Business

వాల్‌మార్ట్‌కు బాగా జీవం పోస్తున్న భారతీయులు-వాణిజ్యం

Walmart Gets Record Subscriptions In India - Business News Roundup

* భారత్‌లో తమ అనుబంధ వ్యాపారాలైన ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ ఫోన్‌పేకు నెలవారీ క్రియాశీల వినియోగదారుల (మంత్లీ యాక్టివ్‌ యూజర్స్‌) సంఖ్య జీవనకాల గరిష్ఠానికి చేరిందని అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ వెల్లడించింది. ఆగస్టు-అక్టోబర్ త్రైమాసికంలో తమ సంస్థ నికర విక్రయాలు 29.6 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే 1.3 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌పే వ్యాపారాల్లో బలమైన వృద్ధి వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. బిగ్‌బిలియన్‌ డేస్‌ యూజర్ల పెరుగుదలకు బాగా దోహదం చేసినట్లు వెల్లడించింది. భారత్‌తో పాటు కెనడా, మెక్సికోలోనూ ఫ్లిప్‌కార్ట్‌ వ్యాపారం వృద్ధి చెందినట్లు పేర్కొంది.

* అమెరికాలో చదువుకోవడం విద్యార్థుల కల. దానికి అనుగుణంగా ఏటా లక్షలమంది విద్యార్థులను ఆ దేశం ఆహ్వానిస్తుంటుంది. తద్వారా విద్యార్థులు జీడీపీ వృద్ధికి కూడా దోహదపడుతున్నారు. భారత్‌తోపాటు చైనా, జపాన్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి లక్షల మంది విద్యార్థలు అక్కడకి వెళ్తుంటారు. అయితే, 2019-20 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 7.6 బిలియన్‌ డాలర్లు సమకూరినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య 4.4 శాతం తగ్గినప్పటికీ ఇంత మొత్తంలో ఆదాయం సమకూర్చడం గమనార్హం. భారత్‌ నుంచి 1,93,124 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత ఏడాది అమెరికాకు వెళ్లారు. అత్యధికంగా చైనా వల్ల ఎక్కువ రాబడి వచ్చినట్లు నివేదిక తేల్చింది. వరుసగా 16వ ఏడాది చైనా విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు ‘‘ ఓపెన్‌ డోర్స్ 2020’’ నివేదికలో వెల్లడైంది. తాజా విద్యా సంవత్సరంలో 3,72,000 మంది చైనా విద్యార్థులు అమెరికాకు వచ్చినట్లు పేర్కొంది. అమెరికా విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఇన్‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) విడుదల చేసిన వివరాల మేరకు ఏటా 10 లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్తుంటారు. 2019 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల వల్ల అమెరికాకు 44 బిలియన్‌ డాలర్ల సమకూరుతుంటే అందులో భారతీయ విద్యార్థుల ద్వారా 7.69 బిలియన్‌ డాలర్లు వస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది.‘‘వరుసగా 5 ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులను ఆమెరికాకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. కరోనా వ్యాప్తి సమయంలోనూ ఈ రికార్డు సాధించాం’’ అని అమెరికా విద్య, సాంస్కృతిక శాఖ మంత్రి రోయ్‌సీ వెల్లడించారు. విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకోవడం అభినందనీయమన్నారు. జీవితంలో అభివృద్ధి చెందాలటే చదువు ఎంతో ముఖ్యమని, యువత కలలను సాకారం చేసుకునేందుకు ఇది అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులు అమెరికాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నైపుణ్యాలతో కూడిన చదువును అందిస్తున్నామని తెలిపారు.

* దేశీయ మార్కెట్ల రికార్డుల జోరు కొనసాగుతోంది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల అండతో బుధవారం కూడా సూచీలు లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ తొలిసారిగా 44వేల మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 13 వేల మార్క్‌కు చేరువైంది. ఆటోమొబైల్‌, ఆర్థిక రంగాల్లో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 44వేల మార్క్‌ను దాటింది. అయితే తొలి గంటల్లో లాభాల స్వీకరణ జరగడంతో కాస్త ఒత్తిడికి గురైన సూచీలు ఒడుదొడుకుల్లో సాగాయి. చివరకు మళ్లీ కీలక రంగాల్లో కొనుగోళ్లు లాభాలను నిలబెట్టాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 227 పాయింట్లు ఎగబాకి 44,180 వద్ద కొత్త రికార్డులో స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12,938 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. భారత్‌ పెట్రోలియం, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్ లిమిటెడ్‌‌, ఐటీసీ, టైటాన్‌ కంపెనీలు నష్టపోయాయి.

