Business

రెండేండ్ల‌లో 50,000 ఉద్యోగాలు-వాణిజ్య వార్తలు

రెండేండ్ల‌లో 50,000 ఉద్యోగాలు-వాణిజ్య వార్తలు

రెండేండ్ల‌లో 50,000 ఉద్యోగాలు

యాపిల్‌తో ఒప్పందానికి అనుగుణంగా భార‌త్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ (IPhone Assembly Plant) ఏర్పాటుకు టాటా గ్రూప్ స‌న్నాహాలు చేప‌ట్టింది. త‌మిళ‌నాడులోని హోసూర్‌లో ఈ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా రెండేండ్ల‌లో 50,000 ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని బ్లూంబ‌ర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ప్లాంట్‌లో 12 నుంచి 18 నెల‌ల్లోగా కార్య‌క‌లాపాలు చేప‌ట్టే ల‌క్ష్యంగా టాటా గ్రూప్ క‌స‌ర‌త్తు సాగిస్తోంది.త‌యారీ రంగంలో చైనాపై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించే క్ర‌మంలో స‌ప్ల‌యి చైన్‌ను భిన్న ప్రాంతాల్లో చేప‌ట్టాల‌న్న యాపిల్ వ్యూహానికి అనుగుణంగా ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. టాటా గ్రూప్ ఇప్ప‌టికే విస్ట్ర‌న్ కార్ప్ ఫెసిలిటీని స్వాధీనం చేసుకోవ‌డం ద్వారా క‌ర్నాట‌క‌లో ఇప్ప‌టికే ఐఫోన్ మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.భార‌త్‌, థాయ్‌ల్యాండ్‌, మ‌లేషియా స‌హా ప‌లు దేశాలకు చెందిన అసెంబ్లీ, కాంపోనెంట్ మ్యాన్యుఫ్యాక్చ‌ర‌ర్ల‌తో యాపిల్ భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. టాటా గ్రూప్ చేప‌ట్ట‌బోయే నూత‌న ప్లాంట్ యాపిల్ దేశీయంగా చేప‌ట్టే స‌ప్ల‌యి చైన్ స‌న్నాహాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఇక యాపిల్ ప్రోడ‌క్ట్స్ విక్ర‌యానికి సంబంధించి 100 రిటైల్ స్టోర్స్‌ను టాటా ప్రారంభించ‌నుంది.

* మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. గత నాలుగు రోజులు నుంచి గోల్డ్ ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.57,550 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు పెరిగి రూ.62,780 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,550,24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,780.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,550,24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,780.

9న ఫ్లిప్‌కార్ట్ ఇయ‌ర్ ఎండ్ సేల్ షురూ 

ఫ్లిప్‌కార్ట్ త‌న ప్లాట్‌ఫాంపై డిసెంబ‌ర్ 9 నుంచి 16 వ‌ర‌కూ బిగ్ ఇయ‌ర్ ఎండ్ సేల్‌ను (Flipkart Year End sale) ప్ర‌క‌టించింది. ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ మెంబ‌ర్‌షిప్ క‌లిగిన వారు ఒక రోజు ముందుగానే ఈ డీల్స్‌ను అందుకోవ‌చ్చు. సేల్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్ ఇయ‌ర్ ఎండ్ సేల్‌లో అందుబాటులో ఉండే కొన్ని డీల్స్‌ను ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం షేర్ చేసింది.ఐఫోన్ 14. న‌థింగ్ ఫోన్ (2). పిక్సెల్ 7, మోటీ జీ54 5జీ, రియ‌ల్మీ సీ53, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14 5జీ, పోకో ఎం6 ప్రో 5జీ, మొటొరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్ఈ 5జీ, వివో టీ2 ప్రో, ఐఫోన్ 14 ప్ల‌స్ వంటి ప‌లు హాట్ డివైజ్‌లు సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధ‌రకు అందుబాటులో ఉంటాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 రూ. 40,000లోపు ల‌భిస్తుంద‌ని ప్లాట్‌ఫాం టీజ‌ర్‌లో వెల్ల‌డైంది. ఇదే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్ర‌స్తుతం రూ. 49,999కి ల‌భిస్తుండ‌టంతో ఈ హాట్ డివైజ్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆక‌ర్ష‌ణీయ ధ‌ర‌కు సొంతం చేసుకోవ‌చ్చు.ఇక ఈ ఏడాది శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌పై ఏమైనా డీల్స్ ఉంటాయా అనేది ఇంకా వెల్ల‌డికాలేదు. ఇక ఐఫోన్ 14పై ఎంత డిస్కౌంట్ ఆఫ‌ర్ చేస్తార‌నే వివ‌రాలు కూడా వెల్ల‌డికాలేదు. న్యూ ఐఫోన్ 15 మోడ‌ల్‌పై డీల్స్‌కు సంబంధించిన వివ‌రాలు కూడా ఇంకా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం వెల్ల‌డించ‌లేదు. ఇక స్మార్ట్‌ఫోన్ల‌తో పాటు టీవీలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌పై 75 శాతం వ‌ర‌కూ డిస్కౌంట్స్‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ట్టు కంపెనీ తెలిపింది. ఇక ల్యాప్‌టాప్స్‌పై రూ. 9990 నుంచి డీల్స్ ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

* తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

జనాలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. కానీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ. 927,గుంటూరు: రూ. 944.

* ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ఇయర్‌ ఎండ్‌ సేల్‌ (Year End Sale)ను ప్రకటించింది. డిసెంబరు 9 నుంచి 16 వరకు ఏడు రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.ఐఫోన్‌14 (iPhone 14) రిటైల్‌ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్‌ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) పైనా ఫ్లిప్‌కార్ట్‌ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్‌ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ (Infinix Hot 30i)ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్‌ ఫోన్‌2 (Nothing Phone 2) ధర రూ.39,999 కాగా.. తాజా సేల్‌లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్‌ ఆఫర్లు, సేల్‌ ప్రత్యేక తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను కలిపిన తర్వాత ఈ ధరలు వర్తిస్తాయి.వీటితో పాటు గూగుల్‌ పిక్సెల్‌7, రియల్‌మీ సీ53, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ, పోకో సీ55, రియల్‌మీ 11 ప్రో 5జీ.. సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయమైన తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 75శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ( Bank of Baroda), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ( Bank of Baroda) డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ అందించనుంది. అంతే కాదు ఎంపిక చేసిన కొన్ని కొనుగోళ్లపై అదనపు డిస్కౌంట్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

* చేతులు లేని మహిళకు డ్రైవింగ్‌ లైసెన్స్‌

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, వాహనాలను డ్రైవ్ చేయాలంటే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం దాదాపు అందరికి తెలుసు. ఇటీవల రెండు చేతులూ లేని ఓ మహిళకు కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన ‘జిలుమోల్ మరియెట్ థామస్’ (Jilumol Mariet Thomas) ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఐదు సంవత్సరాలు కృషి చేసి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది.జిలుమోల్ కారు డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు గమనించినట్లయితే ఈమె కాళ్లతోనే కారుని డ్రైవ్ చేయడం చూడవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం మొదట్లో అప్లై చేసుకున్నప్పుడు అధికారులు తిరస్కరించారు. కానీ పట్టు వదలకుండా డ్రైవింగ్ నేర్చుకుని చివరికి సంబంధిత అధికారుల చేతులమీదుగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందింది.లైసెన్స్ కోసం జిలుమోల్ చేసిన అభ్యర్థనను ఐదేళ్ల క్రితం అధికారులు తిరస్కరించడంతో ఆమె రాష్ట్ర వికలాంగుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను కోరింది. ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలని ఎర్నాకులం జిల్లాలోని మోటారు వాహన శాఖ అధికారులను రవాణా కమిషనర్‌ ఆదేశించింది.జిలుమోల్ కారుని సవ్యంగా డ్రైవింగ్ చేయగలదా లేదా అనే విషయాన్నీ మోటారు వాహన శాఖ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే ఈమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఉండాలని వారు తీర్మానించారు. దీంతో ఒక సంస్థ 2018 మోడల్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌కి కావలసిన మార్పులను చేస్తూ సవరించింది.జిలుమోల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని ఆమె తన పాదాలతోనే ఆపరేట్ చేయవచ్చు. అంతే కాకుండా ఈ కారులోని కొన్ని ఫీచర్స్ యాక్టివేట్ చేయడానికి వాయిస్ రికగ్నిషన్‌ కూడా అందించింది. ఈమె ఈ ఏడాది మార్చిలో లెర్నర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నవంబర్‌లో డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసయ్యింది.కస్టపడి అనుకున్నది సాధించిన ‘జిలుమోల్’కు కేరళ ముఖ్యమంత్రి స్వయంగా డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన మొదటి మహిళా ఈమె కావడం గమనార్హం. జిలుమోల్ ఆర్టిస్ట్ కావడం వల్ల ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z