Health

గ్రామాలను పీడిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి. పెరిగిన ఊబకాయం.

గ్రామాలను పీడిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి. పెరిగిన ఊబకాయం.

ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కృతి పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయి ఊబకాయం, మధుమేహం రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లపై ఇక్రిశాట్‌ అధ్యయనం చేసింది.ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కార్బొహైడ్రేట్ల వినియోగం పెరిగి, పోషకాహారం తీసుకోవడం తగ్గిందని తెలిపింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రొటీన్‌ రిచ్‌ ఫుడ్‌కు ప్రాధాన్యమిస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దేశంలోని అన్ని గ్రామాలను శాంపిల్‌గా తీసుకొని కార్బొహైడ్రేట్లు, షుగర్‌, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాల వినియోగంపై అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో వారు ఆహారంలో పోషకాహార సమతుల్యత లోపించడానికి గల కారణాలను గుర్తించారు. శరీరానికి అందించాల్సిన పోషకాలపై అవగాహన లేకపోవడంతోపాటు, ప్రోటీన్లు, మినరల్స్‌ అధికంగా ఉండే ఆహారం ఖరీదైనది కావడంతో కేవలం అధిక చక్కెర, పిండిపదార్థాలు ఉండే సాధారణ బియ్యంతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఖరీదైన పండ్ల కంటే పండ్ల రసాలు, ప్యాకేజ్డ్‌ షుగర్‌ ఫుడ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. జొన్నల కంటే బియ్యం తక్కువ ధరలో ఉండటంతో అన్నం ఎక్కువగా తింటున్నట్టు పేర్కొన్నారు. ఒకప్పుడు స్థానికంగా సమృద్ధిగా ఉండే వృక్ష సంపద తరిగిపోయిందని, దీంతో సహజంగా దొరికే ఎన్నో రకాల పండ్లు, ఆకులు, దుంపలను కోల్పోయామని, పలు గ్రామల ప్రజలు వెల్లడించినట్టుగా ఇక్రిశాట్‌ తన నివేదికలో పేర్కొంది.