DailyDose

ఇస్రో శాస్త్రవేత్త పై యువకుడు దాడి-TNI నేటి నేర వార్తలు

ఇస్రో శాస్త్రవేత్త పై యువకుడు దాడి-TNI నేటి నేర వార్తలు

ఇస్రో శాస్త్రవేత్త పై యువకుడు దాడి

బెంగళూరులో కారులో ఆఫీసుకు వెళుతున్న ఇస్రో సైంటిస్టుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. స్కూటీపై కారును అడ్డగించి, కారు టైర్లను తంతూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇస్రో సైంటిస్టు ఆశిశ్ లంబా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వివరాలు వెల్లడించారు.మంగళవారం ఉదయం ఎప్పటిలాగే ఆఫీసుకు వెళుతుండగా స్కూటీపై ఓ యువకుడు రెక్ లెస్ గా ప్రయాణిస్తూ తన కారును అడ్డగించాడని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కారును తన్నుతూ దాడికి యత్నించాడని ఆరోపించారు. కారులో తనతో పాటు తన కొలీగ్స్ కూడా ఉన్నారని చెప్పారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. సైంటిస్టుపై దాడికి ప్రయత్నించిన యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా సదరు యువకుడిని గుర్తించే చర్యలు చేపట్టామని వివరించారు. వివరాలు అందించాలంటూ సైంటిస్టు ఆశిశ్ లంబాను రిక్వెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

ప్లాట్‌లో భారీగా డ్రగ్స్ లభ్యం

పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా డ్రగ్స్ ముఠాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కేవలం డ్రగ్స్ వాడకమే కాకుండా ఏకంగా నగరం నడిబొడ్డున రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. గత అర్థరాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ రావు నగర్ ప్రెష్ లీవింగ్ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 804లో రేవ్ పార్టీ జరుగుతుంది. అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అపార్ట్మెంట్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ప్రముఖ సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ముగ్గురు పట్టుబడ్డట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో మరికొంతమంది యువతులు కూడా పాల్గొన్నారని, అయితే పోలీసు దాడులకంటే ముందు వారు అక్కడి నుండి వెళ్లిపోయారని సమాచారం. అయితే ఈ పార్టీని ఎవరు నిర్వహించారు, డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు అనేదానిపై పోలీసు విచారణ కొనసాగుతుంది.

విశాఖలో టీనేజర్ రీతీసాహా మృతి కేసులో మరో ట్విస్ట్

విశాఖపట్నంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితిసాహ కేసు సంచలనం రేపుతుంది. జూలై 14 వ తేదీన భవనం పై నుండి కిందపడి రితీసాహ మృతి చెందింది. అయితే వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో తాజాగా కొత్తట్విస్ట్ తెరపైకి వచ్చింది. విద్యార్థిని రితి సాహ ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడింది. హాస్టల్ బిల్డింగ్ నుంచి కింద పడిన తరువాత బాలికను ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. దీంతో బాలిక తల్లదండ్రుల ఆరోపణలకు రోజు రోజుకి బలం పెరుగుతోంది.బాలిక మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. బాలిక ఒంటి పై బలమైన గాయాలు కనిపించలేదు. సీసీ ఫుటేజ్ లో టైమింగ్ మొదటినుండి మిస్టరీగా మారింది. ఇప్పుడు రీతు ఒంటిపై బలమైన గాయాలు లేక పోవడం, మృతికి దారి తీసిన కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో యాజమాన్యంకి ఏం చెప్పిందో అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. విశాఖలో ఇప్పటికే వెస్ట్ బెంగాల్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

*  ప్రేమిస్తున్నానని చెబుతూ బాలికపై వాలంటీర్ రేప్

ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న గ్రామ వాలంటీరును అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఓ కానిస్టేబుల్‌ అన్యాయంగా జైలుపాలు కావడం గమనార్హం. గుత్తి మండలానికి చెందిన రమేష్‌ అనంతపురం టూటౌన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సైతం ప్రభుత్వ ఉద్యోగిని. వీరు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి తమ గ్రామానికి చెందిన ఒక బాలికను రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు. జులై 5న ఆ బాలిక కానిస్టేబుల్‌ తనపై కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని, ఒకసారి గర్భస్రావం చేయించాడని టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు కానిస్టేబుల్‌ రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలిని మెజిస్ట్రేట్‌ ముందుకు తీసుకువెళ్లగా.. ఆమె అసలు నిందితుడైన రాజశేఖర్‌ పేరు బయటపెట్టినట్లు తెలిసింది. బాధితురాలు ఉంటున్న కానిస్టేబుల్‌ ఇంటికి సమీపంలోనే నివాసముండే నిందితుడు గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేనపుడు చొరబడి ప్రేమిస్తున్నానంటూ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఆమె గర్భం దాల్చింది. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియడంతో గట్టిగా నిలదీశారు. దీంతో నెపం కానిస్టేబుల్‌పై నెట్టేసింది.బాధితురాలి స్వగ్రామంలో జరిగిన చిన్న గొడవ విషయంలో ఒక సామాజికవర్గానికి కానిస్టేబుల్‌ రమేశ్‌ అండగా నిలబడ్డారని ఆ గ్రామానికి చెందిన పలువురు ఆయనపై ద్వేషం పెంచుకున్నారు. అదేసమయంలో బాలికపై అత్యాచారం వెలుగుచూడడంతో వారు ఆమె కుటుంబ సభ్యులను బెదిరించి కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయించినట్లు తెలుస్తోంది. కానీ మేజిస్ట్రేటు వద్ద వాంగ్మూలంలో అసలు నిందితుడు గ్రామ వాలంటీరు రాజశేఖర్‌ అని బయటపెట్టడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. లోతైన విచారణ చేపట్టకుండా మొదట నిరపరాధి అయిన కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు పంపగా.. సుమారు యాభై రోజులకు పైగా అతడు జైలులో మగ్గిపోతుండడం గమనార్హం.

రాఖీ పండుగ పూట విషాదం

రాఖీ పండుగను పురస్కరించుకొని సోదరుడు చెల్లి‌తో రాఖి కట్టించుకొని భార్యను బైక్ పై తిరుగు ప్రయాణంలో ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపట్లోనే అనంత లోకాలకు వెళ్ళింది పండుగ పూటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ సమీపంలో నీలిమ దాబాకు ఎదురుగా నాలుగు వరుసల జాతీయ రహదారిపై గురువారం జరిగిన బైక్ ను కారు ఢీ కొట్టిన సంఘటలో మహిళ మృతి చెందింది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన లింగన్న గత కొన్ని రోజులుగా ఉపాధి కోసం నిర్మల్ వెళ్లి ఉంటున్నారు. రాఖీ పండుగ సందర్భంగా కనుగుట్ట గ్రామంలో లింగన్న చెల్లి దగ్గరకు భార్య నర్సవ్వ 40 తో పాటు తమ్ముడు కళ్యాణ్ తో కలిసి బైక్ వచ్చారు.రాఖీ కట్టించుకొని ముగ్గురు కల్సి ఒకటే బైక్ పై నిర్మల్‌కు వెళ్తున్న క్రమంలో నేరడిగొండ పెట్రోల్ పంపు ముందర కారు వేగంగా బైక్ ను ఢీ కొట్టింది. దీంతో నర్సవ్వ లింగన్న కళ్యాణ్ ముగ్గురు బైక్ పై నుంచి కింద పడ్డాడు. నర్సవ్వ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. అన్నదమ్ములకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సాయన్న సిబ్బంది క్షతగాత్రులను ఎన్‌హెచ్ఐ అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే నర్సవ్వ మృతదేహాన్ని విచారణ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన చూసిన జనం పండుగ రోజు విషాదం జరగడాన్ని జీర్ణించుకోలేక పోయారు.

