భారాసలోనే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకున్నా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘‘12 ఏళ్లుగా భారాస అభివృద్ధికి కృషి చేశాను. ఓ ఎమ్మెల్సీతోపాటు పార్టీ అభ్యర్థినని చెప్పుకొంటున్న మరో వ్యక్తి కలిసి రెండేళ్లుగా ఖానాపూర్ అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకున్నారు. రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తే అడ్డుపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గంలో అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ రోడ్లు వేశారు. నా నియోజకవర్గంలో వేయమంటే మాత్రం కారణాలు చెప్పారు. ఆరు నెలల క్రితం వచ్చిన వ్యక్తి కోసం అభివృద్ధి పనులకు ఇప్పుడు నిధులిస్తున్నారు’’ అని రేఖానాయక్ విమర్శలు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఇతర నాయకులతో సమావేశమయ్యారు. వ్యక్తిగత పని మీద కలిశానని, రాజకీయ చర్చల కోసం కాదని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అన్ని పార్టీల వారు తనను ఆహ్వానిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
భారాస రెబల్‌గా పోటీకి సిద్ధం
Related tags :