NRI-NRT

లండన్‌లో టీఆర్ఎస్‌ మహా ధర్నా

లండన్‌లో టీఆర్ఎస్‌ మహా ధర్నా

ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు పిలుపు మేరకు టీఆర్ఎస్‌ యూకే విభాగం లండ‌న్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ముందు మ‌హా ధర్నా నిర్వ‌హించింది. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం వెంటనే కొనుగోలు చేయాల‌ని, అదేవిధంగా వరి ధాన్యం సేకరణ విధి విధానాలను కేంద్రం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ దూసరి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా లండన్‌లో పోరాటం చేశామ‌ని, పోరాటాలు త‌మ‌కు కొత్త కాదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కూడా తాము నిర‌స‌న చేశామ‌ని చెప్పారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీకి వెళ్లి రైతుల గోసను వివరించారని, పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞ‌ప్తి చేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.

ఎన్నారై టీఆర్ఎస్‌ అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ‌లు రాశార‌న్నారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 2021-22 ఖ‌రీఫ్‌లో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని సీఎం త‌న లేఖ‌ల్లో కోరారని చెప్పారు. అయినా కేంద్రం స్పందించ‌డం లేద‌ని, పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నారై టీఆర్ఎస్‌ లండన్ ఇన్‌చార్జి నవీన్ భువనగిరి మాట్లాడుతూ.. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొందని, రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదని అన్నారు. ప్రతి ఏడాది ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెరుగ‌ట్లేదని పేర్కొన్నారు. ఈ విష‌యంలో సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం దేశ రైతుల విజయమన్నారు. సీఎం కేసీఆర్ రైతు మహా ధర్నా ద్వారా కేంద్రంలో మార్పు వచ్చింద‌ని తాము భావిస్తున్నామ‌ని చెప్పారు. అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తున్నామ‌ని, వారి పోరాట పటిమ గొప్పదని కొనియాడారు.

ఎన్నారై టీఆర్ఎస్‌ కోర్ కమిటీ సభ్యుడు రావుల పృథ్వి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా తాము వెంట న‌డుస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సీఎం ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టి రైతు రాజయ్యేలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. చివర‌గా భారత హై కమిషన్ ప్రతినిధికి ఎన్నారై టీఆర్ఎస్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇన్‌చార్జి నవీన్ భువనగిరి, కార్యదర్శి సత్య మూర్తి చిలుముల, కోర్ కమిటీ సభ్యుడు రావుల పృథ్వి, మధు, ఇత‌ర‌ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.