గడువు ముగిసిన పదార్థాలతో ఐస్క్రీమ్ల తయారీ

మీకు బాగా ఐస్ క్రీమ్ లు తినే అలవాటు ఉందా..? అయితే జాగ్రత్త.. ! గడువు ముగిసిన పదార్థాలతో తయారు చేసిన కుల్ఫీ, ఫలుడా వంటి ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తిన్నారంటే అంతే సంగతి..! హెల్త్ బాగోలేక ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిందే..! ఇది సూచన మాత్రమే. హెచ్చరిక మాత్రం కాదండోయ్.. చాలాచోట్ల కల్తీ వస్తువులు, నాణ్యత లేని పదార్థాలతో ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ ఉప్పల్ లో బయటపడింది.ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ ప్రాంతంలో గడువు ముగిసిన పదార్థాలతో కుల్ఫీ, ఫలుడా వంటి ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్న గోదాంపై SOT పోలీసులు  దాడులు నిర్వహించారు. పోలీసుల విచారణలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు తెలిశాయి. ఈ కేసులో సుశీల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గడువు ముగిసిన పదార్థాలతో తయారు చేసిన కుల్ఫీ, ఫలుడా ఐస్ క్రీములను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.

తిరువూరు వైసిపిలో మరోసారి విభేదాలు

తిరువూరు వైసిపిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. తిరువూరు పురపాలక సంఘం సమావేశానికి అధికార పార్టీకి చెందిన 17 మంది వైకాపా సభ్యులకు 16 మంది గైర్హాజరు అయ్యారు. మున్సిపల్ ఛైర్మన్ పర్సన్ గత్తం కస్తూరిభాయి ఏకాకి అయ్యారు. టిడిపికి చెందిన ముగ్గురు సభ్యులు హాజరయ్యారు.కోరం పూర్తి కాకపోవడంతో సమావేశం వాయిదా వేశారు ఛైర్పర్సన్. మున్సిపల్ ఛైర్మన్ పదవి రెండేళ్ల ఒప్పందం అమలు చేయాలని ఇటీవల ఛైర్పర్సన్ పై తిరుగుబావుటా ఎగురవేశారు అసమ్మతి వర్గం సభ్యులు. దీంతో అధికార పార్టీ సభ్యుల తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెదేపా సభ్యులు. తిరువూరు పట్టణంలో అభివృద్ధి విస్మరించి అధికార పార్టీ సభ్యులు కుర్చీ కోసమే కొట్లాడుకుంటున్నారని మండిపడ్డారు తెదేపా సభ్యులు.

భార్య సోదరుడిగా భావించే యువకుడిని హత్య చేసిన భర్త

ఓ ఆటో డ్రైవర్ తన భార్య సోదరుడిగా భావించే 17 ఏళ్ల యువకుడిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చోటుచేసుకుంది. వివరాలు.. నిందితుడు షఫీక్ అహ్మద్ షేక్ చెంబూర్‌లోని ఆర్‌సీఎఫ్ ప్రాంత పరిధిలోని ఎంహెచ్ఏడీఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బాధితుడు ఈశ్వర్ అవద్‌కు షేక్ భార్య కుటుంబానికి చాలా కాలంగా తెలుసు. షేక్ భార్య, ఆమె సోదరి.. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఈశ్వర్ అవద్‌ను వారి సోదరుడిలా చూసుకున్నారని అతను చెప్పాడు.షేక్ తరచుగా ఈశ్వర్ అవద్ తన భార్య, ఆమె సోదరి గురించి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. అయితే ఈశ్వర్ అవద్ అలా చేయడం మానకపోవడంతో కోపంతో రగిలిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఈశ్వర్ అవద్‌ను తన నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు తీసుకెళ్లిన షేక్‌.. అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అయితే ఈశ్వర్ కనిపించకుండా పోవడంతో.. షేక్ మామ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈశ్వర్ చివరిగా షేక్‌తో కనిపించినట్టుగా గుర్తించారు. దీంతో షేక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో.. ఈశ్వర్‌ను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షేక్ నివాసంలోని వంట గది నుంచి ఈశ్వర్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఈశ్వర్‌ను కొడవలితో చంపిన తర్వాత, షేక్ అతని తలపై సుత్తితో కొట్టాడని పోలీసులు తెలిపారు. తాము కొడవలి, సుత్తిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. షేక్‌పై భారత శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

