Business

నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 76 పాయింట్ల లాభంతో 65,164 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 13 పాయింట్లు లాభపడి 19,361 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.68 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో జియోఫిన్‌, హిందాల్కో, మారుతీ, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, సిప్లా, బీపీసీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా స్టాక్‌ మార్కెట్లు (Stock Market) వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర స్వల్పంగా పెరిగి 85.70 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) బుధవారం రూ.494.68 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ మదుపర్లు (DII) రూ.1,323.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

పశ్చిమాసియాలోని విమానాశ్రయాలను నిర్వహించే బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నామని జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్‌ జీఎం రావు వెల్లడించారు. దీనిపై సంప్రదింపులు సాగిస్తున్నామని తెలిపారు. చత్తీస్‌గఢ్‌లోని లారాలో 2X800 మెగావాట్‌ సూపర్‌క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు స్టేజ్‌-2 నిర్మాణానికి ఎన్‌టీపీసీ నుంచి ఆర్డరు లభించినట్లు భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (BHEL) వెల్లడించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎంటార్‌ టెక్నాలజీస్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ‘డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ లైసెన్స్‌’ లభించింది. దీంతో రక్షణ రంగానికి అవసరమైన మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ సబ్‌సిస్టమ్స్‌ను ఉత్పత్తి చేసే వీలు ఎంటార్‌ టెక్‌కు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.