Business

ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు.

గవర్నర్‌ ప్రసంగంలోని కీలకాంశాలు..
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు.

2023-24 ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2023-24 మూడో త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండొచ్చని తెలిపింది. లక్ష్యిత పరిధి అయిన నాలుగు శాతానికి ఇంకా చేరుకోవాల్సి ఉందని పేర్కొంది.

2023-24లో దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువలో ఒడుదొడుకులు చాలా తక్కువగా ఉన్నాయని దాస్‌ తెలిపారు.

2023 డిసెంబర్‌ 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 604 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
డిజిటల్‌ రుణాల్లో మరింత పారదర్శకత తెచ్చేలా రుణ ఉత్పత్తులను అందించే వెబ్‌ అగ్రిగేటర్ల కోసం ఆర్‌బీఐ మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు.

ఆస్పత్రులు, విద్యా సంస్థలకు UPI చెల్లింపుల పరిమితిని ఆర్‌బీఐ రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది.
రికరింగ్‌ చెల్లింపుల ఇ-మ్యాండేట్‌ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z