ScienceAndTech

PF కారణంగా దొరికిపోయిన విప్రో మూన్‌లైటర్లు

PF కారణంగా దొరికిపోయిన విప్రో మూన్‌లైటర్లు

ఐటీ కంపెనీల్లో ఇటీవల మూన్‌లైటింగ్‌ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. తమ కంపెనీలో విధులు నిర్వర్తిస్తూనే అదనపు ఆదాయం కోసం మరో కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ప్రముఖ ఐటీ సంస్థ విప్రో గుర్తించి వేటు వేసిన విషయం తెలిసిందే. 300 మంది ‘మూన్‌లైటర్ల’ను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. మరి ఇలాంటి ‘మోసానికి’ పాల్పడిన వారిని విప్రో ఎలా గుర్తించింది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీన్ని వివరిస్తూనే ఓ ట్విటర్‌ యూజర్‌ పెట్టిన సుదీర్ఘ ట్వీట్‌ వైరల్‌గా మారింది. మూన్‌లైటింగ్‌ వ్యవహారంపై రాజీవ్‌ మెహతా అనే స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఇంటి నుంచే పనిచేసే ఐటీ ఉద్యోగులు.. వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయం ఉన్న మరో కంపెనీలో ఏకకాలంలో పనిచేయడమే మూన్‌లైటింగ్‌. రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ఒకే వైఫై, ఇద్దరు క్లయింట్లు.. ఒకే పని.. రెట్టింపు డెలివరీ.. ఇదంతా సౌకర్యంగా తన ఇంటినుంచే. ఎలాంటి అనుమానం రాకుండా రెండు చోట్లా ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిని పట్టుకోవడం అసాధ్యమే. మరి వారిని ఎలా కనిపెట్టారు. దీని సుసాధ్యం చేసింది ఎవరో కాదు – భవిష్య నిధి సంస్థ. కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్‌ జమ చేయడం కేంద్రం తప్పనిసరి చేసింది. శాలరీ అకౌంటర్ల కోసం కంపెనీలు ఉద్యోగుల నుంచి ఆధార్‌, పాన్‌ నంబర్లు తీసుకుంటాయి. వాటినే పీఎఫ్‌ జమకూ ఉపయోగిస్తాయి. ప్రస్తుతమున్న వ్యవస్థల్లో మూన్‌లైటర్లకు ఆర్థికంగా, భౌతికంగా రెండు వేర్వేరు గుర్తింపులను సృష్టించుకోవడం అసాధ్యమే. ఇక, భవిష్యనిధి సంస్థ కూడా ఎప్పటికప్పుడు డీ-డుప్లికేషన్‌ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంటుంది. పొరబాటుగా ఎవరి ఖాతాలోనైనా ఎక్కువసార్లు పీఎఫ్‌ జమ అయిందో లేదో చెక్‌ చేస్తుంటుంది. ఇటీవల అలా చేసిన తనిఖీల్లో కొందరు వ్యక్తుల ఖాతాలు అనుమానాస్పదంగా కన్పించాయి. ఒకే ఖాతాల్లో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు జమ చేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని ఆయా కంపెనీలకు చేరవేసింది. డిజిటల్‌ ఇండియా పవర్‌ అంటే ఇదే. క్షేత్రస్థాయి నుంచే అవినీతిని నిర్మూలించడంలో డిజిటల్‌ ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది’’ అని రాజీవ్‌ వివరించారు.