ScienceAndTech

హైదరాబాద్ పోకిరీల పాలిట యమపాశం-షీ టీం

SHE Teams Using Technology To Break Bones Of Hyderabad Eveteasers

పోకిరీలు అటూ ఇటూ చూస్తారు.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనుకుంటే ఆకతాయి పనులకు పదును పెడతారు.. ముఖ్యంగా షీ బృందాలున్నాయా.. లేదా..? అని పరిశీలిస్తారు. ఎవరూ లేకుంటే చాలు వేధింపుల పర్వానికి తెర లేపుతారు. ఈ తరహా ఆగడాలు పెరిగిపోవడంతో షీ బృందాలూ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చరవాణినే అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఆకతాయిల లీలలను చిత్రీకరించేందుకు వాటినే ఆయుధాలుగా వినియోగిస్తున్నారు. దీంతో పోకిరీలు అడ్డంగా దొరుకుతూ అవస్థల పాలవుతున్నారు. వేధింపులకు పాల్పడుతూ చిక్కుతున్న ఆకతాయిలను న్యాయస్థానాల్లో దోషులుగా తేల్చేందుకు చరవాణి వీడియోలే కీలకమవుతున్నాయి. అమ్మాయిలపై వేధింపుల పర్వానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ ఉన్నతాధికారులు షీ బృందాలను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఈ బృందాలు నిత్యం పలు కీలక కూడళ్లలో తిష్ఠ వేసి పోకిరీల కదలికలపై నిఘా ఉంచుతున్నాయి. బస్టాప్‌లు, కళాశాల ప్రాంగణాలు, పార్కులు, మల్టీప్లెక్స్‌లు, ఆలయాలు, థియేటర్ల నుంచి మొదలుకొని చివరకు మెట్రో రైళ్లలోనూ ఈ బృందాలు ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ఈ బృందాలు తొలినాళ్లలో కెమెరాలతో పోకిరీల లీలలను చిత్రీకరించేవి. అమ్మాయిలను టీజ్‌ చేసే కుర్రకారు ఆకతాయి పనులను సాక్ష్యాల రూపంలో న్యాయస్థానం ముందు ఉంచేందుకు అవి ఉపయోగపడేవి. కొన్ని సందర్భాల్లో వేధింపులకు పాల్పడి అడ్డంగా దొరికినా బుకాయించే ప్రబుద్ధులను దారికి తెచ్చేందుకు ఇలా చేసేవారు. ఈ తరుణంలో షీ బృందాల కదలికలపై ఆకతాయిలు కన్నేయడం ఆరంభించారు. ఈ బృందాలు మఫ్టీలోనే ఉంటున్నా కెమెరాలు చేతిలో కనిపిస్తే చాలు బుద్ధిమంతులుగా మారిపోయేవారు. షీ బృందాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే రెచ్చిపోయేవారు. ఈ పరిస్థితులను గుర్తించిన షీ బృందాలూ పంథా మార్చాయి. చేతిలో కెమెరాలను పక్కన పెట్టేసి చరవాణులనే అస్త్రాలుగా చేసుకుంటున్నాయి. ఫోన్‌ మాట్లాడుతున్నట్లుగానో.. గేమ్‌ ఆడుతున్నట్లుగానో నటిస్తూ పోకిరీల లీలలను చిత్రీకరిస్తుండటం మొదలుపెట్టాయి. ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరి చేతిలో చరవాణి ఉంటుండటంతో షీ బృందాలను పసిగట్టడంలో పోకిరీలు విఫలమవుతూ అడ్డంగా దొరికిపోవడం సాధారణమైపోయింది. పోకిరీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన షీ బృందాలు చాలా వరకు విజయవంతమవుతుండంలో చరవాణుల దృశ్యాలే కీలకంగా ఉంటున్నాయి. పోకిరీల దుశ్చర్య సాధారణంగానో, తెలిసీ తెలియని తనంతోనో ఉంటే పెట్టీ కేసు నమోదుచేస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే అందుకు అనుగుణంగా ఐపీసీ సెక్షన్లు ప్రయోగించి న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. ఇలాంటి సమయంలో కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలే తిరుగులేని సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటి ఆధారంగానే న్యాయస్థానం జైలుశిక్ష సైతం విధించేందుకూ ఆస్కారం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో షీ బృందాల చేతిలోని చరవాణులే గూఢచారుల అవతారమెత్తుతుండటం విశేషం. షీ బృందాలు మనుగడలోకి వచ్చిన తొలినాళ్లలో స్పై కెమెరాలతోనూ పోకిరీల చేష్టలను బంధించే ప్రయత్నం చేశారు. చెవిలో పెట్టుకొనే బ్లూటూత్‌, కళ్లకు పెట్టుకొనే జోడు, జేబులో పెట్టుకొనే పెన్ను.. ఇలాంటి పరికరాలను వినియోగించేవారు. వాటి చిత్రీకరణలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆకతాయిల చేష్టలను చిత్రీకరించాల్సి వచ్చినప్పుడు పొజిషన్‌ సరిగ్గా లేకపోవడం, ఎత్తు సరిపోకపోవడం.. తదితర కారణాలతో దృశ్యాల చిత్రీకరణ స్పష్టంగా ఉండేదికాదు. దీనికి తోడు సాక్ష్యాలుగా మలిచేందుకు ఇక్కట్లు పెరిగిపోవడంతో వాటికి స్వస్తి పలికారు. కెమెరాలతో తీస్తుంటే పోకిరీలు గుర్తిస్తుండటంతో ఆండ్రాయిడ్‌ సదుపాయమున్న చరవాణినే అస్త్రంగా ప్రయోగించడం ఆరంభించారు.