Business

సుప్రీంలో మార్గదర్శికి చుక్కెదురు-వాణిజ్య వార్తలు

సుప్రీంలో మార్గదర్శికి చుక్కెదురు-వాణిజ్య వార్తలు

* సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్‌ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది.

* ఫాస్టాగ్‌ల ఈ – కేవైసీ పూర్తి చేసేందుకు గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. గడువు తేదీ తర్వాత కేవైసీ చేయని వాటిని డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌తో పాటు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ వెబ్‌సైట్‌ ద్వారా కేవైసీ చేసుకోవచ్చని తెలిపింది. అంతకుముందు జనవరి 31 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే.

* ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో మరో రెండు కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అయితే, ఇవి రెగ్యులర్‌ ప్లాన్స్‌ కావు. అదనపు డేటా వినియోగం కోసం డేటా బూస్టర్‌ ప్లాన్స్‌. వీటి ధరలను రూ.101, రూ.251గా జియో నిర్ణయించింది. గతంలో డేటా బూస్టర్‌ కోసం రూ.401 ప్లాన్‌ను జియో ప్రకటించింది. జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు దేశవ్యాప్తంగా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 500 పట్టణాల్లో ఈ సేవలు లభిస్తున్నాయి. వైర్‌ అవసరం లేని 5జీ ఆధారిత ఎయిర్‌ ఫైబర్‌ కోసం రెగ్యులర్‌, మ్యాక్స్ పేరిట మొత్తం ఆరు బేసిక్‌ ప్లాన్లను జియో అందిస్తోంది. ఆయా ప్లాన్లలో గరిష్ఠంగా 1 టీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా పూర్తయినప్పుడు డేటా స్పీడ్‌ 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో డేటా బూస్టర్‌ ప్యాక్స్‌ అవసరం అవుతాయి.

* టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్‌ ప్రకటించింది. వన్‌వే టికెట్‌ డొమెస్టిక్‌ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్‌వర్క్-వైడ్ సేల్‌ను ప్రారంభించింది . ఎయిర్‌ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్‌వర్క్-వ్యాప్త ఆఫర్‌ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్‌ చేస్తే ఈ ఆఫర్‌పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్‌ఇండియా ఒక విడుదలలో తెలిపింది.

* కేంద్రంలో ఎన్డీయే 3 హ‌యాంలో భార‌త్ ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌గా అవ‌త‌రిస్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో జ‌రిగిన భార‌త్ మొబిలిటీ గ్లోబ‌ల్ ఎక్స్‌పోను ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ తాము మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన తర్వాత ఐదేండ్ల‌లో దేశం ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌గా ఎదుగుతుంద‌ని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z