DailyDose

హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల గంజాయి సరఫరా-నేరవార్తలు

హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల గంజాయి సరఫరా-నేరవార్తలు

* ఏపీలోని అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని యాటకళ్ల గ్రామానికి చెందిన చాకలి నారాయణ, సరస్వతి దంపతలుకు రూప, జ్యోతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు అనంతపురంలో డిగ్రీ చదువుకుంటూ నాలుగురోజుల క్రితం సొంతింటికి చేరుకున్నారు. తల్లిదండ్రులు గురువారం వేరే గ్రామానికి వెళ్లగా రాత్రి ఇద్దరు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం కుమార్తెలకు తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా వారి నుంచి సమాదానం రాకపోవడంతో పక్కింటివారికి ఫోన్‌ చేశారు. పొరుగున్న వారు తలుపులు తీసి లోనికి వెళ్లి చూడగా ఇద్దరు దూలానికి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని పిల్లల మృతదేహాలను చూసి బోరున విలపించడం స్థానికుల కంట కన్నీరు తెప్పించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

* క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూర్‌లో దారుణం జ‌రిగింది. బెంగ‌ళూర్ మెట్ర‌పాలిట‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (బీఎంటీసీ) బ‌స్ శుక్ర‌వారం ఇంజ‌నీరింగ్ విద్యార్ధినిని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో విద్యార్ధిని కుసుమిత (21) ప్రాణాలు కోల్పోయింది.

* సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితులు ఒక యువతిని బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లారు. డ్రగ్స్‌ కలిపిన ఆహారం తినిపించారు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతికి ఇద్దరు వ్యక్తులు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆమెకు ఫోన్‌ చేసి మదంగిర్‌లోని సిగ్నల్ కూడలికి రప్పించారు. బెదిరించి స్కూటర్‌పై ఎక్కించుకుని మాళవియా నగర్‌కు తీసుకెళ్లారు. ఆ యువతికి డ్రగ్స్‌ కలిపిన ఆహారం ఇచ్చారు. మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

* భర్త అనుమానం భార్యను ఇంట్లోని ఓ గదిలో బందీని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. భర్త అరాచక ప్రవర్తన ఆమెను తీవ్రంగా విసిగించింది. బాగా కుంగదీసింది. చివరకు నాకు భర్త వద్దేవద్దు, పుట్టింటికి వెళ్లిపోతా అనే పరిస్థితి తీసుకొచ్చింది. కర్ణాటకలోని మైసూరు పట్టణంలో ఈ ఘటన చోటచేసుకుంది. బాధితురాలి కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆమెను చెర నుంచి విడిపించడంతో విషయం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మైసూరుకు చెందిన సన్నయ్య, సుమ ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సన్నయ్య కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అతడికి భార్యపై అనుమానం. దాంతో రోజూ తను పనికి వెళ్లేటప్పుడు భార్యను ఓ గదిలో వేసి బంధిస్తున్నాడు. పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాళం తీస్తున్నాడు. గత 12 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నది. తాళం వేసి వెళ్లేటప్పుడు మలమూత్రాదుల కోసం ఆమెకు ఒక డబ్బా ఇచ్చేవాడు. సాయంత్రం పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చినా తల్లికి వారిని కలిసే అవకాశం ఉండేది కాదు. మళ్లీ భర్త పని నుంచి వచ్చిన తర్వాతనే తాళం తీసేవాడు. అప్పటి నుంచి మరుసటి రోజు పిల్లలు స్కూల్‌కు, భర్త పనికి వెళ్లేదాక బయట ఉండేది. ఆ తర్వాత ఎప్పటిలాగే ఆమెను గదిలో పెట్టి తాళం వేసి వెళ్లేవాడు. ఈ మధ్య కాలంలో భర్త ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి. గత మూడు వారాల నుంచి ఆమెను పూర్తిగా గదికే పరిమితం చేశాడు. 24 గంటలూ గదిలోనే బంధించి ఉంచుతున్నాడు. విషయం తెలుసుకున్న పుట్టింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితురాలిని విడిపించి పుట్టింటికి పంపారు. అయితే, భర్తపై ఫిర్యాదు చేసేందుకు సుమ నిరాకరించింది. తాను ఆయనపై ఫిర్యాదు చేయదల్చుకోలేదని చెప్పింది. తిరిగి ఆయన దగ్గరికి వెళ్లనని, పుట్టింట్లోనే ఉంటానని తెలిపింది.

* మొబైల్‌ ఫోనులో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని 14 ఏళ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వలో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని శోలాపుర్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు విజయ్‌ బట్టు దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడి కుమారుడు విశాల్‌ దగ్గర్లోని పాఠశాలలో చదువుకొనేవాడు. రోజూ స్కూలుకు ఫోను తీసుకువెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. ఈ విషయమై ఉపాధ్యాయులు పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. విసుగెత్తిపోయిన విజయ్‌ కుమారుడి ఆహారంలో విషం కలిపాడు. ఈ సంగతి అతడి భార్యకు తెలియదు. కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న దంపతులిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయ్‌ ఇంటికి దగ్గర్లోని మురికికాల్వలో మృతదేహం కనిపించింది. దొరికిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎలాగైనా దొరికిపోతానని గ్రహించిన విజయ్‌.. జరిగిన విషయాన్ని జనవరి 28న తన భార్యకు చెప్పాడు. ఆ తర్వాత పోలీస్‌స్టేషనుకు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. హత్యకేసు నమోదుచేసిన పోలీసులు నిందితుణ్ని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.

* హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల వాహనం నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z