Politics

అవనిగడ్డ అభ్యర్థిగా మండలి ఖరారు-NewsRoundup-Apr 04 2024

అవనిగడ్డ అభ్యర్థిగా మండలి ఖరారు-NewsRoundup-Apr 04 2024

* అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేశారు. రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాకపోవడంతో అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో సాఫ్ట్‌వేర్‌ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్‌లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జులైలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామని, ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని ప్రకటించారు.

* తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.

* కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రజలు ఖర్చుకు వెనకాడడం లేదు. సౌకర్యాలు ఉంటే చాలు ధర రూ.కోటైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు దేశ రాజధాని ప్రాంతం దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో జనవరి – మార్చి మధ్య 10,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానాల్లో ముంబయి (7,401), హైదరాబాద్‌ (6,112) ఉన్నాయి.

* కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) కీలక ప్రకటన చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

* సునీల్ నరైన్.. ఈ పేరు చెబితే ఐపీఎల్ జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. లోయరార్డర్ బ్యాటర్ అయిన అతను.. ఓపెనర్‌గా వచ్చి రెచ్చిపోతున్న తీరు అనూహ్యం. వరుసగా రెండో మ్యాచ్‌లో అతను బ్యాటుతో జట్టుకు విజయం సాధించిపెట్టడంతో రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లు అతడికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి.

* అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ గతేడాది భారత్‌ ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3’ జాబిల్లి దక్షిణ ధ్రవంపై దిగ్విజయంగా దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ఈ విజయం కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారవేత్తను బిలియనీర్‌గా చేసింది. ఆయనే కేనెస్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రమేశ్‌ కున్హికన్నన్‌.

* కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని ఉద్దేశించి.. నటి, మండి నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్‌ బాధితుడయ్యారని అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈవిధంగా స్పందించారు.

* కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు.. చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా.. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు.

* భారత్‌లో ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections)ను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాదాపు 95 కోట్లమంది ఓటర్లున్న దేశంలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలినాళ్లలో ఎన్నో సవాళ్లతో పాటు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 1957 (రెండో సాధారణ) ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఎన్నికల సంఘం (Election Commission) పలు సందర్భాల్లో వెల్లడించింది.

* అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ.. వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ గురువారం కౌంటరు దాఖలు చేసింది. వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరింది. హైకోర్టు విధించిన బెయిల్‌ షరతులు ఆయన ఉల్లంఘించారని తెలిపింది. ‘‘అవినాష్‌రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులు. నిందితులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారు. వివేకా హత్యకేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్‌. అతనితో పాటు కుటుంబ సభ్యులనూ నిందితులు బెదిరిస్తున్నట్టు దస్తగిరి చెబుతున్నారు. బెదిరింపులు, ప్రలోభాల నుంచి దస్తగిరి, ఇతర సాక్షులను కాపాడాలంటే అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలి’’ అని సీబీఐ కోరింది.

* ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల ఈసీ బదిలీ వేటు వేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన అధికారులు ఈరోజు రాత్రి 8గంటల్లోగా ఛార్జ్‌ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా నియమితులైన ఉన్నతాధికారులు వీరే..

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డి.కె.బాలాజీ
అనంతపురం కలెక్టర్‌గా వి.వినోద్‌కుమార్‌
తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌
గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ప్రకాశం ఎస్పీగా సుమిత్‌ సునీల్‌
పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్‌
చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు
అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌
నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్‌ హఫీజ్‌

* కర్ణాటక (Karnataka)లోని బోరుబావి (Borewell)లో పడిన ఏడాదిన్నర చిన్నారి కథ సుఖాంతమైంది. రెస్క్యూ సిబ్బంది 20 గంటలు శ్రమించి ఆ పసివాడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. విజయపుర జిల్లా ఇండి తాలూకా లచ్యాణా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సాక్షిత్‌ మజగొండన బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి తన ఇంటి సమీపంలోని తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బావిలో నుంచి చిన్నారి ఏడుపు శబ్దాలు విన్న స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు చెప్పారు. సమాచారమందుకున్న ఎస్‌డీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ మొదలైంది. మొదట బోరుబావిలోకి కెమెరాను పంపగా.. 16 అడుగుల లోతులో చిన్నారి కాలు కదులుతూ కన్పించింది. వెంటనే పైప్‌లైన్‌ సాయంతో ఆక్సిజన్‌ను లోపలికి పంపించారు. ఆ తర్వాత బావి చుట్టూ తవ్వారు. దాదాపు 18 గంటల తర్వాత బాలుడి చిక్కుకొన్న ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు.

* దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్‌ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత తరఫున మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z