Business

ఇక పై యూట్యూబ్‌లో గేమ్స్-వాణిజ్య వార్తలు

ఇక పై యూట్యూబ్‌లో గేమ్స్-వాణిజ్య వార్తలు

ఇక పై యూట్యూబ్‌లో గేమ్స్

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) తాజాగా గేమింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. తన ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా గేమ్స్‌ ఆడే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లోని యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘Playables’ పేరిట తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ప్రీమియం చందాదారులు డౌన్‌లోడ్‌లు లేకుండానే వినియోగించవచ్చు.ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూట్యూబ్‌ యాప్‌ ద్వారా దాదాపు 37 పాపులర్‌ గేమ్స్‌ని ఆడొచ్చు. యాంగ్రీ బర్డ్స్‌ షోడౌన్‌, కానన్‌ బాల్స్‌ త్రీడి వంటి యాక్షన్‌ గేమ్‌లు, డైలీ క్రాస్‌వర్డ్‌ వంటి పజిల్ గేమ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ వచ్చే ఏడాది మార్చి 28 వరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. యూట్యూబ్‌ యాప్‌లోని హోమ్‌పేజీని కిందకు స్క్రోల్‌ చేయగానే కనిపించే ప్లేయబుల్స్‌ షెల్ఫ్‌ ఆప్షన్‌ ఎనేబల్‌ చేసుకొని ఈ గేమ్స్‌ ఆడొచ్చు. మీ ప్రొఫైల్‌ ఐకాన్‌ని ట్యాప్‌ చేసి కిందకు స్క్రోల్ చేసి ‘Your Premium benefits’ ట్యాప్‌ చేసి ‘Try experimental new features’ ఆప్షన్‌ ట్యాప్‌ చేసి ఈ ఫీచర్‌ యాక్సెస్‌ చేయొచ్చు.

* టాటా మోటార్స్ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలు

వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహన వినియోగదారుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కమర్షియల్ వాహనాలను కొనాలని భావించేందుకు డిజిటల్ ఫైనాన్స్ పరిష్కారాలను అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని కంపెనీ గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని పేర్కొంది.దీని ప్రకారం, టాటా మోటార్స్ కస్టమర్లు కంపెనీ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్, టాటా ఈ-గురు మొబైల్ యాప్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలు పొందవచ్చు. బస్సులు, ట్రక్కులు, చిన్న కమర్షియల్ వాహనాలు, పికప్‌లతో పాటు టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కమర్షియల్ వాహనాలకు బ్యాంకు నుంచి రుణాన్ని పొందవచ్చు. కస్టమర్‌ల అవసరాన్ని బట్టి సులభంగా వాహన కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయవచ్చని కంపెనీ వివరించింది.’కొత్త డిజిటల్ పరిష్కారాల ద్వారా వినియోగదారులకు రుణ సౌకర్యాలను అందించడం కోసం ఈ భాగస్వామ్యం చేసుకున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి ఉన్న విసృత నెట్‌వర్క్, సేవల ద్వారా కస్టమర్లకు పలు రకాల ఆర్థిక సహకారాలు లభిస్తాయని భావిస్తున్నట్టు ‘టాటా మోటార్స్ బిజినెస్ హెడ్, వైస్-ప్రెసిడెంట్ రాజేష్ కౌల్ వెల్లడించారు.

జూన్ వరకూ వడ్డీరేట్లు ఇంతే

వచ్చే ఏడాది జూన్ వరకు వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ డచెస్ బ్యాంక్ పేర్కొంది. బుధవారం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎంపీసీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించనున్నది.ఇప్పటికే కీలక వడ్డీరేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో మరో దఫా ఆర్బీఐ రెపోరేట్ పెంచక పోవచ్చు. అలాగని జూన్ వరకూ యథాతథంగా వడ్డీరేట్లు కొనసాగుతాయని భావిస్తున్నట్లు డచెస్ బ్యాంక్ పేర్కొంది. జూన్ తర్వాతే ఆర్బీఐ రెపోరేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గత ఫిబ్రవరిలో చివరి సారిగా ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచడంతో రెపోరేట్ ఆల్ టైం గరిష్ట స్థాయి 6.5 శాతానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల స్వల్ప కాలిక రుణాలపై వడ్డీరేట్లు 6.85-6.90 శాతంగా ఉన్నాయి.2024లో రెపోరేట్‌లో 75 బేసిక్ పాయింట్లు, 2025 ప్రారంభంలో 25 బేసిక్ పాయింట్ల మేరకు కోత విధిస్తారని భావిస్తున్నామని డచెస్ బ్యాంక్ తెలిపింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా 2024 ఏప్రిల్ నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు తెలుస్తున్నది. 2025 నాటికి ఆర్బీఐ రెపోరేట్ 5.50 శాతానికి దిగి వస్తుందని భావిస్తున్నామని డచెస్ బ్యాంక్ వెల్లడించింది. అదీ కూడా యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయాలకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోనున్నది.

జవనరి నుంచి హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా  వాహన ధరలు పెంపు

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India Ltd) సైతం వాహన ధరల్ని పెంపును గురువారం ప్రకటించింది. జనవరి1 నుంచి అన్ని మోడళ్ల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్ (Tata motors), మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra), మారుతీ సుజుకి, హోండా (Honda), ఆడి..  కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరల్ని పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో హ్యుందాయ్‌ చేరింది.ముడి సరకు ధరలు పెరగటంతో ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాహన ధరల్ని పెంచుతున్నట్లు హ్యుందాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో పెరిగిన వ్యయంలోని కొంత భారం కస్టమర్లపై పడిందని తెలిపింది.  గ్రాండ్‌ ఐ10 NIOS, ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ IONIQ5 వంటి తదితర మోడళ్లను హ్యుందాయ్‌ దేశంలో విక్రయిస్తోంది. వచ్చే ఏడాదిలో ధరలు పెంపుదలను ప్రకటించినప్పటికీ ఎంతమొత్తం పెంచనుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..!

| దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఏడు రోజుల పాటు ర్యాలీని కొనసాగించిన సూచీలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన సమీక్ష, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌ కంపెనీల షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 132.04 పాయింట్లు పతనమై 69,521.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36.50 పాయింట్లు తగ్గి 20,901.20 వద్ద ముగిసింది. దాదాపు 1,893 షేర్లు పురోగమించగా.. 1342 షేర్లు క్షీణించాయి. 81 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచాయి.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభాలను నమోదు చేశారు. సెక్టోరల్ ఫ్రంట్‌లో ఆటో, హెల్త్‌కేర్ ఒక్కొక్కటి 0.5 శాతం, ఆయిల్ అండ్‌ గ్యాస్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున పెరిగాయి. పవర్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ సూచీలు 0.5 శాతం తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. మరో వైపు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా పాలసీ రేటును నిర్ణయించే మానిటరీ కమిటీ (MPC) సమాశం అవుతున్నది. ఐదోసారి రెపో రేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిటీ సమావేశం ముగిసిన తర్వాత కీలక వడ్డీ రేట్లు, జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలకు సంబంధించి ఎంపీసీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z