Politics

మైలవరంలో వసంత సీటు గల్లంతు-తాజావార్తలు

మైలవరంలో వసంత సీటు గల్లంతు-తాజావార్తలు

* ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం అసెంబ్లీ వైకాపా ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుపతిరావును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్టు సమాచారం. శుక్రవారం తిరుపతిరావు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మైలవరం అసెంబ్లీ ఇన్‌ఛార్జి మార్పుపై మంత్రి జోగి రమేశ్‌, ఎంపీ కేశినేని నానితో సీఎం చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇన్‌ఛార్జి మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇప్పటివరకు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్‌ తాజా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా రాజకీయ భవిష్యత్తు.. ఎప్పుడు చీకటి పడుతుందా? ఎప్పుడు తెల్లారుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైకాపా నేతలు ఆస్తులు అమ్ముకున్నారు. బిల్లుల బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేశ్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరు నేతలను.. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడినా పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో తాజాగా మైలవరం ఇన్‌ఛార్జిని మార్చడంతో వసంత కృష్ణప్రసాద్‌ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.

* ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లు రద్దు చేయనున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో తితిదే, పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

* అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ చరిత్రలోనే అతిపెద్ద ‘డేటా లీక్‌’కు పాల్పడిన సంస్థ మాజీ ఉద్యోగి జోష్‌వాస్కుట్లేకి అక్కడి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈమేరకు అమెరికా అటార్నీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సంస్థ కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన కీలక సమాచారాన్ని తస్కరించి ‘వికీలీక్స్‌’కు చేరవేశాడని, అది రుజువుకావడంతో అతడికి శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొంది. 2016లో వివిధ ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని వికీ లీక్స్‌కు అందజేశాడన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం 2022లో అతడిని దోషిగా తేల్చి తాజాగా తీర్పు వెలువరించింది. దేశానికి తీరని ద్రోహం చేశాడని ఆక్షేపించింది. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ కనిపించని అత్యంత హేయమైన నేరం చేశాడని మండిపడింది. సంస్థలో తనకు ఎదురైన అనుభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు జాతీయ భద్రతను పణంగా పెట్టాడని తెలిపింది.

* సినీ రచయిత చిన్నికృష్ణ అగ్ర కథానాయకుడు చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని వీడియో విడుదల చేశారు.

* బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌ రైస్‌ (Bharat Rice) పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో రూ.29 చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15 శాతం మేర పెరిగాయని చోప్రా అన్నారు. నేషనల్‌ అగ్రికల్చర్‌ కో – ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NAFED), నేషనల్‌ కో – ఆపరేటివ్‌ కన్జ్యూమర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NCCF), కేంద్రీయ భండార్‌ రిటైల్‌ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని వెల్లడించారు. ఇ-కామర్స్‌ వేదికగానూ భారత్‌ రైస్‌ లభిస్తుందన్నారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్‌ రైస్‌’ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు. రిటైల్‌ మార్కెట్లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ దాల్‌ (శనగ పప్పు)ను రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

* తమిళనాట (Tamil Nadu) మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ కథానాయకుడు, దళపతి విజయ్‌ (Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్‌ అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

* ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్‌ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

* రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో.. పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్చేసింది. వై నాట్‌ 175 నినాదంతో.. ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

* కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవారు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్‌ గాంధీ తాను చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ‘డిజిటల్‌ మీడియా వారియర్స్‌’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీ పతనం, ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హిమంత, మిలింద్‌ దేవరా వంటి వ్యక్తులు కాంగ్రెస్‌కు విడిచిపెట్టాలకున్నానని తెలిపారు. వారు పార్టీ నుంచి వెళ్లిపోవటం వల్ల ఇబ్బంది ఏం లేదన్నారు. వారి పార్టీ మార్పు సరైందేనని తెలిపారు.

* ప్ర‌పంచంలో అతిపెద్ద పార్టీ చండీఘ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో ఓట్ల చోరీకి తెగ‌బ‌డింద‌ని బీజేపీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ విరుచుకుప‌డ్డారు. మేయ‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ అక్ర‌మాల‌ను నిర‌సిస్తూ శుక్ర‌వారం ఢిల్లీలో ఆప్ నిర్వ‌హించిన ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. రానున్న లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ గంద‌ర‌గోళం సృష్టించేందుకు బీజేపీ వెనుకాడ‌ద‌ని ఆరోపించారు. చండీఘ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో ఓట్లు దొంగిలిస్తూ ప్ర‌పంచంలో అతిపెద్ద రాజ‌కీయ పార్టీ ప‌ట్టుబ‌డింద‌ని ఎద్దేవా చేశారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ బీజేపీ నేత‌లు వీడియోకు అడ్డంగా దొరికార‌ని అన్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించార‌ని అన్నారు. మేయర్ ఎన్నిక‌ల్లోనే అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన బీజేపీ ఇక అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో ఊహించుకోవ‌చ్చ‌ని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z