ScienceAndTech

టెలిగ్రామ్ “స్టోరీ” కొత్త ఫీచర్

టెలిగ్రామ్ “స్టోరీ”  కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram).. వాట్సాప్(WhatsApp)కు పోటీగా అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో వాట్సాప్‌లో లేని ఛానెల్స్, సీక్రెట్ చాట్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంతో కీలకమైన స్టేటస్ ఫీచర్ మాత్రం టెలిగ్రామ్ ఇప్పటివరకు పరిచయం చేయలేదు. దీనిని పరిచయం చేయాలంటూ చాలా రోజులుగా యూజర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌లో ‘స్టోరీస్’ (Stories) ఫీచర్‌ను పరిచయం చేస్తున్నామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) మంగళవారం తెలిపారు. ఇది జులై మొదటి వారంలో యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

టెలిగ్రామ్ యూజర్లు చాలా కాలంగా స్టోరీస్ ఫీచర్ తీసుకురావాలని అభ్యర్థిస్తున్నారని, ప్లాట్‌ఫామ్ రిసీవ్ చేసుకున్న ఫీచర్ రిక్వెస్టులలో సగానికి పైగా స్టోరీస్ గురించినవే ఉన్నాయని దురోవ్ ఒక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పేర్కొన్నారు. ఈ ఫీచర్ అన్ని యాప్స్ తీసుకొచ్చాయి కాబట్టి దీన్ని టెలిగ్రామ్‌లో పరిచయం చేయకూడదని తాము ముందుగా అనుకున్నట్లు తెలిపారు. అయితే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పేర్కొన్నారు.

* ప్రైవసీ ఆప్షన్స్

టెలిగ్రామ్ యూజర్లు స్టోరీస్ షేర్ చేసేటప్పుడు వాటిని ఎవరెవరు చూడాలనేది నిర్ణయించవచ్చు. ఇందుకు వీలుగా స్టోరీస్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఎవ్రీవన్, ఓన్లీ యువర్ కాంటాక్ట్స్ (విత్ ఎక్స్‌సెప్షన్స్‌ ), ఫ్యూ సెలెక్టెడ్ కాంటాక్ట్స్, క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌ అనే నాలుగు ఆప్షన్స్ టెలిగ్రామ్ అందిస్తోంది. వీటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యూజర్లు తమ స్టోరీస్ నచ్చినవారికే చూపించవచ్చు. అంతేకాకుండా ఇతర కాంటాక్ట్స్ షేర్ చేసే స్టోరీస్‌ను తమకు కనిపించకుండా వారు హైడ్‌ చేసుకోవచ్చు. ఫలానా కాంటాక్ట్ నుంచి స్టోరీస్ చూడకూడదనుకుంటే ఆ స్టోరీస్ అన్ని హిడెన్ ట్యాబ్‌కి మూవ్‌ చేయవచ్చు.

స్టోరీస్‌లో ఎడిటింగ్ టూల్స్…ఫొటో, వీడియో-ఎడిటింగ్ టూల్స్‌తో యూజర్లు తమ స్టోరీస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. కాంటెక్స్ట్‌కి తగిన విధంగా క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. లింక్స్ స్టోరీస్‌లో పోస్ట్ చేయవచ్చు. ఇతరులను ట్యాగ్ కూడా చేయవచ్చు. అలానే, ఫ్రంట్ & రియర్ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసిన ఫొటోలు, వీడియోలను ఏకకాలంలో స్టోరీస్‌లో పోస్ట్ చేసుకోవచ్చు.

స్టోరీస్‌కి వివిధ టైమ్ లిమిట్స్…సాధారణంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో స్టోరీస్‌ అప్‌లోడ్ చేస్తే అవి 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతాయి. అయితే టెలిగ్రామ్ తన యాప్‌లో స్టోరీస్‌ను 6 గంటలు, 12, 24, 48 గంటలు లేదా పర్మినెంట్‌గా ప్రదర్శించగల సామర్థ్యాలను ఆఫర్ చేస్తుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ టైమ్‌ లిమిట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యూజర్లు తమ ప్రొఫైల్ పేజీలో స్టోరీస్ తమకు నచ్చినంత కాలం డిస్‌ప్లే చెయ్యవచ్చు.