జ‌మ్మూకాశ్మీర్ లో ఘోర అగ్ని ప్ర‌మాదం

జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాంబన్ జిల్లాలో బుధవారం తాత్కాలిక గుడిసెల్లో మంటలు చెలరేగడంతో ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు సజీవదహనమయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. వివ‌రాల్లోకెళ్తే..  జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పోగల్ పరిస్తాన్ ఎగువ ప్రాంతంలోని హమ్మర్ గలీలో జరిగిన ఈ ఘటనలో మహిళ భర్త, అత్తకు గాయాలయ్యాయి.గుడిసెలు గుజ్జర్ సామాజిక వర్గానికి చెందినవనీ, ప్రాథమిక సమాచారం ప్రకారం నజ్మా బేగం (25), ఆమె కుమార్తెలు అస్మా బానో (6), ఇక్రా బానో (2) మంటల్లో మరణించారని అధికారులు తెలిపారు. నజ్మా భర్త ఇబ్రహీం, అత్త మీర్జాబేగంకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉఖేరాల్ లోని ప్రజారోగ్య కేంద్రంలో చేర్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో బుధవారం మంటలు చెలరేగడంతో ఒక నివాస గృహం కూడా దెబ్బతిన్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మీర్జా బాగ్ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెండు దుకాణాలు ఉన్న ఇల్లు దెబ్బతిన్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో బిలాల్ అహ్మద్ అనే కౌలుదారు కూడా గాయపడ్డాడని తెలిపారు. “అద్దెదారు పత్తి నుండి వస్తువులను తయారు చేసే అద్దె వసతి గృహంలో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి” అని అతను చెప్పాడు.

ఇన్‌స్టా గోల్డెన్ బాయ్‌కు వేధింపులు

రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని ఒంటి నిండా బంగారం ధరించాడు. రకరకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. అంతే అనుకున్నట్లుగానే ఒక్క సారిగా అతని పేరు అంతటా మారుమ్రోగిపోయింది. ఐతే ఊహించని విధంగా ఈ రీల్ స్టార్ వద్ద ఓ దొంగ 18 తులాల బంగారు గొలుసు, 2 లక్షల రూపాయలు దోచుకెళ్లాడు. ఈ విషయం బయట చెబితే నువ్వు నా పాట్నర్ వని సోషల్ మీడియాలో అందరికీ చెప్పి నీ పరువు తీస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచిత్ర ఘటన పూణెలోని కల్భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉరులి కంచన్‌లోని షింద్‌వానేలో చోటుచేసుకుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన రీల్స్ స్టార్ ధర్మేంద్ర అలియాస్ మోను బాలాసాహెబ్ బడేకర్ (30) రీల్స్ స్టార్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. ఇతని వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. నిందితుడు మహేష్ అలియాస్ మల్లప్ప సాహెబ్ హోస్మాని అతడికి పరిచయస్తుడు. కొద్ది రోజుల క్రితం ధర్మేంద్ర వద్ద18 తులాల బంగారు గొలుసు తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ధర్మేంద్ర తన బంగారు గొలుసును తిరిగి అడిగాడు. కానీ నిందితుడు గొలుసును తిరిగి ఇవ్వడానికి బదులుగా, అతని నుంచి మూడు లక్షల నగదు డిమాండ్ చేశాడు. పైగా ధర్మేంద్రను దుర్భాషలాడాడు.‘నేను కరడుగట్టిన దొంగనని, నేను దొంగిలించిన బంగారమంతా నీ దగ్గరకు తీసుకువస్తున్నట్లు పోలీసులకు చెబుతాను. నువ్వు పెద్ద రీల్ స్టార్వికదా.. ఇప్పుడు నీ పరువు ఎలా తీస్తానో చూడు. నువ్వే నాకు మూడు లక్షల రూపాయలు ఇవ్వు. లేకపోతే నీ పరువు తీస్తా. నేను దొంగతనం చేసిన బంగారం నీకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చెప్పి, నీ పరువు తీస్తా. అప్పుడు నువ్వు గోల్డెన్ బాయ్‌వి ఎలా అయ్యావో నీ ఫాలోవర్స్ తెలుస్తుందంటూ ధర్మేంద్రను బెదిరించసాగాడు నిందితుడు. దీంతో బెంబేలెత్తిపోయిన ధర్మేంద్ర నిందితుడికి రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. అయితే నిందితుడు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై లోని కల్భోర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.