DailyDose

ముగిసిన మేడారం సందడి – TNI తాజా వార్తలు

ముగిసిన మేడారం సందడి – TNI   తాజా వార్తలు

*మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విజయవంతం చేసిన అధికారులను మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సత్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల‌తో మంత్రులు, ఉన్న‌తాధికారుల ద‌గ్గ‌రుండి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డంతో వ‌న‌దేవ‌త‌ల జాత‌ర స‌జావుగా జ‌రిగిందన్నారు. అధికారులు ముందు నుండి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని చెప్పారు. అమ్మవార్ల దయతో భక్తులు మొక్కులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని వెల్లడించారు. అందరి సహకారంతో జాతర విజయవంతం చేయగలిగామని, జాతర ఏర్పాట్లు, నిర్వ‌హ‌ణ‌ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు.

* ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్
ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ)గా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏపీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఏపీ భవన్ పీఆర్సీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు

* జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్ హల్ చల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో తన ఫొటో మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జూబ్లీహిల్స్ సీఐ పట్ల వీహెచ్ దురుసుగా ప్రవర్తించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్ నీ సంగతి చూస్తా అంటూ వీహెచ్ చిందులు వేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…. సోషల్ మీడియాలో తన వేషం మార్చి తాను జగ్గారెడ్డికి టీఆర్ఎస్ కండువాలు వేసి మధ్యలో కేసీఆర్ ఉన్నట్లు ఫొటో మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను జీవించి ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ కార్యకర్తలకు సేవ చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, సోషల్ మీడియాకు కూడా హద్దులు ఉండాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు

* జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులుభద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనిక సిబ్బంది అమరులయ్యారుఓ ఉగ్రవాది హతమయ్యాడు. జైనపొర ప్రాంతంలోని చెర్మార్గ్ గ్రామం వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరణించిన ఉగ్రవాదిని గుర్తించేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.

* కర్ణాటకలో హిజాబ్‌ వివాదం కొనసాగుతోంది. హిజాబ్‌ ఆందోళనలో పాల్గొన్న 58 మంది విద్యార్థులను శివమొగలోని కర్ణాటక పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్‌ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు.

*ఏపీ నూతన డీజీపీగా కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను తీసుకున్నారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. రెండు సంవత్సరాలకు పైగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ విధులు నిర్వహించారు.1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్, మెరైన్‌ పోలీస్‌ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

*ఆంధ్రా కావాలి.. ఒడిషా వద్దుని సరిహద్దు గ్రామాల ప్రజలు అంటున్నారు. ఒడిషాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోమారు సరిహద్దు సమస్య తెరపైకి వచ్చింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చించినా ఈ సమస్యకు తెరపడలేదు. విజయనగరం జిల్లాసాలూరుపాచిపెంట మండలాలకు ఆనుకుని ఉన్న ఆంధ్రాఒడిషా సరిహద్దు వివాదాస్పద గ్రామాలు మరోసారి నివురుగప్పిన నిప్పులా మారాయి. లేదు లేదుంటూనే ఒడిషా తన అధిపత్య పన్నాగాలకు పావులు కదుపుతోంది. బ్రిటిష్ కాలం నుంచి రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య కొనసాగుతోంది. ఇక్కడున్న కొటియా గ్రామాల్లో లక్షల కోట్లు విలువచేసే ఖనిజాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఈ గిరిజన గ్రామాలు మావంటే మావని ఆంధ్రాఒడిషా రాష్ట్రాలు అంటున్నాయి.

*హంద్రీనీవా నీటికోసం రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. బళ్లారి అనంతపురం జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. రైతులు ఆందోళన ఉధృతం చేయడంతో చిన్న ముష్టూరు హంద్రీనీవా కాలువ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హంద్రీ-నీవా కాలువకు నీటిని బంద్ చేయడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ మెయిన్‌ను ఇక నుంచి రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ ఏడాది (2022) నుంచి ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ను జరపాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కి హాజరయ్యేందుకు విద్యార్థులకు రెండు చాన్సులు మాత్రమే ఉంటాయి. గతేడాది కరోనా నేపథ్యంలో మెయిన్‌ పరీక్షను నాలుగుసార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విద్యార్థులకు నాలుగుసార్లు పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు.

*రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రెండు వారాల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు మహేందర్ రెడ్డి సెలవులో ఉంటారు. అప్పటి వరకూ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వచ్చేవరకు పూర్తి అదనపు బాధ్యతలను అంజనీకుమార్ చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.

*వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వక్ఫ్ బోర్డు పరిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడకు చెందిన అబ్దుల్ ఖాదర్ మహ్మద్ ఈ పిల్లో అభ్యర్ధించారు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం సభ్యుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నామినేషన్ విధానంలో పలువురు సభ్యులను నియమించారన్నారు. ముస్లిం ఎంపీ, ఎమ్మెల్యేలు బోర్డు సభ్యులుగా ఉండాలన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యులకు అర్హతలు లేవన్నారు. సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలని కోరారు.

* రాష్ట్రంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదనే ఉద్దేశంతోనే 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పెట్టుకున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖలోని విభాగాలైన ఎస్సీ కార్పొరేషన్, గురుకులాలు, లిడ్క్యాప్, జిల్లాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి అధికారులకు వివరించారు. అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

* ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రసాద్రెడ్డి వ్యవహారశైలిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వీసీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం మార్చి 3న ‘చలో యూనివర్సిటీ’ కార్యక్రమం నిర్వహించాలని ‘ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అప్రజాస్వామిక విధానాలు, నిరంకుశ పాలన’కు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.

* ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజె క్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్రెడ్డి ఢిల్లీ వచ్చి నిరాహారదీక్ష చేయాలి. సీఎం ఏపీలో కూర్చుంటే సరిపోదు. ఇచ్చిన మాట ప్రకారం పోలవరం సాధించలేకుంటే… మన పార్టీకి పుట్టగతులుండవు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

* పచ్చి మిర్చి ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్సేల్గానే కూరల్లో వాడే సన్న రకం కిలో రూ.80, బజ్జీలకు వాడే లావు కాయలు రూ.100 పలుకుతున్నాయి. రిటైల్గా పావు కిలో సన్నమిర్చి రూ.25 చెప్తున్నారు. రైతుబజార్లలో రూ.60-70 చొప్పున అమ్ముతున్నారు. తెగుళ్లతో మిర్చి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ వచ్చింది. మూడు నెలల కిందట కిలో రూ.40కి మించని పచ్చిమిర్చి ధర ఇప్పుడు రెట్టింపు అయింది

* పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం అగడలలంక గ్రామం కొల్లేరు సరస్సు పరిధిలో చేపల చెరువుల తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామం పరిధిలోని సర్వే నం.1424లో చేపల చెరువు తవ్వకాలతో పాటు ఇతర కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రతివాది రమణ ఫిషరీస్ ప్రైవేట్ లిమిటెడ్ను ఆదేశించింది.

* అజ్ఞాత నేర ప్రపంచ నేత దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్ను మనీ లాండరింగ్ కేసులో ఏడు రోజుల ఈడీ కస్టడీకి ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది. దీనికి ముందు, దావూద్పైన, ఆయన అనుచరులపైన నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి థానే జైలులో ఉన్న ఇక్బాల్ను ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది.