Business

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మరో అప్‌డేట్

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మరో అప్‌డేట్

అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో పురోగతి.. 251.40 కి.మీ మేర పిల్లర్లు, 103.24 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం’’ అని వీడియోను ట్వీట్‌ చేశారు. ఇందులో బాక్స్‌ గడ్డర్లు, సెగ్మెంటల్‌ గడ్డర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్టును జాతీయ హై-స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) పర్యవేక్షిస్తోంది. ‘‘గుజరాత్‌లోని వల్సాద్‌, నవ్‌సారి జిల్లాల్లోని ఆరు నదులపై వంతెనల నిర్మాణం పూర్తయ్యింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి గడ్డర్‌ నిర్మాణం 2021 నవంబరు 25న ప్రారంభమైంది. దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేశాం. ఫుల్‌ స్పాన్‌ లాంచింగ్‌ విధానంతో 100 కి.మీ వయాడక్ట్‌ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేశాం. మరోవైపు సూరత్‌లో ట్రాక్‌ బెడ్‌ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 28 స్టీలు వంతెనలు రానున్నాయి. ఇందులో మొదటి వంతెన నిర్మాణం గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో ప్రారంభమైంది’’ అని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ తెలిపింది. ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు. బుల్లెట్‌ ట్రైన్‌ తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z