Business

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

* నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఉదయం 71,832.62 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 71,862 పాయింట్ల వరకు చేరినా.. చివరకు 535.88 పాయింట్ల నష్టంతో 71,356.60 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 148.45 పాయింట్ల నష్టంతో 21,517.35 వద్ద ముగిసింది. మరో వైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 1,917 షేర్లు పెరగ్గా.. 1,390 షేర్లు పతనమయ్యాయి. మరో 79 షేర్లు మాత్రం మారలేదు. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

* 2024లోనూ ఐపీఓల సందడి

స్టాక్‌ మార్కెట్లలో ఐపీఓల (IPO) సందడి మళ్లీ మొదలవుతోంది. గుజరాత్‌కు చెందిన జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూకు (Jyoti CNC Automation IPO) వస్తోంది. మార్కెట్ల నుంచి రూ.1000 కోట్ల మేర సమీకరించనుంది. జనవరి 9న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 11న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు జనవరి 8నే విండో తెరుచుకోనుంది. ఈ ఏడాది వస్తున్న తొలి మెయిన్‌ బోర్డు ఐపీఓ ఇదే కావడం గమనార్హం. ధరల శ్రేణిని ఇంకా నిర్ణయించలేదు.గత నెల సెబీ (SEBI) నుంచి సంబంధిత అనుమతులు పొందిన జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ సంస్థ.. తాజా షేర్లను పూర్తిగా ఐపీఓ ద్వారా విక్రయించబోతోంది. మార్కెట్‌ నుంచి సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, దీర్ఘకాల మూలధన అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది. వాస్తవానికి 2013లోనే ఈ కంపెనీ సెబీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తర్వాత ఐపీఓ ప్రయత్నాలను విరమించుకుంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఓకు వస్తోంది.కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ మెషిన్ల తయారీలో పేరెన్నికగల సంస్థల్లో జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ ఒకటి. ఇస్రో, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ తిరువనంతపురం లిమిటెడ్‌, తుర్కిష్‌ ఏరోస్పేస్‌, ఎంబీడీఏ, యునిపార్ట్స్‌ ఇండియా, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌, టాటా సికోరస్కై ఏరోస్పేస్‌ లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, కల్యాణ్‌ టెక్నాలజీ ఫోర్జ్‌ లిమిటెడ్‌, రోలెక్స్‌ రింగ్స్‌ లిమిటెడ్‌, బాష్‌ లిమిటెడ్‌..తదితర సంస్థలు ఈ కంపెనీకి కస్టమర్లు. 2023 సెప్టెంబర్‌ నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.3,315 కోట్లు. ఈక్విరస్‌ క్యాపిటల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

* సుప్రీంకోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ హర్షం

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్ని విచారించిన సుప్రీం నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసి, ఈ రోజు తీర్పును వెలువరించింది. ఈ కేసును విచారించిన సెబీ అదానీ గ్రూప్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది. సెబీ విచారణను సుప్రీంకోర్టు సమర్థిస్తూ.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కి కేసు బదిలీ చేసేందుకు నిరాకరించింది.సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.ఈ రోజు తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు… అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విచారణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) నివేదిక సెబీ నుంచి సిట్‌కి దర్యాప్తు బదిలీ చేయడానికి ప్రామాణికం కాదని తీర్పులో పేర్కొంది.

* శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఏటా శాంసంగ్ కంపెనీ తయారు చేసిన కొత్త మోడళ్లను ఈ ఈవెంట్‌లో విడుదల చేస్తుంది. ఈ ఏడాది జనవరి 17న అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్‌ జోస్‌ ఎస్‌ఏపీ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. శాంసంగ్‌ అధికారిక ఛానెల్స్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు.శాంసంగ్‌ తన ఎస్‌ సిరీస్‌లో ఎస్‌24 ఫోన్లను విడుదల చేయనున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. గెలాక్సీ ఎస్‌ 24 (Samsung Galaxy S24), గెలాక్సీ ఎస్‌ 24+ (Galaxy S24+), గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా (Galaxy S24 Ultra) పేరిట మూడు మోడళ్లను తీసుకురానున్నట్లు సమాచారం. వీటిలో ఇన్‌బిల్ట్‌గా AI ఫీచర్లను తీసుకొస్తున్నారు. కొత్త హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రీ- రిజర్వేషన్‌లు అప్పుడే ప్రారంభమయ్యాయని శాంసంగ్‌ వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు రూ.1,999తో వీఐపీ పాస్‌ ద్వారా సైన్‌ అప్‌ అయ్యి హ్యాండ్‌సెట్‌లను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఎస్‌ 24 సిరీస్‌లోని ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌యూఐ 6.1తో రానున్నాయి. ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8జెన్‌ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లకు అమోలెడ్‌ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ ఇస్తున్నారు. మూడు మోడల్స్‌లో అల్ట్రా వేరియంట్ మొబైల్‌కు 200Mp క్వాడ్ కెమెరా, మిగిలిన రెండు మోడల్స్‌ 50Mp ట్రిపుల్ కెమెరా అమర్చారు.

