Politics

వాళ్ళిద్దరూ కలిశారు… కలిసే ఉంటారు

వాళ్ళిద్దరూ కలిశారు… కలిసే ఉంటారు

జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కల్లం అజయ్ రెడ్డి లను సిబిఐ విచారించాలి

ఆస్తి కోసం కాదు…పొలిటికల్ గేయిన్ కోసమే వైఎస్ వివేక హత్య

ఈ హింసాత్మక, దరిద్రపు పాలన వదిలించాలని కంకణం కట్టుకున్న… వదిలించేస్తా

ప్రధాని మోడీని ముసలివాడని జగన్ అనగలరా?

హవ్వ… కుక్కలు మొరిగినట్టుగా హీరో రజినీకాంత్ పై విమర్శలా?

ఆ భూములు ఉన్నది డాక్టర్ సునీత పేరిట కాదు… క్వాంటం గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట

నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు శనివారం నాడు కలిశారని, ఇకపై కలిసే ఉంటారు. ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే, వాటిని పటా పంచలు చేసుకోండి. పదవులు కాదు, వారికి ప్రజలే ముఖ్యం. ప్రజలను కాపాడుకోవడానికి కలిశారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఈ కలయిక వల్ల నెల్లూరు జిల్లా నుంచి కోస్తా మీదుగా శ్రీకాకుళం వరకు తీర ప్రాంతమంతా తమ పార్టీ సముద్ర గర్భంలో కలిసి పోవాల్సిందేనని అన్నారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాయలసీమలో తమ పార్టీ గెలుస్తుందని కాదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మూలాలు బయటకు వస్తున్నాయి. ఇంకొంచెం బయటకు వస్తే, రాయలసీమలోనూ తమ పార్టీ పరిస్థితి అధ్వానం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ రాయలసీమలో పట్టిన గతే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టనుంది. శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ, విద్యావంతులు, అన్ని రాజకీయ పక్షాల కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు. బిజెపి సానుభూతిపరులు కూడా తమ ద్వితీయ ప్రాధాన్యత ఓటు టిడిపి అభ్యర్థులకు వేసి వారి గెలుపుకు చిరు దోహదం చేశారు. వై నాట్ 175 కాదు 1+7+5 కే తమ పార్టీ పరిమితం అవుతుంది. ప్రజలను ఇలాగే అరెస్ట్ చేసి హింసించి, చంపే ప్రయత్నం చేస్తే, ఆ 13 స్థానాలు కూడా దక్కవు. ఇకనైనా ప్రభుత్వ పెద్దల్లో మార్పు వస్తే ఫలితం ఉంటుందని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు.

మూడు చోట్ల చంద్రబాబు పై రాళ్ల దాడి… పవన్ కళ్యాణ్ ను హోటల్ నుంచి అడుగు బయట పెట్టనివ్వని పరిస్థితి

ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పై మూడు చోట్ల రాళ్లదాడికి తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెగబడ్డారు. జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కలిగిన చంద్రబాబుపై ఇటీవల యర్రగొండపాలెం లో జరిగిన రాళ్లదాడిలో, ఆయనకు రక్షణగా నిలబడిన సి ఆర్ పి ఎఫ్ కమాండెంట్ గాయపడ్డారు. ఆయన తలకు మూడు కుట్లు పడ్డాయి. గన్నవరం సి ఐ కి పడినట్లు కాదు. నిజమైన కుట్లు పడ్డాయి. విశాఖపట్నం పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ ను హోటల్ నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదు. జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి చితకబాదారు. యర్రగొండపాలెం లో రాళ్లదాడి ఘటన అనంతరం చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రజల కోసం ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకూడదని నిర్ణయించు కున్నారు. ప్రజల కోసం వాళ్ళిద్దరు నాయకులు కలిసి మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ తో పాటు, టిడిపి, జనసేన లోని కొందరు కోవర్టులు రకరకాలుగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండకూడదనే ప్రయత్నాలను చేస్తున్నారు. పార్టీలోనే ఉంటూ, తమ పదవుల కోసమో, లేదంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని … వారు ఈ ప్రయత్నాలను చేస్తున్నట్లుగా ఉంది . టిడిపి, జనసేన మధ్య పొత్తు ఉండకూడదని ఇంకా ఎవరైనా అతిగా మాట్లాడితే, ఆ పార్టీల నాయకత్వం సహించే పరిస్థితిలో లేదు. తాను పార్టీలో ఉంటూ చెబుతున్న విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నచ్చకపోతే, తనని పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. తాను మంచి మాటలే చెబుతున్నాను కాబట్టి తనని బహిష్కరించడం లేదు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకూడదని అన్ని పార్టీలు కలిసి రావాలని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కోరడం స్వాగతించా ల్సిందే. ఎందుకంటే ఎన్నికల్లో పోరాడేది బ్రహ్మ రాక్షసుడు ని మించిన రాక్షసుడితో ననే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలి. అధికార పార్టీలో నెల్లూరు జిల్లా మొదలైన తిరుగుబాటు అనంతపురం జిల్లాకు చేరింది. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం అసంతృప్తి గళం వినిపించారు. తమ పార్టీ నాయకుల్లో ఇప్పటికే మార్పు మొదలయింది. టిడిపి, జనసేన నాయకులు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇప్పటికే పలుమార్లు కలిశారు. ఇంకా, ఇంకా కలిసి పకడ్బందీ ప్రణాళికతో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజలను కాపాడేందుకు ముందుకు వెళ్లాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

నువ్వేమైనా సన్నీ లియోనీ నా, రష్మిక మందాన నా, లేకపోతే మహేష్ బాబు వా?

నువ్వే మా నమ్మకం జగనన్న అనే స్టిక్కర్ల కు కోటి 15 లక్షలమంది ముద్దులు పెట్టినట్లు సాక్షి దినపత్రికలో వార్తా కథనాన్ని ప్రచురించారు. మగవాళ్లు ముద్దు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సన్నీ లియోనీ నా, రష్మిక మందాన నా, లేకపోతే ఆడవాళ్లు ముద్దు పెట్టడానికి ఆయన సినిమా స్టార్ మహేష్ బాబా? అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు . ఇంటింటికి అతికించిన స్టిక్కర్లలో 90% స్టిక్కర్లను ప్రజలు పీకి వేశారన్నారు. వెంకటేశ్వర స్వామి భూములు అమ్మ వద్దు… మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించండి అని, ఇసుకను దోచుకోవద్దు, మాతృభాషను చంపవద్దు అని నాలుగు మంచి మాటలు చెప్పినందుకు తనపై రాజ ద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ఈ హింసాత్మక, దరిద్రపు పాలనను అంతమొందించాలని కంకణం కట్టుకున్నాను. రాష్ట్ర ప్రజలకు ఈ దరిద్రపు పాలన నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించే వరకు నిద్రపోయేది లేదు. నాకు వచ్చిన కష్టం, ఇతరుల ఎవరికి రావద్దు. శారీరకంగా, మానసికంగా ఎంత వేదనను అనుభవించానో అది నాకే తెలుసు. ఒక ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటి?. తనని లాకప్ లో చిత్రహింసలకు గురి చేసి, చంపాలని చూశారు. ప్రధాన ప్రతిపక్ష నేత పై రాళ్ల దాడి చేశారు. ఎంతో ప్రజాధరణ కలిగిన పవన్ కళ్యాణ్ ను హోటల్ గది నుండి బయటకు రాకుండా నిర్బంధించారు. తమ పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆ ఇద్దరు నాయకులు ఆలోచించరా?, అందుకే ప్రజల కోసం ఆ ఇద్దరు నాయకులు ఏకమయ్యారు. వారిద్దరి కలయికతో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయనే సంకేతాలు స్పష్టం అయ్యాయి. తెలుగుదేశం, జనసేన పార్టీతో, బిజెపి కలుస్తుందనేది తన అభిప్రాయం. టిడిపి, జనసేన ఒక్కటయ్యాయి. కావాలంటే, సాక్షి దినపత్రికలో ఇప్పుడు ముసుగు తొలగిందని
రాసుకోండి అంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.

