DailyDose

9 నుంచి సీడీపీవోల ద్వారా అంగన్‌వాడీలకు నోటీసులు

9 నుంచి సీడీపీవోల ద్వారా అంగన్‌వాడీలకు నోటీసులు

అంగన్‌వాడీలపై తీవ్ర చర్యలకు దిగేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా అంగన్‌వాడీ సర్వీసులు అత్యవసర సేవల కిందకు రావు. కానీ వాటి పరిధిలోకి తెచ్చి మరీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. మరోవైపు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా.. వేతనాల పెంపుపై సీఎం జగన్‌ ఇచ్చిన మాట నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్మాను ప్రయోగిస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 2 ప్రతులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ తగులపెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. అంగన్‌వాడీలు విధుల్లోకి చేరేందుకు 8వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. ఇప్పటికే పలుచోట్ల 8వ తేదీ సాయంత్రంలోగా విధుల్లో చేరాలని వారి సెల్‌ఫోన్‌లకు సమాచారాన్ని పంపింది. 9 నుంచి సీడీపీవోల ద్వారా అంగన్‌వాడీలకు వారి పేరుమీద నోటీసులు జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై గత రెండు రోజులు తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం న్యాయసలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో వైకాపా ప్రభుత్వ తీరుపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు అక్కచెల్లెమ్మలంటూ తిరిగి వాగ్దానాలిచ్చి, వాటిని అమలు చేయలేక ఇప్పుడు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా.. అని దుయ్యబట్టారు. అంగన్‌వాడీల సేవలు అత్యవసరమైనప్పుడు తమ బతుకు అత్యవసరం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు.

పీడీ స్థాయి అధికారి కనుసన్నల్లోనే..
అంగన్‌వాడీలు సమ్మె చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను డైరెక్టరేట్లో ఓ పీడీ స్థాయి అధికారికి ప్రభుత్వం కట్టబెట్టింది. పూర్తి వైకాపా ఆలోచనలతోనే ఆ అధికారి పని చేస్తున్నారని ఆ శాఖలో చర్చ నడుస్తోంది. డైరెక్టరేట్‌ మొదలు, జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల నుంచి అంగన్‌వాడీలపై ఒత్తిడి తెచ్చే పన్నాగాన్ని మొదటినుంచి ఆ అధికారే అమలు చేస్తున్నారు. కిందిస్థాయి అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అంగన్‌వాడీల డిమాండ్లపై ఆ శాఖలోని చాలా మంది అధికారుల్లోనూ సానుకూల వైఖరి ఉంది. ప్రస్తుతం పెరిగిన ధరలు, వారు పనిచేసే విధానానికి అనుగుణంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలనే అభిప్రాయం మెజారిటీ అధికారుల్లో ఉన్నట్టు శాఖలో చర్చ నడుస్తోంది. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడమూ సరికాదనే భావనా ఉంది.

ఇదేం గొప్ప సాధికారత జగనన్నో..
మహిళా సాధికారతకు పాటుపడే గొప్ప నాయకుడిని తానే అన్నట్టు ఎన్నికల ముందూ.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మాటలతో జగన్‌ రక్తికట్టిస్తున్న తీరు అంతా ఇంతా కాదు. వారిని ఏమార్చేందుకు ఓట్ల వేటలో రాజకీయ కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఒకవైపు నాలుగున్నరేళ్లలో పదో పాతికో సంపాదించుకుంటూ కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటున్న మహిళా ఉద్యోగాలకు ఎసరు పెడుతూ.. సభా వేదికలపైన మాత్రం ‘అక్కచెల్లెమ్మలు’, ‘మీ బిడ్డ..మీ బిడ్డ’ అంటూ అపూర్వమైన నటనను ప్రదర్శిస్తున్నారు. కల్యాణమిత్రలు, బీమా మిత్రలు, పశుమిత్రలు.. ఇలా వేలసంఖ్యలో మహిళా చిరుద్యోగులను తొలగించారు. వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. వీరికీ ఎన్నికల ముందు గొప్పగా హామీలిచ్చి.. అధికారంలోకి రాగానే అమలు చేయకుండా ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా చేశారు. ఇప్పుడు అంగన్‌వాడీలపైనా అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంత గొప్ప సాధికారతో జగనన్నకే తెలియాలి మరి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z