Business

SBI గృహ రుణాలపై 10పాయింట్ల తగ్గింపు-వాణిజ్యం

Business News - SBI Home Loans With 10Points Discount

* గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. రుణ మొత్తంపై సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

* వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 అప్డేట్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ గత ఏడాది జూలైలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 10తో విడుదల చేశారు. మార్చి 1నుంచి వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ దశల వారీగా రావడం ప్రారంభమైంది. ఈ అప్డేట్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్‌ఫేస్‌ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. యాంబియంట్ డిస్ప్లే ట్వీక్స్, మెరుగైన డార్క్ మోడ్, షెల్ఫ్ ఈ అప్డేట్ లో అందించారు.

* కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదో నెలా వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి మొత్తం రూ.1.13 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ వసూళ్లు 7 శాతం పెరిగాయని పేర్కొంది. జనవరి నెలతో (1.19 లక్షల కోట్లు) పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టడం గమనార్హం.

* దేశీయంగా అతిపెద్ద ఫెర్రో అలాయ్‌ తయారీ సంస్థ శ్యామ్‌ మెటాలిక్స్‌ ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది. తాజాగా మరోసారి ఐపీవోకు సంబంధించిన పత్రాలను పూర్తి చేసింది. ఈ ఇష్యూ విలువ రూ.1,107 కోట్లు ఉండొచ్చని అంచనా. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్లోకి వచ్చేందుకు 2018,2019ల్లో ప్రయత్నించింది. కానీ చివరి నిమషంలో తన ప్రయత్నాలను విరమించుకొంది. తాజాగా వస్తున్న ఈ ఇష్యూలో ప్రస్తుత షేర్‌ హోల్డర్స్‌కు చెందిన రూ.657 కోట్లు విలువైన వాటాలను కూడా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన శుభం క్యాపిటల్‌, శుభం బిల్డ్‌వెల్‌,కల్పతరూ హౌస్‌ఫిన్‌,డొరిటే ట్రాకోన్‌,టాప్‌లైట్‌ మెర్సింటైల్స్‌ వంటి సంస్థలు మొత్తం రూ.450 కోట్ల విలువైన వాటాలను విక్రయించనున్నారు. వీటిలో అర్హులైన ఉద్యోగులకు 3లక్షల వాటాలను కేటాయించాలని నిర్ణయించారు.

* ఫిబ్రవరిలో దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాలు స్వల్పంగా నెమ్మదించాయి. అయితే, కొవిడ్‌ తర్వాత డిమాండ్‌ పుంజుకుంటుండడంతో తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ నెలవారీ సర్వే వెల్లడించింది‌. ఇక జనవరిలో 57.7గా ఉన్న మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) గత నెల 57.5కు తగ్గింది. అయితే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.

* ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. ఆయా సంస్థల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. 2020, ఫిబ్రవరిలో ఈ సంస్థ 3,54,913 యూనిట్లను విక్రయించగా.. ఈసారి 3,75,017 యూనిట్లను అమ్మారు. అయితే దేశీయ విక్రయాల్లో మాత్రం రెండు శాతం క్షీణత కనిపించింది. 2020లో ఫిబ్రవరిలో భారత్‌లో 1,68,747 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ సంఖ్య గత నెలలో 1,64,811 యూనిట్లకు తగ్గింది. ఇక బజాజ్‌ ద్విచక్ర వాహన విక్రయాల్లో ఏడు శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో 3,10,222 యూనిట్లు అమ్ముడు కాగా, ఈసారి అవి 3,32,563 యూనిట్లను విక్రయించారు. ఇక వాణిజ్య వాహనాల అమ్మకాలు ఐదు శాతం తగ్గాయి. 2020 ఫిబ్రవరిలో 44,691 యూనిట్లను విక్రయించగా.. ఈ సారి ఆ సంఖ్య 42,454కు పరిమితమైంది. ఇక ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. గత ఏడాదిలో 1,86,166 యూనిట్లు ఎగమతి కాగా.. ఆ సంఖ్య ఈసారి 13 శాతం పెరిగి 2,10,206 యూనిట్లకు పరిమితమైంది.

* గత వారపు భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సంకేతాలతో పాటు దేశీయంగా సానుకూల జీడీపీ వృద్ధి రేటు, వాహన విక్రయాలు పుంజుకోవడం వంటివి మదుపర్లలో విశ్వాసం నింపాయి. దీనితో ఉదయం 49,747 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 50,058 వద్ద గరిష్ఠాన్ని.. 49,440 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,772 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. రోజులో 14,806-14,638 మధ్య కదలాడింది.