నీలాగా రాక్షసత్వం లేదు… ఆయనలో మానవత్వం మాత్రమే ఉంది

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై
దక్షిణ భారత సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కోపం ఎందుకని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రజినీకాంత్ చెప్పినట్లుగా ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు విజనరీ. రజినీకాంత్ ను రాజకీయ నేతలైన మాజీ మంత్రులు, మంత్రులు విమర్శించడం వేరు, మంత్రి పదవిలో కొనసాగుతున్న సినీనటి రోజా విమర్శించడం సిగ్గుచేటు . ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టుగా, ఆకాశం పై ఉమ్మేసినట్టుగా రజినీకాంత్ పై తమ పార్టీ నాయకుల విమర్శలు ఉన్నాయి. తాము చేసే విమర్శలు చూసి జనం మొహాన కుమ్మేస్తారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా విమర్శలు చేయడం విడ్డూరం. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలలో గెలుస్తామని చెబుతున్న తమ పార్టీ నాయకులు రజినీకాంత్ పై పడి ఏడువడం ఎందుకు?. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే, తమ పార్టీ నాయకులు ఎందుకు విమర్శిస్తారు. సినిమా హీరోలలో మహానుభావులు అరుదు. అటువంటి వారి కోవలో రజినీకాంత్ ఒకరు. రజనీకాంత్ లాంటి మహానటుడు గురించి చులకనగా మాట్లాడడం సిగ్గుచేటు. తమ పార్టీ నాయకుడు రజినీకాంత్ కంటే గొప్పవాడా?. రజినీకాంత్ కు అనుభవము లేదని కొంతమంది చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రజినీకాంత్ కు మానవత్వం ఉంది. ఆయన లో లేనిది రాక్షసత్వం మాత్రమే నని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఆదిరెడ్డి అప్పారావు, వాసులను న్యాయవాదుల సమక్షంలో విచారించాలి

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆది రెడ్డి వాసులను ఏపీ సిఐడి పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియక, భయంతో ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ తరహా అరెస్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వైఎస్ వివేక హత్య కేసులో న్యాయవాదుల సమక్షంలో, ఇన్ కెమెరా లో వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని తన సాక్షి దినపత్రిక ద్వారా కోరిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే విధంగా ఆదిరెడ్డి అప్పారావు, వాసులను విచారించాలి. ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసేది కేవలం చిత్రహింసలు పెట్టడానికేనని, రాజమండ్రి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రఘు రామకృష్ణంరాజు సూచించారు.

మా ప్రస్తుత నాయకుడు చిన్నానను హత్య చేయించారని అందరూ అంటున్నారు… నిజ, నిజాలను తేల్చండి

తన చిన్నాన్నను తమ ప్రస్తుత పార్టీ నాయకుడు హత్య చేయించారని అందరూ అంటున్నారు. ఈ కేసులో నిజ, నిజాలను తేల్చండి. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే తెలిసిందని, అప్పటికి ఆయన పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ
ప్రధాన కార్యదర్శి కల్లం అజయ్ రెడ్డితో సమావేశంలో ఉన్నట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ రాశారు. అయినా, ఆ సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి యధావిధిగా కొనసాగించారు. ప్రతిపక్ష నేత హోదాలో అప్పటివరకు ప్రత్యేక విమానంలో తిరిగిన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి శవాన్ని సందర్శించడానికి మాత్రం హైదరాబాదు నుంచి పులివెందులకు వాహనంలో వెళ్లడం విస్మయాన్ని కలిగించింది. వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ముగిసిన మరుసటి దినము కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలోనే తిరిగారు. వైఎస్ వివేకానంద శవయాత్రను పులివెందులలో రద్దీగా ఉండే ప్రాంతాల నుంచి కాకుండా, షార్ట్ కట్ లో శవాన్ని ఖననం చేసే స్థలానికి తీసుకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన రోజు తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డితో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశం కాకపోతే, ఎంతో విశ్వసనీయత కలిగిన ఆంధ్రజ్యోతి దినపత్రిక పై పరువు నష్టం దావా వేయండి. కొన్ని వెర్షన్ల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెల్లవారుజాము మూడున్నర గంటలకి తెలుసునని సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఫోను చేసి సమాచారం అందించింది ఎవరు? ఆయనకు ఏమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డికి, భారతి రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నవీన్ కు వైఎస్ అవినాష్ రెడ్డి ,
ఫోన్ చేసి సమాచారం అందించాడని, వారిని పిలిచి సిబిఐ విచారించింది. 2020లో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ప్రస్తుతం జైల్లో ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి మూడున్నర గంటలకు వైఎస్ వివేక హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొనడం జరిగింది. తన ఫోన్లో వైఎస్ వివేక శవం ఫోటోలను తీసి ఆయన ఇతరులకు పంపారని వెల్లడించారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఆ ఫోటోలను ఎవరికి పంపారు. ఉదయ్ కుమార్ రెడ్డి ని మూడున్నర గంటలకు వైఎస్ వివేక హత్య జరిగిన ప్రదేశానికి పంపింది ఎవరు?. పని అయిపోయిందని తానే ఇతరులకు
ఫోటోలను పంపాడా?. లేకపోతే హత్యకు సూత్రధారులు ఆయన్ని చూసి రమ్మని పంపారా? అన్నది ప్రజల్లో అనుమానంగా ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రజల్లోని ఈ అనుమానాలు పార్టీకి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కల్లం అజయ్ రెడ్డి లు మీడియా ముందుకు వచ్చి అనుమానాలను నివృత్తి చేయాలని పార్టీలో కొనసాగుతున్న సభ్యుడి గా కోరుతున్నాను. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని, భారతి రెడ్డిని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ను కల్లం అజయ్ రెడ్డిని సిబిఐ విచారించాలి. నిజ,నిజాలను తెలుసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

