🕑 Published: June 11, 2026 at 08:02 AM CST
డెన్మార్క్ లో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు విజయవంతంగా జరిగింది. ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకల్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావులు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ యూరప్ సమన్వయకర్త అమర్నాథ్ పోట్లూరి అధ్యక్షత వహించారు.
జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయించాలని తెదేపా అధిష్టానం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ..తెలుగు జాతికి, తెలుగు భాషకు ఎన్టీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవారని పేర్కొన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ సమాజమైన మృతసమాజంగా మిగులుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ 24నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో 20ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని కొల్లు రవీంద్ర, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని గూగుల్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం చారిత్రాత్మకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిబాబు చెరుకూరి, సీతారామయ్య జాస్తి, సుధాకర్ చాగంటి, మధుబాబు నిమ్మగడ్డ, బాలకృష్ణ యాగంటి, ప్రవీణ్ జంపని తదితరులు పాల్గొన్నారు.

