Sports

అదంతా విధి రాత అని భావిస్తా!

అదంతా విధి రాత అని భావిస్తా!

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ (Badminton) క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. లవ్‌ లైఫ్‌, రిలేషన్‌షిప్‌ గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది.

రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై స్పందిస్తూ.. ‘‘నేను సింగిల్‌. ప్రస్తుతం నాకు బ్యాడ్మింటన్‌ తప్ప మరే ఆలోచన లేదు. నా లక్ష్యం ఒలింపిక్స్‌. దాని కోసమే కష్టపడుతున్నా’’ అని సింధు చెప్పింది. ‘‘బ్యాడ్మింటన్‌ కాకుండా మరో భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా?’’ అని అడగ్గా.. ‘‘దాని గురించి నేనెప్పుడూ అంతగా ఆలోచించలేదు. అదంతా విధి అని భావిస్తా. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’’ అని సింధు సమాధానమిచ్చింది. ‘‘ఎవరితోనైనా డేటింగ్‌ చేశారా?’’ అని ప్రశ్నించగా.. ‘లేదు’ అని ఆమె బదులిచ్చింది.

ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన సింధు.. వచ్చే ఏడాది జరగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. మూడో ఒలింపిక్‌ పతకానికి గురిపెట్టిన ఈ తెలుగు తేజం.. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ ప్రకాశ్ పదుకొణె ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సింధు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ప్రకాశ్ పదుకొణెను తన ‘మెంటార్‌’గా పేర్కొన్న విషయం తెలిసిందే.

మోకాలి గాయం కారణంగా ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ నుంచి మధ్యలోనే వైదొలిగిన సింధు.. ఆ తర్వాత సయ్యద్‌ మోదీ టోర్నీకీ దూరమైంది. ప్రస్తుతం ఆమె గాయం నుంచి కోలుకుంటోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z