చనిపోయిన వ్యక్తి నుంచి ఇతరుల పేరిట భూమి మార్పు సహజం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణ అనంతరం డాక్టర్ సునీత 90 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని కొంతమంది తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ భూమి క్వాంటం గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్నది. వైఎస్ వివేకానంద రెడ్డి తో పాటు డాక్టర్ సునీత డైరెక్టర్లుగా ఉన్నారు. వైఎస్ వివేక మరణ అనంతరం , ఆ భూమి సహజంగానే రూపాయి ఖర్చు లేకుండా కంపెనీ ప్రతినిధిగా డాక్టర్ సునీత పేరిట మారింది. దానికి కూడా కొంతమంది తప్పుడు ప్రచారాన్ని చేయడం విడ్డూరం. పేపరు ఉందని అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ఆస్తి కోసం కాదు… రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఎన్నికల్లో ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరిందో ప్రజలందరికీ తెలుసు. కుటుంబ పెద్దలతో ఒత్తిడి తెచ్చి మేనేజ్ చేయాలని చూశారు. కానీ డాక్టర్ సునీత ఒప్పుకున్నట్లు లేదు. దీనితో నోటికొచ్చినట్లు మాట్లాడి, కవ్వించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయినా ఆమె పోరాటం ఆపేలా కనిపించడం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం రక్తపు మరకలను తుడిచింది ఎవరు ఆయన వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి కూడా, ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం జగన్మోహన్ రెడ్డి చూడకుండానే కళ్ళకు కట్టినట్లుగా చాలా స్పష్టంగా చెప్పగలిగారు. తనని గతంలో లాకప్ లో సిఐడి పోలీసులు చిత్రహింసలు పెట్టిన వీడియో చూసి ఆనందించిన వారు, వైఎస్ వివేక హత్య సంఘటనను కూడా చూసి ఏమైనా ఆనందించారా?, లేకపోతే ఫోటోలను చూశారా?. చాలా చక్కగా చెప్పారు. కొందరికి అలాంటి ఆనందాలు ఉండొచ్చేమో నని రఘురామకృష్ణం రాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ముసలివాడని సంభోదిస్తున్న వారు, అదే వయసున్న ప్రధానమంత్రిని ముసలివాడని అనగలరా?, పెద్దవారిని గౌరవించడం మన సంస్కృతిలో భాగం. ముసలివాడని ఎదుటివారిని సంబోధించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లవాడేమి కాదు. ఆయనకు 50 ఏళ్లు ఉన్నాయని గ్రహించాలని రఘు రామకృష్ణంరాజు సూచించారు..