* దేశీయ మార్కెట్లు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సమయంలో స్వల్ప లాభాల్లోకి ఎగబాకాయి. అనంతరం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 19 పాయింట్లు నష్టపోయి 43,933 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 7 పాయింట్లు నష్టంతో 12,867 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.35 వద్ద కొనసాగుతోంది.

* వేదాంతాకు చెందిన స్వతంత్ర డైరెక్టర్లు తమ బాధ్యత విస్మరించారని.. కంపెనీలో నిధుల మళ్లింపు జరిగినా గమనించలేకపోయారని మైనారిటీ వాటాదారు, లండన్‌కు చెందిన హెడ్జ్‌ ఫండ్‌ కీమా కాపిటల్‌ పేర్కొంది. కంపెనీలో కార్పొరేట్‌ పాలన విషయంలో అవకతవకలు జరిగాయనడానికి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డైరెక్టర్‌ లలిత డి. గుప్తే రాజీనామాను సంకేతంగా భావించవచ్చని పేర్కొంది. కార్పొరేట్‌ పాలన విషయంలో ఆందోళన వెలిబుచ్చుతూ గుప్తే రాజీనామా అనంతరం వేదాంతా బోర్డుకు కీమా క్యాపిటల్‌ లేఖ రాసింది. అయితే అందుకు తగ్గ స్పందన రానందున సెబీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, ‘వేదాంత, ఆ కంపెనీ అనుబంధ సంస్థలు తన మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్‌కు గత కొద్ది నెలల్లో 956 మిలియన్‌ డాలర్ల రుణాలను ఇచ్చాయి. దివాలాకు దగ్గరలో ఉన్న మాతృ సంస్థకు రుణాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఎటువంటి అత్యున్నత స్థాయి తనిఖీ జరగలేదు. వేదాంతా బోర్డు ఈ విషయంలో అంతా నిద్ర పోయినట్లుగా కనిపిస్తోంద’ని కీమా క్యాపిటల్‌ పేర్కొంది. తక్షణం మాతృ సంస్థకిచ్చిన రుణాలను వెనక్కి తీసుకోవాలని కూడా గతంలో కీమా క్యాపిటల్‌ కోరింది. అయినప్పటికీ అలా జరగనందున సెబీకి ఫిర్యాదు చేయడంతో పాటు రాబోయే కొద్ది వారాల్లో ఇతర నియంత్రణ, చట్టబద్ధ సంస్థలకు తమ ఆందోళనలను వెలిబుచ్చనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

* వొడాఫోన్‌కు అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై స్పందించే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం కావాలని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. రూ.22,100 కోట్ల పన్ను నోటీసుపై, భారత్‌-నెదర్లాండ్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల సంరక్షణ ఒప్పందానికి (బీఐపీఏ) సంబంధించి వెలువరచిన ఆ తీర్పునకు కట్టుబడి ఉంటారా లేదా సవాలు చేస్తారా అని అక్టోబరు 7న దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. కొంత సమయం కావాలని జస్టిస్‌ రాజీవ్‌ సహాయ్‌ ఎండ్లా, జస్టిస్‌ ఆశా మేనన్‌లతో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) చేతన్‌ శర్మ తెలియజేశారు. ప్రస్తుత ఇంజక్షన్‌ ప్రక్రియను కొనసాగించడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదని వొడాఫోన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించడానికి రెండు వారాల గడువును ఏఎస్‌జీ కోరగా.. డిసెంబరు 8కి విచారణను కోర్టు వాయిదా వేసింది.

* భారతీ ఎయిర్‌టెల్‌ తాము సేవలు అందిస్తున్న 10 టెలికాం సర్కిళ్లలో భవనాల లోపలా మొబైల్‌ మాటలు స్పష్టంగా వినపడేలా, డేటా వేగం బాగుండేలా కవరేజీని విస్తృతం చేయనుంది. ఇందు కోసం 900 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో 4జీ సాంకేతికతను ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యాండ్‌ను 2జీ సేవల కోసం కంపెనీ వినియోగించేది. ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాల సర్కిళ్లలో ఈ బ్యాండ్‌ను పునః వ్యవస్థీకరించి 4జీ సేవలను విస్తరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కంపెనీ దేశవ్యాప్తంగా 3జీ మౌలిక వసతులను 4జీకి అనుగుణంగా మార్పిడి చేసినట్లు ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. ఈ మార్పిళ్ల కారణంగా భవనాలు, అపార్ట్‌మెంట్లలోపల కూడా మొబైల్‌ సిగ్నళ్లు బలంగా రావడానికి వీలు కలుగుతుంది. ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్‌ ఇంకా స్పందించలేదు.