Politics

జగన్‌కు ఈసీ తాఖీదులు-NewsRoundup-Apr 07 2024

జగన్‌కు ఈసీ తాఖీదులు-NewsRoundup-Apr 07 2024

* సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా నోటీసులు జారీ చేశారు. సీఎం తన ప్రసంగాల్లో చంద్రబాబును పశుపతితో పోల్చారని, ఇంటింటికీ పింఛను అందకుండా చేసి 31 మంది అవ్వాతాతలను చంద్రబాబు చంపారంటూ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారని వర్ల రామయ్య ఇటీవల సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్‌కు నోటీసులు ఇచ్చారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

* హిమాచల్‌ ప్రజలు లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవైపు అధికారం కోసం భాజపా డబ్బు, ఏజెన్సీలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని, మరోవైపు సత్యం, ధైర్యం, ఓర్పుతో కాంగ్రెస్ ముందుకెళ్తోందని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనే సంకల్పంతో పార్టీ పని చేస్తోందని తెలిపారు.

* అమరావతి రాజధానిగా ఉండి ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పామర్రులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పామర్రు ఎన్టీఆర్ కూడలి జనసంద్రమయ్యింది. మచిలీపట్నం-విజయవాడ రహదారి కూడలి కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేదన్నారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్‌.. 3 రాజధానులు కడతారంట అని విమర్శించారు. ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి గానే మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు యువతకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని భరోసా ఇచ్చారు.

* ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని ఈ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియోలు షూట్‌ చేస్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలక్‌, పారి అనే ఇద్దరు మహిళలు ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియో రీల్స్‌ చేస్తుండగా.. మహిళా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారిపై ఆ ఇద్దరు మహిళలతో పాటు అక్కడ ఉన్న మరికొందరు దాడికి పాల్పడ్డారని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జి అజయ్ వర్మ వెల్లడించారు. మహిళా గార్డులుగా పనిచేస్తున్న వారిని శివానీ పుష్పాడ్‌, సంధ్య ప్రజాపతి, సంగీత చంగేసియాగా గుర్తించారు. ఈ ముగ్గురు సిబ్బంది ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ తరఫున ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరిపై అనుచితంగా దాడి చేసిన నిందితులు నాగ్దా పట్టణానికి చెందినవారిగా గుర్తించి.. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

* తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎంతో జగన్‌ను పోల్చారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ‘ప్రొవైడర్‌’ మోడ్‌లోనే జగన్‌ ఉండిపోయారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం లేదు. ప్రజలకు నగదు బదిలీ చేశారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిని మరింత ఊతమిచ్చేందుకు ఏమీ చేయలేదు‘’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులోనూ జగన్‌ ఓటమి ఖాయమని పీకే చెప్పిన విషయం తెలిసిందే.

* వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్‌ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

* ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 113 పరుగులు (స్ట్రైక్‌రేట్‌ 156.94) చేశాడు. 67 బంతుల్లో శతకం మార్క్‌ను తాకాడు. ఐపీఎల్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో ఇదొకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే కూడా 67 బంతుల్లోనే శతకం చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ఈ క్రమంలో కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. ‘‘రాజస్థాన్‌పై బెంగళూరు కనీసం 20 పరుగులు వెనుకబడింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ బాగుంది. అయితే, జట్టులోని మిగతావారిలో డుప్లెసిస్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడలేకపోయారు. దినేశ్‌ కార్తిక్, లామ్రోర్ బ్యాటింగ్‌కే రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ పడిపోయింది. ఇతర బ్యాటర్లు చేతులెత్తిసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ భారం విరాట్‌ కోహ్లీపైనే పడింది. అతడి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. ఇన్నింగ్స్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తీసుకున్న కొందరు ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచారు. మ్యాక్సీ మరీ దారుణంగా విఫలమయ్యాడు’’ అని ట్రోలర్స్‌కు సెహ్వాగ్‌ కౌంటర్ ఇచ్చాడు.

* లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతల్ని ఆ సంస్థలు భాజపాలో చేరాలని అడుగుతున్నాయని.. లేదంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయంటూ ఆరోపించారు. ఆదివారం పురులియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దీదీ మాట్లాడారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, ఐటీ వంటి సంస్థలు భాజపాకు ఆయుధాలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల్ని వేధించేందుకు ఈ సంస్థలను కేంద్రంలోని భాజపా సర్కార్‌ వాడుకుంటోందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సంస్థలు సోదాలు చేస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయని విమర్శించారు. రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరైనా తమ ఇంట్లోకి ప్రవేశిస్తే మహిళలు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.

* డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ నిర్వాహకులు పారా లక్ష్మయ్య ఆదివారం తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొత్తజడ్డవారిపాలెం గ్రామానికి చెందిన విద్యావేత్త లక్ష్మయ్య.. సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా నేతలు, చంద్రబాబు సమక్షంలో పసుపు జెండా కప్పుకొన్నారు. దిల్లీ, హైదరాబాద్‌, డెహ్రాడూన్‌, విజయవాడ, తిరుపతి, వినుకొండలో ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ నిర్వహిస్తూ ఎంతో మంది యువత.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వంటి సర్వీసులకు ఎంపికయ్యేలా కృషి చేశారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యమని లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

* ‘‘బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎంతోకాలం ఎదురుచూశా. దర్శకుడు అట్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. ‘జవాన్‌’ కథతో అతడు నా వద్దకు వచ్చినప్పుడు కమర్షియల్‌ స్టోరీ, స్టార్‌ హీరో చిత్రంతో లాంచ్‌ కావడం కరెక్ట్‌ అనిపించింది. సవాలు విసిరే పాత్ర పోషించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. షారుక్‌కు అభిమాని కాకుండా ఎవరైనా ఉంటారు? ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగా. అగ్ర కథానాయకుడు అయినప్పటికీ సెట్‌లో ఉన్న మహిళలకు ఆయన ఎంతో గౌరవం ఇస్తారు’’ అని నయనతార చెప్పారు. కెరీర్‌ రాణించేందుకు విఘ్నేశ్‌ తనకెంతో సపోర్ట్‌ చేశాడని ఆమె అన్నారు. తమని కలిపింది ధనుష్‌ అని విఘ్నేశ్‌ పేర్కొన్నారు.

* ఏపీలో ఏన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని కలిసి నిర్వహించే విధంగా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ప్రజాగళం మూడో విడతలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు కలిసి పాల్గొననున్నారు. ఈనెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ప్రజాగళంలో పాల్గొననున్నారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఇరువురు ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z