పడినవని తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం ముగియాలని చాలా తక్కువ మంది కోరుకుంటున్నారని.. ఈ బంధం బలపడాలని కోరుకొనే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు. చైనా-అమెరికాలో మధ్య ఆర్థిక దూరం నిజం కాదని హాన్‌ తెలిపారు. ‘పూర్తిగా విడిపోవడం ఇరు దేశాలకు నష్టదాయకమైన ప్రణాళిక. దీని వల్ల రెండు దేశాలకు.. ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏటా 16 చొప్పున పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

* అమెరికా న్యాయస్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చుక్కెదురైంది. దీంతో ఆ సంస్థకు చెందిన వ్యాపార విభాగమైన యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ ఇప్పుడు 1.2 బిలియన్‌ డాలర్లు (రూ.8.9వేల కోట్లు) పరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. యాంత్రిక్స్‌ సంస్థ 2005లో దేవాస్‌ మల్టీమీడియా సంస్థతో ఉన్న ఒక ఒప్పందం రద్దు చేసుకోవడంపై అమెరికా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

* యాపిల్‌ తురుపు ముక్క ఐఫోన్‌ ఆ సంస్థకు లాభాలనే కాదు.. అప్పుడప్పుడు మార్కెటు విలువను హారతి కర్పూరం చేసి ఝలక్‌ కూడా ఇస్తుంది. అంటే ఆ ఫోన్‌ పనితీరుతో కాదు.. కేవలం అనుకున్న సమయానికి మార్కెట్లోకి రావడం ఆలస్యమైనా ఆ ప్రభావం యాపిల్‌ మార్కెట్‌ విలువపై తీవ్రంగానే పడుతోంది. తాజాగా ఐఫోన్‌ 12.. కరోనా ప్రభావం కారణంగా అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యమైంది. అంతే.. నేడు మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల విలువ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో దాదాపు 5శాతం పతనమైంది. దీనిని సొమ్ము రూపంలో చూస్తే 100 బిలియన్‌ డాలర్లు.. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.7.42 లక్షల కోట్లు పైచిలుకు మాట.

* అసలే మొండి బకాయిలతో కునారిల్లుతున్న బ్యాంకులపై ఇప్పుడు క్రెడిట్‌ కార్డు రుణాల భారం కూడా పడనుంది. కొవిడ్‌-19 కారణంగా తలెత్తిన పరిస్థితులతో భారీ ఎత్తున క్రెడిట్‌ కార్డు రుణాలు ముప్పులో పడ్డాయని ఆర్‌బీఐ ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది.