Politics

కేసీఆర్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం: బండి సంజయ్

కేసీఆర్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం: బండి సంజయ్

చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళంలో పాల్గొనేందుకు విచ్చేసిన బండి సంజయ్ కు స్థానిక కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ ఎత్తున హాజరైన కార్యకర్తలకు ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అభివాదం చేస్తూ సమావేశానికి విచ్చేశారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు హాజరైన ఈ సమ్మేళనంలో వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు…ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ కేన్సర్ లాంటోడు… మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు అని విమర్శించాడు. మూడోసారి వస్తే ఇక అంతే.. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో.. కేసీఆర్ సీఎం అయితే అంతకంటే డేంజర్.. ప్రజలారా ఆలోచించండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ దంతా పెగ్గుల బాగోతమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే దండు పాళ్యం ముఠా గుర్తుకొస్తుందన్నారు.. అధికారమిస్తే నట్టేట ముంచిన బీఆర్ఎస్ కావాలా? ప్రజల పక్షాన నిత్యం ఉద్యమాలు చేస్తూ జైలుకు వెళ్లేందుకు వెనుకాడని బీజేపీ కావాలా? మీరే తేల్చుకోవాలని ఆయన కోరారు.

అయితే, కేసీఆర్ ప్రకటించిన జాబితాలోని వీళ్లందరినీ ఎలక్షన్ల దాకా తన పక్కనే పెట్టుకుంటాడు.. చివర్లో ఇందులో సగం మందికి టిక్కెట్లు ఇయ్యడు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ లోనే 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు కేసీఆరే పంపిండు.. గెలవగానే వాళ్లు బీఆర్ఎస్ లోకి జంప్ అవుతారు.. గెలిచినా పార్టీ మారనోళ్లు బీజేపీ వాళ్లు మాత్రమే అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలే అధికారంలోకి వచ్చాయి.. కాబట్టి తొలుత కాషాయ జెండా ఎగరేసే సీటు చేవెళ్లనే అని సంజయ్ అన్నారు.

కేసీఆర్ దళితులకు చేసిందేమిటి?.. ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మాట తప్పాడు.. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పిండు.. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం, కేసీఆర్ కుటుంబానికి 30 శాతం వెరసి కారు.. సారు.. 60 శాతం సర్కార్ గా మారింది అని బండి సంజయ్ ఆరోపించారు. బీసీలంతా బీజేపీ మా పార్టీ అని భావిస్తున్నారు కాబట్టే.. ఎమ్మెల్యే టిక్కెట్లలో కేసీఆర్ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిండు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. బీసీలారా ఆలోచించండి.. 52 శాతం బీసీలున్న రాష్ట్రంలో 22 సీట్లు మాత్రమే ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా? బీసీనే ఏకంగా ప్రధాన మంత్రిని చేయడంతో పాటు ఏకంగా 27 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా బీజేపీ కావాలా? అని బండి సంజయ్ అడిగారు.