Sports

భారత్, వెస్టిండీస్ మధ్య నేడు 100వ టెస్టు

భారత్, వెస్టిండీస్ మధ్య నేడు 100వ టెస్టు

ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ గురువారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మరో విజయంతో క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా చూస్తుండగా.. సొంతగడ్డపై కాస్త మెరుగైన ప్రదర్శనతో పరువు కాపాడుకోవాలని విండీస్‌ భావిస్తోంది.వెస్టిండీస్‌, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్. మరి ఈ ప్రత్యేక మ్యాచ్‌లో అయినా కరీబియన్‌ జట్టు రోహిత్‌ సేనకు పోటీ ఇస్తుందా?.. సిరీస్‌లో వైట్‌వాష్‌ను తప్పించుకుంటుందా? చూడాలి. అయితే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ విజయాన్ని అడ్డుకోవడం విండీస్‌కు కష్టమే. కాకపోతే ఏమేర పోటీ ఇస్తుందన్నదే ఇక్కడ విషయం. భారత్‌తో వందో టెస్టు ఆడనున్న మూడో జట్టు విండీస్‌. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇప్పటికే ఆ మైలురాయిని అందుకున్నాయి.

భారత్ ఒక జట్టుతో 100వ టెస్టు ఆడుతోందంటే రెండు జట్ల మధ్య పోరాటానికి ఎంతో ప్రత్యేకత ఉండాలి. ప్రత్యర్థి జట్టుకీ ఘన చరిత్ర ఉండాలి. ఒకప్పుడు వెస్టిండీస్‌, భారత్‌ మ్యాచ్ అంటే హోరాహోరీగా ఉండేది. దిగ్గజాలు ఉండడంతో ఒకానొక దశలో వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థికి చమటలు పట్టేవి. కానీ గత రెండు మూడు దశాబ్దాల్లో విండీస్‌ క్రికెట్‌ ప్రమాణాలు పాతాళానికి చేరాయి. ఇప్పుడు ఆ జట్టుకు పరాజయాలే ఎక్కువ. అటువంటి జట్టుతో ఈ మైలురాయి మ్యాచ్‌ ఆడాల్సి రావడం అభిమానులకూ నిరాశ కలిగించేదే. రెండు జట్ల మధ్య ఎంతో అంతరం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌కు ఉన్న విశిష్టత దృష్ట్యా ఫాన్స్ ఓ కన్నేస్తారని భావిస్తున్నారు. ఏకపక్షంగా సాగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన భారత్.. రెండో టెస్టుని ఎన్ని రోజులు ఆడుతుందో చూడాలి.

తుది జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, ఇషాన్‌ కిషన్‌, ఆర్ జడేజా, ఆర్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్‌, మొహ్మద్ సిరాజ్‌.

వెస్టిండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్, అథనేజ్‌, జర్మన్ బ్లాక్‌వుడ్‌, కిర్క్‌ మెకంజీ, జాసన్ హోల్డర్‌, జాషువా ద సిల్వా, రఖీమ్‌ కార్న్‌వాల్‌, అల్జారి జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌, గాబ్రియల్‌.