Business

వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త!

వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ భారత్‌ రైళ్లు త్వరలోనే స్లీపర్‌ తరగతి బోగీలతో అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఇప్పటికే అధునాతనంగా తీర్చిదిద్దిన రైల్వే శాఖ త్వరలోనే మరిన్ని హంగులతో పట్టాలెక్కించనుంది. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మరిన్ని ప్రవేశపెట్టే యోచనలో ఆ శాఖ ఉంది.

వేగం.. సౌకర్యం.. సమయ వేళలు అనుకూలంగా ఉండడంతో ప్రయాణికులు వీటిని ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్‌ బోగీలతో ప్రత్యేకంగా వందేభారత్‌ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.

చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు ఇప్పటికే సిద్ధంకాగా విజయవాడ డివిజన్‌కు రెండు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు త్వరతోనే ట్రైల్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ డివిజన్‌లో నడుస్తున్న సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై సెంట్రల్‌ రైళ్లకు ఎక్కువ గిరాకీ ఉండగా స్లీపర్‌ తరగతి బోగీలతో నడిచే వందేభారత్‌కు మరింత ఆదరణ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ రైళ్ల కోసం ఇప్పటికే డివిజన్‌ వ్యాప్తంగా పట్టాల పటిష్ఠతను పెంచారు. ఇందుకుగాను భారీగా సాధారణ రైళ్లు రద్దు చేసి నిర్వహణ పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించినా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే రైలును ప్రవేశపెట్టేందుకు ఆ శాఖ యోచిస్తోంది.

దివ్యాంగులకు ప్రత్యేక వసతులు
దివ్యాంగులకు అనుకూలంగా లేకపోవడంతో త్వరలోనే ప్రవేశపెట్టబోయే స్లీపర్‌ బోగీల రైళ్లను ప్రత్యేక డిజైన్‌తో తయారు చేశారు. బోగీల్లో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు సులువుగా పై బెర్తులకు చేరుకునేలా డిజైన్‌ మార్చారు. మొత్తం 857 బెర్తుల్లో 37 బెర్తులు సిబ్బందికి, ఒక ప్యాంట్రీకార్‌ ఉంటాయి. బెర్తులు మరింత వెడల్పుగా విశాలంగా ఉండేలా డిజైన్‌ చేశారు. ప్రతి బోగీలో మూడు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న రైళ్లతో పోలిస్తే నమూనా కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న స్లీపర్‌ బోగీల వందే భారత్‌ కొత్త రైలు చిత్రాలను ఇటీవల రైల్వే మంత్రి ట్వీట్‌ చేయగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z