Fashion

గిరిజన్ జాఫ్రా గింజలతో లిప్‌స్టిక్

గిరిజన్ జాఫ్రా గింజలతో లిప్‌స్టిక్

చక్కటి ప్యాకింగూ, దానికింద మేలిముసుగులాంటి ర్యాపర్‌, అందులో ఓ చిన్నపెట్టె, దాన్ని తెరిస్తే మత్తెక్కించే గుబాళింపు… నేటితరం సౌందర్యసాధనాలు చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి! కానీ ఇవన్నీ పైపై మెరుగులే. ఆ సాధనాలకి మూలమైన మూలికలు మన పెరట్లోనే ఉండొచ్చు. ఉండొచ్చుకాదు… లిప్‌స్టిక్‌ తయారీలో వాడే జాఫ్రా గింజలు అలాగే కాస్తున్నాయి. అదీ మన ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా ఉత్పత్తవుతున్నాయి. గిరిజన రైతులకి లాభాల పంట పండిస్తున్నాయి!జాఫ్రా మొక్కలు… గుత్తులుగుత్తులుగా కాయలు కాస్తాయి. బాగా ముదిరిన తర్వాత కోస్తే వాటి నుంచి ఎర్రటి గింజలు వస్తాయి. ఆ గింజల నుంచి సహజ ఎరుపు, నారింజ రంగుల్ని వేరు చేసి ద్వారా లిప్‌స్టిక్‌ తయారీలో వాడుతున్నారు. ఇతర సౌందర్యసాధనాల్లోనూ ఉపయోగించడం కూడా ఇటీవల పెరిగింది. అంతేకాదు, ఈ రంగు వేడిని తట్టుకుని కరిగిపోకుండా ఉండటం వల్ల స్వీట్లూ, కేకుల తయారీల్లోనూ ఉపయోగిస్తున్నారు. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో వీటిని మిఠాయి రంగు చెట్లని పిలుస్తుంటారు. కాకపోతే, ఎన్నడూ లేనిది ఈ మొక్క ఇప్పుడు మన గిరిరైతులకి సిరులు కురిపిస్తోంది.
**మనమే టాప్‌…
జాఫ్రా మొక్కలు… అన్నాటో కుటుంబానికి చెందినవి. మన అవిసె గింజలదీ ఈ కుటుంబమే కానీ… జాఫ్రా దక్షిణ అమెరికా దేశాలైన మెక్సికో, బ్రెజిల్‌లో పుట్టిందని చెబుతారు. పదిహేనో శతాబ్దంలో స్పెయిన్‌, పోర్చుగీసు నావికుల ద్వారా ఇది మనదేశానికీ వచ్చింది. అప్పటి నుంచీ కేరళలోని మలబారు ప్రాంతంలోనూ, పశ్చిమబంగ, ఈశాన్య రాష్ట్రాలతోపాటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ఏజెన్సీల్లోనూ పండిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలోని సాలూరు, విశాఖ మన్యంలోని పాడేరు, తూర్పుగోదావరి ఏజెన్సీలోని రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాలూ, తెలంగాణ ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరుల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. ఒకప్పుడు పొలం గట్ల మీదా, ఇంటి వెనక పెరటి మొక్కలుగానూ పెంచుతుండేవారు. పండినవాటిని ఏజెన్సీ రైతులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కి అమ్మేవాళ్లు. రెండేళ్లకిందటిదాకా వీటికి కిలోకి పద్దెనిమిది రూపాయలే ఇస్తుండేవారు. కానీ అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఓ చిన్న నిర్ణయం ఇక్కడి రైతుల తలరాతల్ని మార్చేసింది.
**ఆ దేశంలో తయారుచేసే లేదా దిగుమతి చేసుకునే ఏ ఆహారపదార్థాల్లోనూ ఎటువంటి కృత్రిమ రంగుల్నీ వాడకూడదన్నదే ఆ నిర్ణయం!
**లాభాలకి కొదవలేదు…
అమెరికా, కృత్రిమ ఆహార రంగులపైన నిషేధం విధిస్తూనే జాఫ్రా మొక్కలతో చేసే రంగులకి మినహాయింపునిచ్చింది. దీన్ని సహజ రంగుగానే చూపించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార తయారీ సంస్థల దృష్టి ఈ గింజలపైన పడింది. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్‌ఐ) జాఫ్రా నుంచి రంగుని సులువుగా తీసే ప్రత్యేక సాంకేతికతని కనిపెట్టింది. దీన్ని ఉపయోగించుకుని మన దేశంలోని పలు సంస్థలు సహజ రంగుని తీసి విదేశాలకి విక్రయిస్తున్నాయి. మరోవైపు, సౌందర్య సాధనాల పరిశ్రమలోనూ మార్పులొచ్చాయి. ఇదివరకు లిప్‌స్టిక్‌లూ, స్నోల్లాంటివాటికి కృత్రిమ రసాయనాలతోపాటుగా జాఫ్రా గింజల్నుంచి తీసిన రంగుల్నీ వాడేవారు. ఇప్పుడు సహజ రంగులున్న లిప్‌స్టిక్‌ల పేరుతో పూర్తిగా జాఫ్రా రంగుల్నే ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి కారణంగా ఈ మొక్కలకి గిరాకీ పెరిగింది. ఒకప్పుడు జీసీసీ మాత్రమే వీటిని కొనుగోలు చేస్తే… ఇప్పుడు వ్యాపారులు నేరుగా ఏజెన్సీ ప్రాంతాలకి వచ్చి రైతుల నుంచి కొంటున్నారు. అలా బహిరంగ మార్కెట్‌లో వీటి ధర కిలోకి వందరూపాయల దాకా పలుకుతోంది. ఎక్కడ పద్దెనిమిది రూపాయలూ… ఎక్కడ వంద!
**ప్రస్తుతం ఈ లిప్‌స్టిక్‌ గింజల్ని దేశవ్యాప్తంగా ఏడాదికి 250 టన్నుల దాకా పండిస్తున్నట్టు ఓ అంచనా. వీటిలో సింహభాగం తెలుగు రాష్ట్రాలదే. ఇందులోనూ విశాఖ పాడేరు ఏజెన్సీ మొదటిస్థానంలో ఉంటే, తూర్పుగోదావరి మన్యానిది తర్వాతి స్థానం. ఈ రెండుచోట్లా కాఫీ తోటల్లో అంతరపంటగా వీటిని పండించేందుకు రెండేళ్లకిందట కొత్త కార్యక్రమం చేపట్టింది ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఎపీఎఫ్‌డీసీ). అలా మొదలైన వీటి సాగు… ఇప్పుడు రైతులు తమపొలాల్లోనే ప్రత్యేకంగా పండించే స్థాయికి వచ్చింది.
*&*నాటిన నాలుగో ఏడు నుంచి గింజలనిచ్చే మొక్క ఇది. ఇరవైఏళ్ల దాకా కాపు ఉంటుంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏడాదికి ఎకరాకి ఏడువందల కిలోల దాకా జాఫ్రా గింజల్ని తీయగలుగుతున్నారు రైతులు! అంటే, ఈ ఒక్కపంట నుంచే డెభ్భైవేల రూపాయలదాకా వస్తున్నాయి!ఆ రకంగా ఈ మొక్కలు పెదవుల్నే కాదు… గిరి రైతుల బతుకుల్నీ పండిస్తున్నాయిప్పుడు!