* బజాజ్‌ ఫైనాన్స్‌లో డిజిటల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్‪సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి ఫిక్స్‪డ్ డిపాజిట్ (ఎఫ్‪డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన ఆప్ అండ్‌ వెబ్‪సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.‬‬‬‬‬‬‬‬ నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా డిపాజిట్లని బుక్ చేయడానికి డిజిటల్, అసిస్టెడ్ డిజిటల్ పద్ధతిని ఉపయోగించేలా ఖాతాదారులని ప్రోత్సహించడం ద్వారా పొదుపు అనుభవాన్ని ఈ డిజిటల్ ఎఫ్‪డి కొత్తగా రూపుదిద్దుతుంది. బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్ అండ్‌ వెబ్‪సైట్‌లో వారు చాలా సులభంగా, సురక్షితంగా, ఏ ఇబ్బందులు లేకుండా, దాదాపు తక్షణం ఎఫ్‪డి బుక్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬‬‬ 2024 జనవరి 2 నుంచి బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, వెబ్‪సైట్ ద్వారా 42 నెలల కాలపరిమితికి బుక్ చేసుకున్న ఎఫ్‪డిలకు సీనియర్ సిజిజన్లకు బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.85% వరకూ ఇస్తోంది. 60 ఏళ్ళలోపు వయసున్న డిపాజిటర్లు ఏడాదికి 8.60 వరకూ వడ్డీ పొందవచ్చు. కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరైన డిపాజిట్లని 42 నెలల కాలపరిమితికి రెన్యువల్ చేసినప్పుడు కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬ఈ సందర్భంగా ఫిక్స్‪డ్ డిపాజిట్లు అండ్‌ ఇన్వెస్ట్‪మెంట్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సచిన్ సిక్కా, హెడ్ మాట్లాడుతూ.. మా ఇబ్బందులు లేని విధానక్రమాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఖాతాదారు అనుకూల విధానాలు, బజాజ్ ఫిన్‪సెర్వ్ ఎఫ్‪డిలతో ఖాతాదారుల అనుభవాన్ని నిర్వచిస్తాయి. గత రెండేళ్ళలో 2x రెట్లు పెరిగిన మా డిపాజిట్ బుక్, ఖాతాదారులు బజాజ్ బ్రాండ్ పై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంది. మా ఎఫ్‪డిలు ఇప్పుడు డిపాజిట్ దారులు డిజిటల్-ఫస్ట్ గా ఆలోచించే వీలుకల్పిస్తుంది. బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, వెబ్‪సైట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన అధిక వడ్డీ రేట్లతో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. చాలా సులభమైన ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్రయాణంగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఇది ఎఫ్‪డి తెరిచే అనుభవాన్ని డిజిటల్ కాలంలోకి తీసుకువస్తోంది అని అన్నారు.బజాజ్ ఫైనాన్స్ కి, 2023 సెప్టెంబర్ 30 నాటి వరకూ, 76.56 మిలియన్ ఖాతాదారులు, 44.68 మిలియన్ నెట్ యూజర్లు ఉన్నారు. డాటా.ఐఒ నివేదిక ప్రకారం.. ప్లేస్టోర్‌లోని ఫైనాన్షియల్ డొమైన్‌లో, భారతదేశంలో బజాజ్ ఫిన్‪సర్వ్ యాప్‌, అత్యధికంగా డౌన్‌లోడ్‌లు చేసుకున్న 4వ యాప్‌గా నిలుస్తోంది.‬‬ 2023 సెప్టెంబర్ 30 నాటికి, రూ. 54,821 కోట్ల పైగా మొత్తం డిపాజిట్ బుక్, 1.4 మిలియన్ డిపాజిట్లతో, ఈ కంపెనీ దేశంలోనే అత్యధిక డిపాజిట్లు స్వీకరించిన ఎన్‪బిఎఫ్‪సి గా అవతరించింది. బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‪డ్ డిపాజిట్ కార్యక్రమం, క్రిసిల్ వారి ఎఎఎ/స్టేబుల్, ఐసిఆర్ఎ వారి ఎఎఎ (స్టేబుల్) అత్యధిక రేటింగ్స్ సాధించి, మదుపుదారులకి అత్యంత సురక్షితమైన మదుపు అవకాశాలని అందించేదిగా నిలుస్తోంది.‬‬‬‬‬‬ ఈ కంపెనీ యాప్‌, ఇన్వెస్ట్‪మెంట్ మార్కెట్‪ప్లేస్ ని కూడా అందుబాటులో వుంచుతోంది. దానిద్వారా ఖాతాదారులు విస్తృస్థాయిలో రకరకాల మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయొచ్చు.‬‬‬‬

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z